కట్టిన పన్ను మోడీ తిరిగి ఇప్పిస్తారా? | can narendra modi return income tax paid by employees | Sakshi
Sakshi News home page

కట్టిన పన్ను మోడీ తిరిగి ఇప్పిస్తారా?

Apr 23 2014 10:27 AM | Updated on Sep 27 2018 4:47 PM

కట్టిన పన్ను మోడీ తిరిగి ఇప్పిస్తారా? - Sakshi

కట్టిన పన్ను మోడీ తిరిగి ఇప్పిస్తారా?

ఉద్యోగులు ఇన్నాళ్లూ చెల్లించిన ఆదాయపన్ను మొత్తాన్ని తిరిగి ఇప్పిస్తానని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. అయితే, అది ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారం చేజిక్కించుకోడానికి నాయకులు ఇష్టారాజ్యంగా వరాలు ప్రకటించేస్తారు. ఎన్నికల ప్రచార సభల్లో వివిధ వర్గాలను ఆకట్టుకోడానికి, వారి ఓట్లన్నీ తామే సాధించడానికి ఏవేవో చెప్పేస్తారు. అయితే వాటి సాధ్యాసాధ్యాల గురించి మాత్రం పెద్దగా పట్టించుకున్న పాపాన పోరు. గుజరాత్ మోడల్ అభివృద్ధిని దేశవ్యాప్తంగా తీసుకొస్తానని చెబుతున్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కూడా రకరకాల హామీలు ఇస్తున్నారు. సుపరిపాలన తీసుకొస్తానని చెప్పడం వరకు మామూలే. అయితే.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన సభలో మాత్రం మోడీ ఒక చిత్రమైన హామీ ఇచ్చారు.

భారత దేశం మొత్తమ్మీద కేవలం ఉద్యోగులు మాత్రమే నిజాయితీగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారని, వాళ్లకు జీతం ఎంత వచ్చినా, ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోతున్నా కూడా క్రమం తప్పకుండా ఆదాయపన్ను చెల్లిస్తూనే ఉన్నారని మోడీ ఒకింత బాధపడ్డారు. అందుకే తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బు మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తానని, ఆ తర్వాత ఉద్యోగులు ఇప్పటివరకు చెల్లించిన ఆదాయపన్ను మొత్తాన్ని వాళ్లకు తిరిగి ఇప్పిస్తానని అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు మహా అయితే ఆదాయపన్ను శ్లాబులు మార్చడం, 'స్టాండర్డ్ డిడక్షన్' మొత్తాన్ని కొంత పెంచుకుంటూ పోవడం తప్ప అసలు ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేకపోవడం గానీ, కట్టిన పన్ను తిరిగి ఇవ్వడం గానీ లేనే లేదు. ఒకవేళ ముందుగానే ఆదాయం నుంచి పన్ను మినహాయించి, కట్టాల్సిన పన్ను మాత్రం అంత లేని పక్షంలో.. రిటర్నులు సమర్పించిన తర్వాత ఎక్కువగా చెల్లించినది మాత్రం తిరిగి వస్తుంది.

కానీ ఇప్పుడు నరేంద్రమోడీ ఉద్యోగవర్గాలను ఆకట్టుకోడానికి ఈ కొత్త హామీ ఇచ్చారు. బీజేపీతో కూటమి కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఉద్యోగవర్గాలు ఇంతెత్తున ఎగిరిపడతాయి. ఉపాధ్యాయులతో వేసవి సెలవుల్లో కూడా పనులు చేయించిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుంది. నడివేసవిలో ఎండలు మండిపోతుంటే జన్మభూమి, ఇతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను వీధుల వెంట తిప్పించిన చంద్రబాబు పాలనా కాలాన్ని ఉద్యోగులు ఇంతవరకు మర్చిపోలేదు. అందుకే.. ఉద్యోగుల ఓట్లు ఏవీ రెండు ప్రాంతాల్లోను తమకు పడే అవకాశం లేదని, వాటిని దక్కించుకోడానికి ఏకైక మార్గం వారికి ఆదాయపన్ను లేకుండా చేయడమేనని మోడీ భావించి ఉంటారు. బహుశా అందుకే ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించని ఈ కొత్త హామీని ఆంధ్రప్రదేశ్ వేదికగా చెప్పి ఉంటారని నిపుణులు అంటున్నారు. కానీ, ఇది ఎంతవరకు సాధ్యమనే విషయంలో మాత్రం పెదవి విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement