ఐదైనా చాలు

Devankita Inspired By Mamata Banerjee Speech - Sakshi

ఎక్కడా డబ్బు పుట్టడం లేదు. లాక్‌డౌన్‌.. లూటీ చేసేసింది! ఏదో ఉంటున్నామంతే.. ఏదో తింటున్నామంతే.. ఇదీ.. సిట్యుయేషనల్‌ సాంగ్‌. ఇంత కాటకంలో కూడా.. ఓ చిన్నారి పాట డబ్బుని సృష్టిస్తోంది. ‘ఐదైనా చాలు’ అని రిలీఫ్‌నిస్తోంది. 

దేవాంకిత దగ్గర మొదట పదివేలు ఉండేవి. కిడ్డీ బ్యాంకులో తను దాచుకున్న డబ్బు అది. హుండీని తెరచి చూసేవరకు అంత మొత్తం ఉందని తనకూ తెలీదు. అయితే తను చేయబోతున్న పనికి అది చాలా చిన్న మొత్తంగానే అనిపించింది దేవాంకితకు. ఆ పదివేలను సీఎం కోవిద్‌ రిలీఫ్‌ ఫండ్‌కి ఇచ్చేసింది ఆరేళ్ల ఆ చిన్నారి! దేవాంకిత చక్కగా పాడుతుంది. దేవగానమే. అమ్మానాన్నతో కలిసి ‘సోరై’లకు (సాయంత్రపు వేడుకలకు) వెళ్లినప్పుడు దేవాంకితను అంతా పాడమనేవారు. ఆ ‘పసి’డి గాత్రానికి ముగ్ధులై.. ముద్దులు, నగదు బహుమతులు ఇచ్చేవారు. అలా సమకూరిందే దేవాంకిత కిడ్డీ బ్యాంకులోని డబ్బంతా. దేవాంకిత తల్లి పరోమా బెనర్జీ గృహిణి. సంగీతం అంటే ఇష్టం. ఈ వేసవిలో కూతుర్ని సంగీతం క్లాసులకు పంపించాలని అనుకున్నారు కూడా. ఈలోపే లాక్‌డౌన్‌!

కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా తను ఇచ్చిన పదివేల రూపాయలు చాలా చిన్న మొత్తం అని దేవాంకితకు అనిపించడానికి కారణం.. టీవీలో ఆమె విన్న మమతా బెజర్జీ ప్రసంగం. ‘‘మీరిచ్చేది ఎంత అని కాదు. ఐదు రూపాయలు ఇవ్వగలినా.. కరోనాను తరిమికొట్టే ఈ యుద్ధంలో అది పెద్ద మొత్తమే అవుతుంది’’ అన్నారు మమత. అది పడిపోయింది దేవాంకిత మనసులో. ఆ యుద్ధానికి తను ఇంకా.. ఇంకా ఇవ్వాలనుకుంది. తన గొంతు బాగుంటుందని అందరూ అంటారు. బయటికి వెళ్లి పాటలు పాడితే? రిలీఫ్‌ ఫండ్‌ కోసం పాట పాడుతున్నాను.. మీకు పాట నచ్చితే, మీరు ఇవ్వగలినంతే ఇవ్వండి. మీరిచ్చేది ఐదు రూపాయలే అయినా కరోనాను తరిమికొట్టే ఈ యుద్ధంలో అది పెద్ద మొత్తమే అవుతుంది’’.. అని ముఖ్యమంత్రి గారు విజ్జప్తి చేసినట్లు అడిగితే?! ఈమాటే తల్లితో చెబితే.. ‘గుడ్‌ ఐడియా’ అని మురిపెంగా కూతుర్ని దగ్గరకు లాక్కుంది. తండ్రికి కూడా ఆ ఆలోచన నచ్చింది. ‘మమ్మల్ని కూడా కలుపుకుంటావా?’’ అన్నారు నవ్వుతూ.

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ఉదయంపూట కొన్ని గంటలు కోల్‌కతాలోని మార్కెట్‌ కూడళ్లలో సడలింపు ఉంది. ఆ సమయాన్ని ఎంచుకున్నారు ముగ్గురూ. అక్కడ పాడేది దేవాంకిత. పాటకు ముందు.. లాక్‌డౌన్‌ మన మంచి కోసమేనని, కరోనా తో ఫైట్‌ చేసేందుకు ప్రతి ఒక్కరం ప్రభుత్వానికి ఆయుధం అవ్వాలని తోచిన మాటల్లో చెప్పేది. తర్వాత పాడేది. పాడే ముందు అచ్చు మమత లానే ‘ఐదైనా చాలు’ అని విజ్ఞప్తి చేసేది. పాటయ్యాక చప్పట్లు వినిపించేవి. ఆ కరతాళ ధ్వనుల్లోంచి విరాళాలూ వచ్చేసేవి.అలా వారం పది రోజులకే డెబ్భైవేలు జమ అయ్యాయి. వెంటనే వాటిని రిలీఫ్‌ ఫండ్‌కి చేర్పించింది దేవాంకిత. ఈ పౌరురాలి స్వశక్తి విరాళం మొత్తం ఎనభై వేలు! దేవాంకిత ఒకటో తరగతి చదువుతోంది. టీవీల్లో న్యూస్‌ చూస్తుంటుంది. పాడేందుకు వెళ్లినప్పుడు టీవీలో తను చూసిన లాక్‌డౌన్‌ ఉల్లంఘనల గురించి కూడా మాట్లాడుతూ.. అలా చేయడం తప్పు అని చెబుతోంది. ‘‘ఈ పిల్లకు ఇంత తెలివి ఏమిటని ఆశ్చర్యపోవడమే మేమిప్పుడు చేస్తున్నది’’ అంటున్నారు దేవాంకిత తల్లీతండ్రి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top