అరిథ్మియా అంటే  ఏమిటి? 

family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

కార్డియాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 37. రెండు వారాల కింద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. అప్పట్నుంచి చాలా నీరసంగా ఉంటోంది. ఆయాసం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉన్నాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా కావచ్చంటున్నారు. అంటే ఏమిటి? దీంతో ఏమైనా ప్రమాదమా వివరించండి. – కె. ఆనంద్, వికారాబాద్‌ 
సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు  కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్‌ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్‌ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి.

గుండె పోటును గుర్తించడం ఎలా?
మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కొద్దిసేపట్లోనే కన్నుమూశారు. ఇదివరకు ఎలాంటి గుండెజబ్బులు లక్షణాలు కనిపించలేదు. ఇలా మా కుటుంబంలో చాలామందికి జరిగింది. మనం గుండె జబ్బును ముందుగానే తెలుసుకోవడం ఎలాగో చెప్పండి.  – వినయ్‌కుమార్, మచిలీపట్నం
మీ నాన్నగారికి వచ్చిన గుండెపోటును సడన్‌ కార్డియాక్‌ డెత్‌ లేదా సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం కుటుంబ సభ్యులో, స్నేహితులో తక్షణం ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటి ఉదంతాలు  సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ జరిగినప్పుడు కనిపిస్తాయి. 

ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది... 
∙గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు ∙గుండె కండరం బలహీనంగా ఉన్నవారు ∙కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు ∙కుటుంబంలో గుండె విద్యుత్‌ సమస్యలు ఉన్నవారు ∙గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు.

రక్షించే అవకాశం ఉంది... 
గుండెపోటు అన్నది క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య.  అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్‌ ఎటాక్‌ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి. 

గుండెపోటును గుర్తుపట్టడం ఎలా? 
ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనలను పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో పల్మునరీ రిససియేషన్‌–సీపీఆర్‌) చేయాలి. సీపీఆర్‌ వల్ల కీలక ఘడియల్లో ప్రాణంపోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది.గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి  సీపీఆర్‌ ఇచ్చి ఆంబులెన్స్‌ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది.  అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించడం అవసరం.
డాక్టర్‌ హేమంత్‌ కౌకుంట్ల 
సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్
సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top