కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు చావు దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ వైఎస్సార్‌సీపీలో చేరారు.
కడప అగ్రిలక్చర్, న్యూస్‌లైన్: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు చావు దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరితో పాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బరాయుడు,కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు మట్లి వేణుభాస్కరరెడ్డి కూడా చేరారు. గురువారం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ , మాకం అశోక్‌కుమార్, బొమ్మన సుబ్బరాయుడు, మట్లి వేణుభాస్కరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో అద్దె మనుషులకే విలువ ఉందన్నారు. నిజాయితీగా, వాస్తవంగా పనిచేసే నాయకులకు స్థానం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. దీంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం నచ్చినందునే వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. మాట కోసం, తండ్రి ఆశయాల సాధన కోసం ఎందాకైనా నిలిచే మొండిమనిషి జగన్ అని అన్నారు. మాట తప్పని నైజం తండ్రి నుంచి అలవరచుకున్న జగన్ నాయకత్వం నూతన రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోందని అన్నారు. టీడీపీ-బిజేపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాయని, వాటిని నమ్మితే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.