అరివీరమణివణ్ణన్‌

Aishwarya initially trained in Bharatnatyam - Sakshi

స్త్రీ శక్తి

మగధీరులకు మాత్రమే పరిమితమైన సిలంబమ్‌ యుద్ధకళలో ఇప్పుడు నారీమణులూ తమ ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. ఐశ్వర్యా మణివణ్ణన్‌ అనే కేరళ యువతి ఆ ప్రావీణ్యానికి ఒక ప్రతీకాత్మకశక్తిలా నిలిచారు! 

గులాబీ బోర్డరున్న నెమలి కంఠం రంగు చేనేత చీర కట్టుకుందామె. సంప్రదాయబద్ధంగా పేరంటానికి వెళ్తుందేమో అనిపించేలా ఉంది ఆహార్యం. చూపరుల అంచనాను తలకిందులు చేస్తూ ఒకచేతిలో కర్ర, మరో చేతిలో బరువైన కత్తి పట్టుకుని బరిలో దిగింది. భరతమాత, తెలుగుతల్లిలాగానే యుద్ధమాత పాత్ర పోషిస్తోందేమో అనుకుంటే పొరపాటే. ఆమె ఆ పాత్రలో నటించడం లేదు, ఆ పాత్రలో జీవిస్తోంది. ఆమె కేరళకు చెందిన ముప్పై ఏళ్ల ఐశ్వర్యా మణివణ్ణన్‌.

మీసాలను వంచింది!
బరిలో మగవాళ్లతో పోటీపడి యుద్ధం చేస్తోంది ఐశ్వర్య. ఒక చేతిలో కంబు (కర్ర), మరో చేతిలో వాల్‌ (కత్తి) గాలిని చీలుస్తూ విన్యాసాలు చేస్తున్నాయి. వాటికి దీటుగా ఐశ్వర్య దేహం నేల మీద నుంచి రెండడుగుల పైకి లేచి ప్రత్యర్థి దాడిని తిప్పి కొడుతోంది. జానపద కథలో యువరాణిని తలపిస్తోందామె. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తోంది. ఆమె చేస్తున్న యుద్ధకళ పేరు సిలంబమ్‌. అది మూడు వేల ఏళ్ల నాటి కేరళ యుద్ధవిద్య. ‘ఇంతటి నైపుణ్యంతో యుద్ధం చేయడం మగవారికి మాత్రమే సాధ్యం’ అనుకుంటూ వచ్చిన సంప్రదాయపు భ్రాంతిని చీల్చి చెండాడుతోంది ఐశ్వర్య. ఆమెను చుట్టుముడుతూ మగ సిలంబమ్‌ వీరులు ఒక్కొక్కరుగా బరిలోకి వస్తున్నారు. వారందరినీ ఏకకాలంలో ఎదుర్కొంటోందామె. ఆమె ఛేదించింది మగవారికి పరిమితం అనుకున్న యుద్ధవిద్యా వలయాన్ని మాత్రమే కాదు, శౌర్యానికి, వీరత్వానికి ప్రతీకగా మగవాళ్లు మెలితిప్పుకున్న మీసాలను కూడా ఆమె తన కత్తి మొనతో కిందకు వంచింది.

భరతనాట్యం నుంచి 
ఐశ్వర్య మొదట్లో భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆమె గురువు కవితా రాము సిలంబమ్‌ సాధన చేయమని సూచించడంతో ఐశ్వర్య ఇలాంటి మలుపు తీసుకుంది.  నిజానికి కవితా రాము సిలంబమ్‌ సాధన చేయమని చెప్పిన ఉద్దేశం వేరు. సిలంబమ్‌ సాధన ద్వారా దేహదారుఢ్యం ఇనుమడించి, శరీరాకృతి చక్కగా తీరుతుంది, కాబట్టి భరతనాట్య సాధన సులువవుతుందనే ఉద్దేశంతో చెప్పారామె. గురువు చెప్పినట్లుగానే సిలంబమ్‌ సాధన మొదలు పెట్టిన తర్వాత భరతనాట్యం కంటే సిలంబమ్‌ సాధన చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేయసాగింది ఐశ్వర్య. అప్పటి నుంచి పూర్తి స్థాయి సిలంబమ్‌ యుద్ధకళకే అంకితమైంది. ‘ఇది ఓ సముద్రం, ఈదుతూ సముద్రం లోతుల్లోకి వెళ్లే కొద్దీ మరిన్ని మెళకువలు ఒంటపడతాయి. భరతనాట్యం ఎంతోమంది చేస్తారు. సిలంబమ్‌ సాధన అమ్మాయిలు చేయరు. అయితే ఇది ఆత్మరక్షణనిచ్చే కళ. అమ్మాయిలకు చాలా అవసరం కూడా. ఈ విషయాన్ని ప్రచారం లోకి తీసుకురావాలి. ఈ కళకు ప్రాచుర్యం కల్పించాలన్నదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం’ అన్నారు ఐశ్వర్య. 
– మంజీర

పతకాల రాణి
మలేషియాలో 2016లో జరిగిన ఏషియన్‌ సిలంబమ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో వివిధ కేటగిరీలలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించింది ఐశ్వర్య. ‘‘సిలంబమ్‌ యుద్ధకళ దేహ దారుఢ్యాన్ని మాత్రమే కాదు మానసిక శక్తిని కూడా పెంచుతుంది. ఇది ధ్యానం వంటిది. దేహం, మెదడు ఏకకాలంలో దృష్టిని కేంద్రీకరిస్తూ సాధన చేయాలి. రెండింటి మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. సిలంబమ్‌ సాధనలో ఈ సమన్వయం మెరుగవుతుంది. సిలంబమ్‌ సాధనకు వయసు పరిమితులేవీ ఉండవు. ఈ కళకు విస్తృత ప్రచారం కల్పించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాను. చాలా స్కూళ్లు వాళ్ల కరికులమ్‌లో సిలంబమ్‌ మార్షల్‌ ఆర్ట్‌ను చేర్చడానికి సిద్ధమవుతున్నాయి’’ అన్నారు ఐశ్వర్య. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top