నిత్య జీవితంలో భక్తిసాధన

Devotional information - Sakshi

‘తిరువళ్లువార్‌’ మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని అల్లుకొచ్చేవాడు. వారంలో ఒకరోజును పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నెనిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటినిగాని, సూదినిగాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకికి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి ‘నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’ అనడిగింది భర్తను. సరేనన్నాడు తిరువళ్లువార్‌.

‘‘మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరెప్పుడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది’’ అని అడిగింది. తిరువళ్లువార్‌ చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కిందపడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం.

నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు’’అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్‌ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో చేస్తే ఇంతకంటే భక్తి సాధన వేరొకటి లేదు.

– డి.వి.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top