ప్రసాద్‌కుమార్‌వి చౌకబారు ఆరోపణలు | disparaging allegedly of prasad kumar says vijay kumar | Sakshi
Sakshi News home page

ప్రసాద్‌కుమార్‌వి చౌకబారు ఆరోపణలు

Mar 20 2014 12:11 AM | Updated on Mar 28 2018 10:59 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తప్పదనే భయంతో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయకుమార్ అన్నారు.

 వికారాబాద్, న్యూస్‌లైన్:  మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తప్పదనే భయంతో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయకుమార్ అన్నారు. టీడీపీ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌పై మాజీ మంత్రి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. బుధవారం రమేష్‌కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయకుమార్ మాట్లాడారు. చైర్మన్‌గా కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే రూ.3కోట్లు ఇస్తానని రమేష్ ప్రలోభ పెట్టినట్టు, ఒప్పుకోనందుకు ఆయన టీడీపీలో చేరినట్టు ప్రసాద్‌కుమార్ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.

 నాలుగు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రమేష్‌కుమార్... టికెట్ కోసం ఏ పార్టీ వెంట పడాల్సిన అవసరం లేదన్నారు. రమేష్ టీడీపీలో చేరడం, చైర్మన్ అభ్యర్థిగా ఆయనను తాము ప్రకటించడంతో భయాందోళనకు గురైన మాజీ మంత్రి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయస్థితి ప్రసాద్‌కుమార్‌దన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్‌కుమార్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. శాటిలైట్ టౌన్ పనులు ఇప్పటికీ పూర్తికాకపోగా, మూడు సంవత్సరాలవుతున్నా మంజీరా నీళ్లు పట్టణ ప్రజలకు అందించలేదన్నారు.

 మచ్చలేని వ్యక్తిని టీడీపీ చైర్మన్ అభ్యర్ధిగా బరిలో నిలిపామని, వికారాబాద్‌లో మున్సిపల్‌లో టీడీపీ జెండా ఎగురవేస్తామని విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రమేష్‌కుమార్ మాట్లాడుతూ తనపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించనని స్పష్టం చేశారు. నాలుగుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన తన గురించి పట్టణ ప్రజలందరికీ తెలుసునని, మళ్లీ ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదని అన్నారు. చైర్మన్‌గా గెలిపిస్తే వికారాబాద్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు సురేష్‌కుమార్, గిరిధర్‌రెడ్డి, లక్ష్మణ్, వెంకట్, వెంకట్రామ్‌రెడ్డి, రంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌గృహకల్ప నుంచి సుమారు 30మంది యువకులు టీడీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement