పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం | PM Modi Announces Ex Gratia On Hyderabad Old City Incident Victims | Sakshi
Sakshi News home page

పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం

May 18 2025 12:14 PM | Updated on May 18 2025 1:03 PM

PM Modi Announces Ex Gratia On Hyderabad Old City Incident Victims

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది.

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి..
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

మృతుల వివరాలు..
రాజేంద్రకుమార్‌ (67)
అభిషేక్‌ మోదీ (30)
సుమిత్ర (65)
మున్నీబాయి (72)
ఆరుషి జైన్‌ (17)
శీతల్‌ జైన్‌ (37)
ఇరాజ్‌ (2)
హర్షాలీ గుప్తా (7)
రజని అగర్వాల్‌
అన్య మోదీ
పంకజ్‌ మోదీ
వర్ష మోదీ
ఇద్దిక్కి మోదీ
రిషభ్‌
ప్రథమ్‌ అగర్వాల్‌
ప్రాంశు అగర్వాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement