నా చిన్ననాటి చందమామ | Dasaradhi Rangacharya Jeevanayanam Story | Sakshi
Sakshi News home page

నా చిన్ననాటి చందమామ

Jan 27 2020 12:30 AM | Updated on Feb 2 2020 10:57 PM

Dasaradhi Rangacharya Jeevanayanam Story - Sakshi

నా చిన్ననాటి చందమామ చిన్నగూడూరు. అది అందాల రాశి. అది వసంతం. అది హేమంతం. చిన్నగూడూరుకు ఒకవైపున ఆకేరు. నిర్మలంగా, స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. మరొక వైపు తుమ్మిడి చెరువు. ఇది పెద్ద చెరువు. దీని కింద రెండు పంటలు పండుతాయి. ఊరిని అనుకుని ఒక పెద్ద మామిడితోట. అది ‘‘ధర్మతోట’’. అది ఒకరికి చెందింది కాదు. గ్రామానిది. ఆ తోట కాయలు అమ్మరు. అది పక్షుల ఆహారం కోసం వేసింది. వీధులు వంకరలుగా ఉన్నా ఏ సందునుంచి వచ్చినా ముఖ్యమార్గానికి కలుస్తాయి. నిత్యకృత్యంగా అన్ని ఇళ్లముందూ ఊడిచి పెండనీళ్లు చానిపించల్లేవారు. పచ్చని నేలమీద పడుచు పిల్లలు తెల్లని ముగ్గులు వేసేవారు. ముగ్గు అంటే రాతిపిండి కాదు. వరి పిండి. అది చీమలలాంటి వాటికి ఆహారం. ప్రతి ఇంటికీ విడిస్థలం తప్పనిసరి. ఇంటిముందు ఆచ్ఛాదన కింద అరుగులు ఉండాలి. అవి బాటసారులకు. భోజనం చేసేముందు ఇంటిముందున్న అరుగులు చూడాలి. అతడు అతిథి దేవుడు.

అన్ని ఇండ్లకూ బావులు ఉండేవి. ప్రతి ఇంట్లోనూ ఏవో పండ్ల చెట్లుండేవి. కూరగాయలు ఇండ్లలోనే కాసేవి. సొర పాదులు, గుమ్మడి పాదులు పాకిన గుడిసెలు ఎంతో అందంగా ఉండేవి. కూరగాయలు అమ్మటం ఎరుగరు. ఒకళ్లకు ఒకళ్లు ఇచ్చుకోవడమే! అయితే, ఎండకాలం కూరగాయలు వుండవు. అందుకు సిద్ధంగానే ఉండేవారు. గొయ్యి తవ్వి దోసకాయలు బూడిదలో పెట్టేవారు. ఒరుగులు, వడియాలు, పప్పులు, మామిడికాయలు, చింతపండుతో వెళ్లదీసుకునేవారు. తప్పాల చెక్క, ఉప్పుడు పిండి, కుడుములు, అట్లు, గారెలు– అప్పుడు తినే పిండి వంటలు. అరిశెలు, బూరెలు, జంతికలు, చక్కినాలు, చేగోడీలు, అటుకులు, పోపుబియ్యం వగైరాలు– నిలవ ఉండే పిండి వంటలు.

అది వంటరి బ్రతుకు కాదు. ఉమ్మడి బ్రతుకు. నిలవా పిండి వంటలకు ఊళ్లో బంధువులు అంతా కూడుతారు. ముచ్చట్లు, నవ్వులాటలు, పాటలు. పనిలా ఉండదు. ఆటలా ఉంటుంది. ఒక పండుగలా ఉంటుంది.
పాడి కూడా సర్వసాధారణం. పాలు అమ్మటం పాపంగా భావించేవారు. దాలిలో కాచిన పాలు– ఎర్రగా మీగడ కట్టి! పాడి ఉన్నా పాలు తాగడం లేదు. టీ కాఫీ పేరు తెలియదు. కవ్వంతో చల్ల చేయడం ఒక కళ. ఆ శబ్దం ఒక స్వరం. వెన్న తీసి నేయి కాస్తుంటే కమ్మని వాసన!
ఏదండీ ఆ నేయి! ఏదండీ ఆ చల్ల!

వంటకు చాలావరకు అందరూ మట్టిపాత్రలే ఉపయోగించేవారు. మా ఇంట్లోనూ ఒక్క అన్నం వార్చడం తప్ప– కూరలు వగైరాలు మట్టి పాత్రలే. బిందెలు, గుండీలు, కంచాలు మాత్రం ఇత్తడివి. అప్పటివారు చాలా ముందుచూపుగలవారు. బల్లపీటలు, కుర్చీలు, పాత్రలు ఏమి చేయించినా తరతరాలు ఉండేటట్లు చేయించేవారు. భోజనాలు విస్తళ్లలోనే– అయినా కంచాలుండేవి. వాటికి కళాయి పోసేవారు. చద్దన్నంలో మామిడికాయ పచ్చడి– పేరిన నెయ్యి కలిపేది మా అమ్మ. మా అన్నయ్యనూ, నన్నూ కూర్చుండబెట్టుకునేది. చెరొక ముద్దా పెడ్తుండేది. ఆ ముద్ద అమృతం. అది అమృతానందం!

దాశరథి రంగాచార్య ‘జీవనయానం’లో ఆవిష్కృతం చేసిన దృశ్యానికి ఇప్పుడు మనం చాలా దూరం జరిగివుండొచ్చు. కానీ సమీపించవలసిన కలగా ఇప్పటికీ దానికి మన్నన ఉంది. ఒక స్వయం సమృద్ధ గ్రామానికి ప్రతీకలా నిలిచే ఆయన తన చిన్నతనపు ఊరి వర్ణన సంక్షిప్తంగా:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement