
తెగుళ్ల వ్యాప్తితో పడిపోతున్న దిగుబడులు... నిలకడ లేని ధరలు కొబ్బరి రైతును కుంగదీస్తున్నాయి. వీటికి తోడు ఎలుకలు, ఉడుతల బెడద వల్ల కాయలను కాపాడుకోవటం కొబ్బరి రైతుకు కష్టమవుతోంది. పిందెల దశ నుంచి కోతకు వచ్చే వరకు ప్రతి దశలోనూ ఉడుతలు, ఎలుకలు దాడి చేసి పంటను నష్టపరిచేవి. పిందెలను కొరికి.. కాయలకు రంధ్రాలు చేసేవి. తమిళనాడులోని కోయంబత్తూర్ పరిసరాల్లోని కొబ్బరి రైతులు కొత్త ఉపాయంతో ఎలుకలు, ఉడుతల దాడి నుంచి పంటను కాపాడుకోవడంలో విజయం సాధిస్తున్నారు.
తిర్పూర్ సమీపంలోని మణికోపురమ్ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతు ఎలుకలు, ఉడుతలు కొబ్బరి చెట్లు ఎక్కకుండా నివారించే ఒక సులభమైన విధానాన్ని కనుగొన్నారు. రెండు అడుగుల పొడవున్న అల్యూమినియం రేకు పలకను కొబ్బరి చెట్టు కాండానికి చుట్టి మేకులు కొట్టారు. అల్యూమినియం రేకు నున్నగా ఉంటుంది. ఎలుకలు, ఉడుతలు చెట్టు ఎక్కే క్రమంలో ఈ అల్యూమినియం రేకుపైకి చేరగానే పట్టు దొరక్క జారి కింద పడిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఈ రేకును దాటి పైకి చేరలే కపోతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలోని రైతులు తమ కొబ్బరి చెట్లకు అల్యూమినియం రేకులను అమర్చి పంటను కాపాడుకుంటూ అధికాదాయాన్ని పొందుతున్నారు. బాగుంది కదండీ.. ఐడియా!
గజరాజులపై పోరులో తేనెటీగలే రైతుల సైన్యం!
ఆఫ్రికా, శ్రీలంక రైతుల బాటలో కేరళ రైతులు
అడవులకు, అభయారణ్యాలకు సమీపంలో పంట పొలాలు, తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను నష్టపరచడమే కాదు మనుషుల ప్రాణాలనూ హరిస్తున్న సంఘటనల గురించిన వార్తలు తరచూ వింటూ ఉంటాం. అయితే, తేనెటీగలతో జతకడితే ఏనుగుల దాడుల నుంచి పంటలను, తమను కూడా రక్షించుకోవచ్చని శ్రీలంక, కొన్ని ఆఫ్రికా దేశాల్లోని రైతులు ఆచరణాత్మకంగా రుజువు చేశారు. పొలాల చుట్టూ ‘తేనెటీగల కంచె’లను ఏర్పాటు చేసుకొని తమ పంటలను కాపాడుకుంటున్నారు.
పొలాల సరిహద్దుల వెంబడి పాతిన కొయ్యలకు పెట్టెలను కట్టి, వాటిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు. ఏనుగులు ఈ పొలాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు తీగ కదిలి తేనెటీగల ప్రశాంతతకు భంగం కలుగుతుంది. పెట్టెల్లో నుంచి బయటకు వచ్చిన తేనెటీగలు ఏనుగులను చుట్టుముడతాయి. వాటి ఝుంకారాలతో గజరాజులను భయపెట్టి విజయవంతంగా పారదోలగలుగుతున్నాయి. తేనె అమ్మకం ద్వారా కూడా రైతులకు అదనపు ఆదాయం వస్తున్నది. శ్రీలంక, ఆఫ్రికా దేశాల్లో రైతుల అనుభవాల స్ఫూర్తితో కేరళ రైతులు కూడా ఏనుగులపై పోరులో తేనెటీగలను తమ సైన్యంగా వినియోగిస్తూ తమ పంటలను కాపాడుకుంటున్నారు.
గతేడాది జనవరిలో త్రిస్సూర్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘తేనెటీగల కంచె’లపై ప్రయోగాత్మక పరిశోధన కోసం రూ. 5 లక్షలు మంజూరు చేసింది. ఏనుగులు ఎక్కువగా పొలాలపై దాడిచేసే మైలత్తుంపుర, వాయనాడ్ సమీపంలోని పూతడి.. మలప్పురం సమీపంలోని మేయిలాదుంపార ప్రాంతాల్లోని రైతులు తేనెటీగల కంచెలను ఏర్పాటు చేశారు. 2 కి. మీ. పరిధిలోని 27 మంది రైతులు పొలాల వెంబడి తేనెటీగలను ఏర్పాటు చేశారు. ప్రతి 10 మీటర్లకు ఒకటి చొప్పున తేనెటీగల బాక్సులను తీగలకు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పంటలపై ఏనుగులు దాడి చేయటం చాలా వరకు తగ్గినట్టు కేరళ అటవీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘తేనెటీగల కంచె’ల వల్ల తన కొబ్బరి తోటలోకి ఏనుగులు రాలేదని జోజి అనే రైతు ఆనందంగా చెప్పాడు. అంతేకాదు ఒక్కో పెట్టె నుంచి 2 కిలోల తేనె లభిస్తోంది. కిలో రూ. 300 చొప్పున విక్రయిస్తూ రైతులు అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు.
ఈ నెల14న విజయవాడలో గో ఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో సమ్మేళనం ఈ నెల 14(శనివారం)న విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మశీ కాలేజీలో జరుగుతుంది. భారతీయ కిసాన్ సంఘ్ సేంద్రియ సేద్య విభాగం జాతీయ కన్వీనర్ రతన్‌లాల్ డాగా (రాజస్తాన్), ఆరుతడి వరి సేంద్రియ సాగు నిపుణుడు పెరుమాళ్లు (తమిళనాడు), ప్రకృతి వ్యవసాయోద్యమ నేత రమేశ్‌రాజు (కర్ణాటక) సహా 7 రాష్ట్రాల ప్రతినిధులు అతిథులుగా పాల్గొంటారు. ప్రకృతి వ్యవసాయదారులంతా వేలాదిగా తరలిరావాలని గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నేతలు రామకృష్ణంరాజు, కుమారస్వామి పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా గో ఆధారిత వ్యవసాయదారులను ఘనంగా సత్కరించ నున్నామని తెలిపారు.
15న రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో ఏర్పాటైన రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 15న ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో వరి, కూరగాయల సాగు, ఉద్యాన పథకాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విశాఖ జిల్లా రైతు కన్నుమనాయుడు, గుంటూరు జిల్లా రైతు ధర్మారం బాజి, ఉద్యాన శాఖాధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు.