ఉన్నట్టుండి  ఎందుకు  కళ్లు తిరిగి  పడిపోతున్నాను

Consult ENTI Doctors and Make Clinical Examination of Hearing - Sakshi

నా వయసు 49 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్‌ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్‌ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన సలహా ఇవ్వండి. 
 
మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్‌ పొజిషనల్‌ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్‌ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్‌ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో  ఓటోలిత్‌ అనే కణాలు, హెయిర్‌ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.

వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్‌ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్‌ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్‌ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది.

సర్జరీ తర్వాత నుంచి మాట సరిగా రావడం లేదు

నాకు ఈమధ్యనే గుండెకు సంబంధించిన ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. అప్పట్నుంచి  నాకు మాట సరిగా రావడం లేదు. ఎంత ప్రయత్నించినా స్వరం పెగలడం లేదు. మాట కూడా ఏదో గాలి బయటకు వస్తున్నట్లుగా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. అంతేకాదు... ఇప్పుడు  తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. పరిష్కారం చెప్పండి. 

మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్‌ ఫోల్డ్‌’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్‌కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్‌ ఫోల్డ్‌ పెరాలసిస్‌ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతుకాకుండా మీరు స్పీచ్‌ థెరపిస్ట్‌ను సంప్రదించి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లు కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

వోకల్‌ నాడ్యూల్స్‌ ఎందుకొస్తాయి... పరిష్కారం చెప్పండి

నేను వృత్తిరీత్యా టీచర్‌గా పనిచేస్తున్నాను. ఇంటికి వచ్చాక కూడా ట్యూషన్స్‌ ఎక్కువగా చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్‌ నాడ్యుల్స్‌’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి. 

వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్‌ నాడ్యూల్స్‌. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్‌ నాడ్యూల్స్‌ వల్ల స్వరపేటికలోని రెండు అర్థభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ వాయిస్‌) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు.

మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్‌ కార్డ్స్‌) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్‌ కార్డ్స్‌ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్‌ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్‌ కార్డ్స్‌ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్‌టీ నిపుణులను, స్పీచ్‌ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్‌ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది.

డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్‌ హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్,
 అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top