
వెన్నెల క్లినిక్కులో మేం కవులు రచయితలుగా రెక్కలు తొడుక్కునేటప్పుడు! వచన కవిత్వాన్ని హేళన చేసే పద్యకర్తలనూ, ఫ్యూడల్ అష్టావధానులనూ ఎదుర్కొనే మా యువకుల మధ్య ఉన్నాడున్నాడు దేవపుత్ర!
అది నాలుగు దశాబ్దాల కిందటి అనంతపురం వాతావరణం. స్వాతంత్య్రానంతరం కొత్తగా చదువరులైన శూద్రులు సాహిత్యంలో ఈకలు మొలిపించుకుంటున్న కాలం! అప్పటికే తన తొలి కథను రంగనాయకమ్మ అచ్చువేస్తే, మంచిరెడ్డి శివరామిరెడ్డి యువకవుల సైన్యంలో ఆధునిక వచనాస్త్రంగా నిలిచిన వాడు దేవపుత్ర!
జిల్లా గ్రంథాలయం ఆవరణలో శిరీష కుసుమాల పరిమళాల మధ్య మాకు తారసపడేది అతడే! చిరుమామిళ్ల లిటెరరీ మీట్‌లో చర్చోపచర్చల మధ్య నిశ్శబ్దంగా అతడే! రోడ్డు పక్కన చెట్టు కింద చెడిపోయిన బీగాలు సరిజేసే చెక్కపెట్టె మీద మా మిత్రులతో అతడే! అవును, మనమంతా చెట్టు కింద మిత్రులం కదా!
ఎన్ని కథలు! ఎన్ని సాహిత్య విశేషాల చిట్‌చాట్లు! సంగీతమూ, చిత్రలేఖనమూ మా మధ్యలోకి దిగుమతి చేసేవాడు రఘుబాబు. అటు నుండి వస్తూ వస్తూ జేకేనీ, యూజీనీ పట్టుకొచ్చేవాడు రాయుడు. కానీ కథకు అన్యమైన దాన్ని ప్రేమించడానికి దేవపుత్ర ఇష్టపడేవాడు కాదు.
అప్పటికింకా చెట్టుకింద మిత్రులు ఏర్పడనప్పటి మాట. ఆరామ్ హోటల్‌లో పంచాది నిర్మల, సుబ్బారావు పాణిగ్రాహి మా చర్చలో పచ్చపచ్చగా మొలకెత్తుతూ ఉన్నారు. లలిత కళాపరిషత్‌లో– చారు మజుందార్ నుండీ తరిమెల నాగిరెడ్డి విడిపోతే, తరిమెల నాగిరెడ్డి నుండీ దేవులపల్లి విడిపోతే, ఆ రాజకీయ పరిణామాలలో పోరాటోద్యమ కవులు కూడా రెండుగా విడిపోయిన క్రమమంతా మా చర్చలలో నలుగుతూ ఉండేది. హోటల్ సన్మాన్‌లో దిగంబర కవిత్వాల పలవరింతలతో మా సామాజిక క్రోధం విడుదల అవుతూ ఉండేది. శ్రీశ్రీ ఎమర్జెన్సీ సమర్థన మీద మాటల తూటాలు పేలుతూ ఉండేవి. ఒక వ్యక్తి మరణం ఆ వ్యక్తి గురించిన జ్ఞాపకం మాత్రమే. కానీ ఒక రచయిత గురించిన జ్ఞాపకం అతడు పుట్టిన ప్రదేశం యొక్క సాంస్కృతిక వాతావరణమవుతుంది. అతడు జీవించిన ప్రాంతపు రాజకీయ వాతావరణమవుతుంది. కొన్ని దశాబ్దాల వర్తమాన జీవితానికి ఒక కాలదర్పణమే అవుతుంది. దేవపుత్ర కూడా అంతే. ఏ కాలంతో కలిసి ప్రవహించినవాడు ఆ కాలానికే చారిత్రక సాక్ష్యమవుతాడు కదా!
పెన్నా నది ఒడ్డున కాలువ పల్లెలో పుట్టినవాడు
అతనికి కరువు కోరలకంటిన నెత్తురు తెలుసు
నిమ్నకులంలో పుట్టినవాడు
అతనికి దళిత జీవిత రక్తస్పర్శ తెలుసు
రెండు మూడు ఉద్యోగాలు మారినవాడు
తాను జీవించిన ఉద్యోగాన్ని తిరిగి కథలోకి ఎత్తిరాయడమూ అతనికి తెలుసు.
సముద్రమంత జీవనోత్సాహం అతనిది. కాఫీని కూడా ప్రేమించగల అధికాధిక చిన్న సంతోషాలు అతనివి. చిన్నచిన్న అలలతో పులకరించే నది అతడు. తాలుకా ఆఫీసులో ఆర్.ఐ.గా చేస్తూ చక్కెర కిరోసిన్‌ల కోసం స్టోరు ముందు నిలబడిన శిశు అమాయకత్వం కూడా అతనిదే.
తన జేబులోని కాలాన్ని దేనికి ఖర్చుపెట్టాలో, దేనికి ఖర్చు పెట్టకూడదో తెలిసినవాడు దేవపుత్ర. అందుకే సాహిత్య సృజనను తన మొత్తం జీవితపు వ్యాపారంగా మలుచుకున్నవాడు. అందుకందుకే కదా, రాయలసీమ నలుగురు రచయితల్లో ఒకనిగ తళుక్కుమని మెరిసినవాడు. అంతేనా సాకం నాగరాజ గారూ?
నేను తత్వమూ కవిత్వంలో కొట్టుకొచ్చి అతని గదిలో పడితే, లేపి కూర్చోబెట్టి నాకు కథా రచనలో అన్నప్రాశన చేసినవాడు దేవపుత్ర. మల్లెల కవిత్వాన్ని తన ఇంటి గోడల పైకి ఎక్కించుకున్న కవితా ప్రియుడూ అతడే.
మిత్రమా, శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలలో పెనుగొండ కొండపైన నువ్వు కొట్టిన ఈల ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. అవునా దీవెనా? పెనక చెర్ల డామ్ మీద నీ పిల్లనగ్రోవి పాట ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. అవునా బద్వేలీ!
భాషలో అనుమానాలొస్తే ఇప్పుడు నీ కోసం ఏ అంకెలకు ఫోను చెయ్యను! నవల మొదలు పెడదామా అని పరస్పరం కూడ బలుక్కోవడానికి ఇప్పుడు నాకెవరున్నారు? ... అన్నట్టు, గుర్రం మీద పల్లెలు తిరుగుతూ, వైద్యం చేసే ఆ మాల మహావైద్యగాడు మీ ముత్తాత గురించిన చారిత్రక నవల ఎంతవరకూ వచ్చింది?
ఎవరికైనా– బోధించే మనుషులు దొరకడం సులభం. కాని పంచుకునే మనుషులు దొరకడమే అతి కష్టం! అలకలు కూడా ఇద్దరు మనుషుల మధ్య, ఆదాన ప్రదానాలే కదా! స్నేహితుడా! సమవయస్కుడా! నా కథక గురువా! ఇదే నీకు సకల తెలుగు భాషా ప్రాంతాల అక్షర నివాళి!
బండి నారాయణ స్వామి
8886540990