మాట్లాడితే రూపాయి నోట్ల దండలు

A Book On Mallu Swarajyam Autobiography - Sakshi

‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని గెరిల్లాగా పాల్గొన్న యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆ తరువాత మహిళా నాయకురాలిగా, ఎమ్మెల్యేగా’ పనిచేసిన 86 ఏళ్ల స్వరాజ్యం జీవిత కథను ‘నా మాటే తుపాకి తూటా’గా(కవర్‌ పేజీలో పొరపాటుంది)  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. దీన్ని విమల, కాత్యాయని కథనం చేశారు. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ:

‘‘మా నాన్న వంటి భూస్వాములకు ఇంకా పెద్ద జాగీర్దార్లతో పోటీ ఉండేది. ఫలానా దొరల ఆడపిల్లలు గురుకులంలో చదువుతున్నారు, మనం కూడా వాళ్ల సాంప్రదాయంలో నడవాలె, వాళ్లంత పెద్దగా ఎదగాలె అనేటువంటిది ఉండేది. రేప్పొద్దున ఏమయినా జరిగితే– పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిగితే, స్త్రీలు గూడా జమీందారీ నిర్వహించేట్టుగా తయారు కావాలనేది ఉండేది... అట్లా ఇంటి దగ్గరనే పంతుల్ని పిలిపించి ఆడపిల్లలకు చదువులు చెప్పించిన్రు... చదువు, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నా.’’

‘‘ఒక రోజున ఎల్లమ్మ అనేటామె వడ్లు దంచుతూ కళ్లు తిరిగి పడిపోయింది. నేనక్కడే కాపలాగా ఉన్నానప్పుడు. దబదబ నీళ్లు తీసుకపోయి తాపించినా. ఆకలైతున్నదని ఆమె చెప్పంగనే అన్నం తీస్కొచ్చి తిన్పించినా. దంచుతున్నవాళ్లు అందరూ మాక్కూడా ఆకలైతున్నది అన్నం పెట్టమని అడిగిన్రు. ఇంట్లో చూస్తే అంత అన్నం లేదు. బియ్యం తీసుకోని నానపెట్టుకుని తింటమన్నరు. మంచిది, తినమని చెప్పినా. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి మా చిన్నాయనవాళ్లు తప్పు పట్టిన్రు. ‘‘అది చిన్నపిల్ల, ఏమనకండి’’ అని మా అమ్మ నాకు సపోర్టుగా నిలబడ్డది. అది నాకు చాలా స్ఫూర్తిని అందించింది. అప్పటికి మా అన్నయ్య (భీమిరెడ్డి నరసింహారెడ్డి) హైదరాబాదులో చదువుకుంటున్నడు. నాకప్పటికి ఆంధ్రమహాసభ ఉద్యమం గురించి ఏమీ తెల్వదు.’’

‘‘ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లు కూడా స్టేజిల మీదికెక్కి మాట్లాడ్డానికి వెనకాడుతుండిరి. నేను ఉపన్యాసాలిస్తుంటే, బాగా చదువుకున్న దాన్నేమోనని అనుకునేవాళ్లు. బి.ఏ. చదివిన్నని అనుకున్నరట. నిజానికి నా చదువు నాలుగో, ఐదో తరగతులు, అంతే. నా వయసు కూడా పద్నాలుగు, పదిహేనేళ్లకు ఎక్కువ లేదు. ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అని పేరు పెట్టిన్రు నాకు. నేను ఉపన్యాసం ఇస్తుంటే పార్టీ నిధుల కోసమని నా మీదకు డబ్బులు ఎగజల్లేటోళ్లు. రూపాయి నోట్ల దండలేసేటోళ్లు.’’ ‘‘ఒకసారి మా దళం రాత్రిపూట ఒక అడవిలో పడుకున్నం. వెన్నెల రాత్రుల్లో పోలీసుల దాడులు ఎక్కువగా జరిగేవి. అందుకే వెలుతురు పడకుండా చీకటిగా ఉండే చోటు చూసుకొని రక్షణ తీసుకునేవాళ్లం. ఈ రోజు రాత్రి మేము పడుకున్న ప్రదేశంలో గుడ్డెలుగు ఉన్నట్టున్నది. అది దాని జాగా అయ్యుండొచ్చు, ఒక రకమైన వాసనొస్తున్నది... 

అది నా దగ్గరకు వచ్చి గుంజుతుంటె మెలకువయ్యింది. ఇదేదో ఉన్నట్లే ఉన్నదనుకొని కప్పుకున్న దుప్పటి తీసి దాని మీద ఇట్ల పడేసిన. మీద గుడ్డ పడేసినా, కొర్రాయి చూపించినా ఆగిపోతదని కొయ్యోళ్లు చెప్తుంటే వింటుండేదాన్ని. మొకాన గుడ్డ పడంగనే తిక్కలేసినట్లయి ఇసురుకుంటనే పైకి లేచేటందుకు ప్రయత్నం చేస్తున్నది. దాని కాళ్లను మెసలరాకుంట పట్టుకొని వెనక్కి తోసిపారేసిన. బోర్ల పడ్డది... నేను వెంటనే తప్పించుకున్న. ఇంకొకసారి అడవిలో పోతుంటె పులి ఎదురొచ్చింది. నేనిక ఒక గడ్డ మీదెక్కి నిలబడ్డ. ఎటు కదిలితే ఏమయితదోనని అట్లనే నిలబడ్డ. ఆడనే నిలబడి చూస్తున్నదది. కొంత సేపటికి అది ముందుకు అడుగు వేయబోంగనే నేను తుపాకి తీసుకొని పక్కకు పేల్చిన... దానితో భయపడి వెనక్కుమళ్లి ఉరికింది.’’

నా మాటే తూపాకి తూటా
మల్లు స్వరాజ్యం ఆత్మకథ; 
కథనం: విమల, కాత్యాయని; 
పేజీలు: 136; వెల: 120; 
ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌: 040–23521849  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top