దేవుడి భరోసా

Assure of God - Sakshi

జెన్‌పథం

అనగనగా ఓ జ్ఞాని. అతను మంచి జ్ఞానే. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఈ కాలంలో అక్కడక్కడా మనం చూస్తూనే ఉన్నాం. కొందరు నకిలీస్వాములను కూడా. కానీ మన కథలోని జ్ఞాని ఎంతో మంచివారు. ఓ రోజు అతని ఆశ్రమానికి ఓ వ్యక్తి వస్తాడు. జ్ఞానికి నమస్కరించి ఆకలేస్తోందని అంటాడు. అతని  వినయానికి జ్ఞాని బోల్తాపడతాడు. ‘‘ఏం దిగులు పడకు. వేళ కాని వేళ వచ్చానని బాధ పడకు. నేనే స్వయంగా నీకు ఏదో ఒకటి చేసి పెడతా’’ అంటూనే ఇచ్చిన మాట ప్రకారం వంటచేసి అతనికి పెట్టి పడుకోమంటాడు. అతను అలాగేనని తృప్తిగా భోంచేసి నిద్రపోతాడు. తెల్లవారి చూసేసరికి ఆ వ్యక్తి కనిపించడు. అతనెప్పుడో పారిపోయి ఉంటాడు. మధ్యాన్నం అవుతుంది. ఇంతలో జ్ఞానికి కబురందుతుంది. నిన్న రాత్రి తన దగ్గర ఆశ్రయం పొందిన వ్యక్తి మంచి వాడు కాడని, దుష్టుడని. అది తెలిసి జ్ఞాని ‘ఛీ నేనెంత పాడు పని చేశానో. ఓ దుష్టుడి మాట నమ్మి వాడికి అన్నం పెట్టి పడుకోనిచ్చాను’ అని ఎంతో బాధ పడతాడు. చివరికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరున్న నదిలో తలస్నానం చేస్తే తప్ప చేసిన పాపం పోదు అని అనుకుంటాడు. నదికి బయలుదేరబోతుంటే ఆకాశం నుంచి ఓ దివ్య రూపమొచ్చి ఆ జ్ఞాని ముందు నిలబడుతుంది.

‘‘ఇదిగో నువ్వేంటో ఒక రోజు రాత్రి అన్నం పెట్టి పడుకోవడానికి చోటిచ్చినందుకే ఇంతగా బాధ పడుతున్నావు. ఏదో తప్పు చేశానని తెగ నలిగిపోతున్నావు. పైగా నదీ స్నానం చేసి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం పోతున్నావు. అదలా ఉంచి నా విషయానికి వస్తాను. నేను దేవుడే కావచ్చు. చెడ్డవారిని శిక్షించి మంచి వారికి అండగా ఉండాలి కదూ. కానీ నేనేం చేస్తున్నాను. దాదాపు యాభై ఏళ్ళుగా వాడికి అన్నపానీయాలు, ఉండేందుకు జాగా కూడా కల్పిస్తూ వస్తున్నాను. మరి నేనేం చేసుకోవాలి నన్ను... ఆలోచించు. నువ్వు కొన్ని గంటల సపర్యలకే ఇంతలా అయిపోతున్నావు. నువ్వేమీ బాధ పడక్కర్లేదు. నీకే పాపం అంటకుండా నేను చూస్తానులే’’ అని నచ్చచెప్తాడు.అప్పటికి జ్ఞాని మనసు శాంతించింది.
– యామిజాల జగదీశ్‌ 

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top