
జీతం డాలరు... జీవితం బోలెడు!
శ్వేతసౌధ ప్రాంగణంలోని మెత్తటి పచ్చిక బయలులో చెప్పుల్లేకుండా నడిచినంత సుఖంగా ఏమీ ఉండదు.
శ్వేతసౌధ ప్రాంగణంలోని మెత్తటి పచ్చిక బయలులో చెప్పుల్లేకుండా నడిచినంత సుఖంగా ఏమీ ఉండదు... అమెరికా అధ్యక్ష పీఠం నుంచి ప్రపంచాన్ని నడిపించడం. అందుకే అతడికి ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలేమిటో ఒక అమెరికన్ పౌరుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు తెలిసే ఉంటాయి కానీ, అమెరికా అధ్యక్షుడిగా త్వరలోనే అవి ఆయనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రానున్నాయి. ఆసక్తికరమైన ఆ వివరాలు మీ కోసం...
ఎయిర్ ఫోర్స్ ఒన్ గంటకు 1.24 కోట్ల విమానం
విదేశీ పర్యటనలకు ఉపయోగించే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ అని పిలుస్తారు. నిజానికి అలాంటి విమానమేదీ లేదు! అధ్యక్షుడు ఏ విమానంలో ప్రయాణిస్తే ఆ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అంటారు. సాధారణంగా ఆయన 747-200బి జెట్‌లో ప్రయాణిస్తాడు. అలాంటివి రెండు జెట్లు అమెరికా అధ్యక్షుడి కోసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో గంట ప్రయాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 1,82,000 డాలర్లు. మన రూపాయల్లో సుమారు 1.24 కోట్లు!
గాలిలోనే ‘ఫ్లైట్ టు ఫ్లైట్’ పెట్రోల్
‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో 85 టెలిఫోన్లు ఉంటాయి. 19 టీవీలు ఉంటాయి. ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఒక పర్సనల్ స్వీట్ (వ్యక్తిగత గదుల సముదాయం) ఉంటుంది. బాత్రూమ్, బెడ్రూమ్ మామూలే. ఒక జిమ్ ఉంటుంది. ఒకవేళ మార్గ మధ్యంలో అధ్యక్షుడు తీవ్ర అస్వస్థతకు గురైతే తక్షణ చికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ సిద్ధంగా ఉంటుంది. విమానం రీ ఫ్యూయెలింగ్ కూడా అత్యవసర పరిస్థితుల్లో గాల్లోనే జరుగుతుంది! ఇంధనం ట్యాంకును మోసుకొచ్చిన మరో విమానం గాల్లోనే సమవేగంతో ప్రయాణిస్తూ ఒక ట్యూబ్ ద్వారా ప్రెసిడెంట్ విమానంలో ఇంధనాన్ని నింపి వెళుతుంది.
లోకల్ ట్రిప్పులకు మెరైన్ హెలీకాప్టర్
అమెరికా అధ్యక్షుడి లోకల్ ప్రయాణా లకు, అంటే... వైట్ హౌస్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు, ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు ‘మెరైన్ వన్ హెలికాప్టర్’ (చోకర్) రెడీగా ఉంటుంది. మిలటరీలో ప్రత్యేక విభాగానికి చెందిన నలుగురు పైలట్లకు మాత్రమే దీనిని నడిపే అవకాశం లభిస్తుంది. ఏడాది మొత్తం ఆ నలుగురే నడుపుతుంటారు. ఇలాంటివి 21 హెలీకాప్టర్ల తయారీకి ఒబామా ప్రభుత్వం 120 కోట్ల డాలర్ల కాంట్రాక్టును కుదుర్చుకుంది. అయితే వాటి నిర్మాణం పూర్తి కావడానికి మరో ఆరేళ్లు పడుతుంది! 2022లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అప్పటికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
పంక్చర్ పడినా ఆగని లిమజీన్ కారు!
విమానమే కాదు, అమెరికన్ ప్రెసిడెంటు ప్రయాణించే కారు కూడా ప్రత్యేకమైనదే. పెద్ద పడవ లాంటి ‘లిమజీన్’ స్టైల్ కారు అది. అలాంటివి 12 కార్లు ఎప్పుడూ ఆయన కోసం సిద్ధంగా ఉంటాయి. ఒక్కో కారు ధర 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 10 కోట్ల 16 లక్షల రూపాయలు). ఎలాంటి దాడినైనా తట్టుకోగలిగిన విధంగా అయిదు అంగుళాల మందంతో బాడీ కవరింగ్ ఉంటుంది. బోయింగ్ 757 విమానం డోర్లు ఎంత బరువుగా ఉంటాయో ఈ కారు డోర్లూ అంతే బరువుగా ఉంటాయి! కారు టైర్లకు పంక్చర్ పడినా కూడా అదే వేగంతో అంతరాయం లేకుండా ప్రయాణిస్తాయి. అవసరం అయితే కారులోంచే టియర్ గ్యాస్‌ను ప్రయోగించవచ్చు. పొగ గ్రెనేడ్లను పేల్చవచ్చు. అలాగే కారు లోపల ఆక్సిజన్ సప్లయ్ ఉంటుంది. మంటలార్పే పరికరాలు ఉంటాయి. అధ్యక్షుడి బ్లడ్ గ్రూపు ఏదో ఆ గ్రూపు బ్లడ్ కారులో ఉంటుంది.
సిబ్బంది కోసం నల్లరంగు బస్సులు
అధ్యక్షుడు ఒక్కరే ప్రయాణించరు కదా. అయన వెంట మందీ మార్బలం ఉంటుంది. వారి కోసం ప్రత్యేకంగా రెండు పటిష్ఠమైన నల్ల రంగు బస్సులు ఉంటాయి. అవి ఆయన్ని ఫాలో అవుతాయి. వాటిని ‘గ్రౌండ్ ఫోర్స్ వన్’ వెహికిల్స్ అంటారు.
పూల ఖర్చూ తక్కువేం కాదు!
వైట్ హౌస్ నిర్వహణ ఖర్చులే ఏడాదికి నూటా నలభై కోట్ల డాలర్ల (సుమారు 9 వేల 500 కోట్ల రూపాయలు) వరకు ఉంటాయి. పూలకి అయ్యే ఖర్చు 2 లక్షల 52 వేల డాలర్లు (కోటీ 70 లక్షల రూపాయలు) ఉంటుంది. వైట్ హౌస్‌లో మొత్తం 132 గదులు, 35 బాత్రూమ్లు ఉంటాయి. భద్రతా సిబ్బంది, వంటవాళ్లు, వంట మాస్టర్లు అధ్యక్ష భవనం అధికారుల కనుసన్నల్లో ఉంటారు. ఇంతమంది సిబ్బందికి, అంత సెటప్‌కి ఈ మాత్రం ఖర్చు లేకుండా ఉంటుందా!
భార్యకైనా నో ఎంట్రీ
వైట్ హౌస్‌లో ‘ఓవల్ ఆఫీసు’ ఉంటుంది. అదే ప్రెసిడెంట్ ఆఫీస్! అనుమతి లేకుండా ఓవల్ ఆఫీసులోకి ఎవరూ ప్రవేశించ కూడదు. ప్రెసిడెంట్ సతీమణి కూడా ఓవల్ ఆఫీస్‌లోనికి రాకూడదు. అత్యవసరం అయితే, అదీ అధ్యక్షుడు అనుమతిస్తే మాత్రమే ఆమెను భద్రతా సిబ్బంది లోనికి అనుమతిస్తారు.
ఫ్రీ చాక్లెట్స్... ఫ్రీ సోడా
ఎం అండ్ ఎం చాక్లెట్లు, కోక్, పెప్సీ కంపెనీల సోడా అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అవి ఉచితం. ఎం అండ్ ఎం చాక్లెట్ బాక్సులపై అమెరికా అధ్యక్షుడి అధికార ముద్ర ఉంటుంది.
జీతం ఒక్కటే పెరగలేదు!
అమెరికా అధ్యక్షుడి జీతం 2001లో 2 లక్షల డాలర్ల నుంచి 4 లక్షల డాలర్లకు పెరిగింది. (రూపాయల్లో సుమారు 2 కోట్ల 72 లక్షలు). అప్పటి నుంచీ ఆ మొత్తం అలాగే ఉంది. ప్రస్తుతం ట్రంప్ తనకు ఏడాదికి ఒక్క డాలర్ జీతం చాలు అంటున్నారు.
డెడ్లీ డేంజరస్ బ్యాగ్
పైకి ఎంతో మామూలుగా కనిపించే బ్రీఫ్‌కేస్ ఒకటి ప్రెసిడెంట్ అధీనంలో ఉంటుంది. అందులో సమాచార పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలను ఉపయోగించి అధ్యక్షుడు ప్రపంచంలోని ఏ ప్రాంతంపైనైనా, ఏ క్షణమైనా అణుదాడికి ఆదేశాలు ఇవ్వవచ్చు.