‘సూరజ్‌’ సాగు సూపర్‌!

Cotton revolution without Bt - Sakshi

 నాన్‌ బీటీ దేశీ పత్తిని సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తున్నజనగామ జిల్లా రైతులు

సొంత వనరులతోనే తక్కువ పెట్టుబడితోనే ఆదర్శ సేద్యం

మూడేళ్ల నుంచి రసాయనాల జోలికి వెళ్లని పత్తి రైతులు

ఇతర రైతుల కన్నా క్వింటాకు రూ. వెయ్యి అదనపు రాబడి

కరువుకు కేరాఫ్‌గా మారిన మెట్ట/చల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువులను ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో, తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్‌ రకం నాన్‌ బీటీ – దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.

నిత్యం కరువుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంత చల్కా/మెట్ట భూముల రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్‌.ఎ.) మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం రైతులు మూడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్‌ అనే సూటిరకం నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కో ఆపరేటివ్, ఏనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో.. మాణిక్యపురం, ఎనబావి, కళ్లెం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు.

లింగాల ఘనపురం మండలం సిరిపురానికి చెందిన రైతు కుబర్ల గిరిబాబు డిగ్రీ వరకు చదువుకొని, పది ఎకరాల భూమిలో కొంతకాలం బీటీ పత్తి సాగు చేశారు. బీటీ పత్తి విత్తనాల వల్లనే బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తున్నాయనే భావనతో గిరిబాబు సి.ఎస్‌.ఎ. తోడ్పాటుతో పదేళ్ల క్రితం నుంచే సేంద్రియ సాగు చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తితోపాటు వరి, కంది పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నారన్నారు. సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవన్నారు. తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని, తమ పంటకు మార్కెట్‌లో గిరాకీ ఉందని గిరిబాబు(99126 88157) అన్నారు.

సేంద్రియ సాగుతో లాభాలు ఇవీ...
► ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల అవసరం లేదు.
► సూరజ్‌ వంటి నాన్‌ బీటీ, దేశీ పత్తి విత్తనాల వల్ల భూసారం దెబ్బతినదు. 
► ఈ పత్తి నుంచి విత్తనాలు తీసి, మళ్లీ వాడుకోవచ్చు. ప్రతి ఏటా కంపెనీల నుంచి విత్తనాలు కొనక్కర్లేదు. 
► చెరువు మట్టి, జీవామృతం, వర్మీ కంపోస్టు, పశువుల పేడ ద్వారా భూమిని సారవంతం చేస్తారు. 
► వేపద్రావణం, వావిలాకు కషాయం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేస్తారు.

నాన్‌ బీటీ పత్తి విత్తనాలతో రైతులకు మేలు..
బీటీ పత్తి విత్తనాల మాదిరిగా దేశీ పత్తి రకాల సాగులో రసాయనాల అవసరం ఉండదు.
వర్షధారంగా ఎకరానికి 4–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
పత్తిని అమ్ముకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు. దేశీ పత్తితో వస్త్రాలు నేసే సంస్థలే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి∙
ఎలాంటి కమీషన్లు ఉండవు.    
ప్రస్తుతం సీసీఐ క్వింటా పత్తికి రూ.4,000 చెల్లిస్తుంటే.. నాన్‌బీటీ పత్తికి రూ. 5,100 ధర పలుకుతున్నది. 

ప్రభుత్వం ప్రోత్సహించాలి!

దేశీ పత్తి రకం సూరజ్‌ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నేలల్లో సాగుకు అనుకూలమైనది. ఈ సంవత్సరం సహజాహారం ప్రొడ్యూసర్‌ కంపెనీ ఆధ్వర్యంలో కొందరు రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయించాం. చేనేత సంస్థలు మల్కా, అభిహార రైతుల నుంచి సూరజ్‌ దేశీ పత్తి(28–32 ఎం.ఎం. పింజ)ను అధిక ధరకు కొనుగోలు చేశాయి. సూరజ్‌ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 150 క్వింటాళ్ల వరకు సూరజ్‌ విత్తనాలు ఉన్నాయి. ఆసక్తిగల రైతులు సహజ ఆహారం ప్రొడ్యూసర్‌ కంపెనీ(85007 83300)ని గానీ, కిసాన్‌ కాల్‌ సెంటర్‌ (85009 83300)ను గానీ సంప్రదించవచ్చు.
– డా. జీవీ రామాంజనేయులు, డైరెక్టర్‌ జనరల్, సుస్థిర వ్యవసాయ కేంద్రం ramoo@csa-india.org

చేతి కష్టమే పెట్టుబడి!

రెండు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నా. మూడు సంవత్సరాల నుంచి ఇదే సాగు. వర్షం పడితేనే నీళ్లు. బోరు, బావి లేవు. డిసెంబర్‌ నాటికే పంట పూర్తిగా అయిపోతుంది. డిసెంబర్‌లో వర్షం పడితే మరో రెండు నెలలు పంట వస్తుంది. చేతుల కష్టమే పెట్టుబడి.  ఇప్పటికైతే నష్టపోలేదు. డబ్బుల దగ్గర , ధర విషయంలో ఎలాంటి కిరికిరి లేదు.
– మూటకోరు యాదగిరి (70324 64439), సేంద్రియ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా

మందులు కొనడం మానేశా!
నాకు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. మూడేళ్ల నుంచి నాన్‌బీటీ పత్తిని వేస్తున్నా. విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, కషాయాలు అన్నీ నావే. ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తిని అమ్మితే మాత్రం రూ. 20 వేల వరకు వస్తున్నాయి. పురుగుల మందులు కొనడం పూర్తిగా మానేశాం. రవాణా ఖర్చులు, కటింగ్‌లు, కమీషన్లు లేవు. శరీరంపై ప్రభావం చూపే మందుల వాడకం లేదు. నీటి సౌలతి ఉంటే ఎక్కువ దిగుబడి వచ్చేది. నాన్‌బీటీతో లాభాలే తప్ప నష్టాలు లేవు.                      
– చెన్నూరి ఉప్పలయ్య (95025 06186), సేంద్రియ నాన్‌బీటీ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా 

– ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ జిల్లా
ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top