
ప్రజల తీర్పును శిరసా వహిస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని, ఎన్నికల్లో తమను ఆదరించిన ఓటర్లందరికీ ఎంతో రుణపడి ఉంటామని టీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి కె.శశిధర్‌రెడ్డి అన్నారు
కోదాడటౌన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని, ఎన్నికల్లో తమను ఆదరించిన ఓటర్లందరికీ ఎంతో రుణపడి ఉంటామని టీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి కె.శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. ముందుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తక్కువ కాలంలోనే జిల్లా ప్రజలు తనపట్ల చూపిన అభిమానానికికృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.నల్లగొండ పార్లమెంట్ స్థానంలో తాను మంచి ఫలితాన్ని సాధిస్తున్నట్లు తెలిపారు.
అధికార పార్టీ నేతలు డబ్బులు పంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటానన్నారు. శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి టీఆర్‌ఎస్‌కు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణలో వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో నివాసంఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అధికార పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరించినా,తమపై అనవసర పుకార్లు పుట్టించినా చెక్కుచెదరకుండా తనను ఆదరించిన తెలంగాణ వాదులకు రుణపడి ఉంటానన్నారు. సమావేశంలో మట్టపల్లి శ్రీనివాసగౌడ్, కుక్కడపు బాబు, రాయపూడి వెంకటనారాయణ, తుపాకుల భాస్కర్, చలిగంటి లక్ష్మణ్, కొక్కు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.