చిల్లర వర్తకానికి చిల్లు

 Union Cabinet Approves FDI In Single Brand Retail Without Govt Approval - Sakshi

మరికొన్ని రోజుల్లో దావోస్‌లో జరగబోయే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్న తరుణంలో దానికి ముందస్తు చర్యగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలకు ద్వారాలు తెరిచింది. యూపీఏ హయాంలో ప్రతిపక్షంలో ఉండి తానే గట్టిగా ప్రతిఘటించిన అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర వ్యాపారం, నిర్మాణ రంగం, విద్యుత్‌ ఎక్స్‌చేంజీల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) వీలు కల్పించడంతోపాటు ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో 49 శాతం వరకూ విదేశీ పెట్టుబడులు ఆస్కారమిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర వర్తకంలో 49 శాతం వరకూ నేరుగా ఎఫ్‌డీఐలకు వీలుంది. అంతకు మించితే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరయ్యేది. అలాగే ప్రైవేటు విమానయాన రంగంలో మాత్రమే ఇప్పటివరకూ 49 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండేది. దాన్ని ఇకపై ఎయిరిండియాకు కూడా వర్తింపజేస్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు లాంటి కీలక నిర్ణయాల వల్లనైతేనేమి... మొత్తంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నుల వల్లనైతేనేమి మన ఆర్థిక రంగం మందకొడిగానే ఉంది.

స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవచ్చునని,  2017–18లో అది 6.5 శాతం మాత్రమే ఉండొచ్చునని ఈ మధ్యే కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.1 శాతం, అంతకుముందు ఏడాది అది 8 శాతంగా ఉన్నదని గుర్తుంచుకుంటే వర్తమాన స్థితి ఎలా ఉన్నదో అర్ధమవుతుంది. ఇది తాత్కాలిక ధోరణి మాత్రమేనని, వచ్చే ఏడాదికి ఇది 7  శాతా నికి చేరువవుతుందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక అంటోంది.

పెట్టుబడుల సంగతికొస్తే 2011–12 జీడీపీలో అది 34.3 శాతంగా ఉంటే 2016–17లో 27 శాతం. ముందస్తు అంచనాల ప్రకారం 2017–18లో అది 26.4 శాతానికి పరిమితం కావొచ్చు. ముఖ్యంగా నిర్మాణ రంగం గత రెండేళ్లుగా నిరాశాజనకంగా ఉంది. 2016–17లో మన దేశానికి 6,000 కోట్ల డాలర్లకు మించి ఎఫ్‌డీఐలు వచ్చినా అవి ప్రధానంగా స్టాక్‌ల కొనుగోలు, ఆర్థికంగా దెబ్బతిన్న సంస్థల కొనుగోలుకు మాత్రమే పరిమిత మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింత ఊతం ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక రంగానికి చురుకుదనం వస్తుందన్న భావన ప్రభుత్వానికి ఉన్నట్టుంది.  

అయితే ఏదైనా అంశంపై నిర్దిష్టంగా, నికరంగా మాట్లాడటం...అలా మాట్లాడి నదానికి కట్టుబడి ఉండటం ఏ రాజకీయ పక్షానికైనా ప్రాణప్రదమైన విషయం. అలాగైతేనే ఆ పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో చాలా పార్టీలు ఆ విశ్వసనీయత ఎంతో ముఖ్యమైనదని గుర్తించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన అంశాలను అధికారంలో కొచ్చాక తామే మరింత ఉత్సాహంతో అమలు చేస్తున్నాయి. ఇచ్చిన వాగ్దానాలను గాలికొదులుతున్నాయి. ముందస్తు అనుమతుల ప్రమేయం లేకుండా సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర వర్తకం, టెలికాం, చమురు రంగాల్లో పెట్టుబడులకు అవకాశమీయా లని యూపీఏ హయాంలో అరవింద్‌ మాయారామ్‌ కమిటీ సిఫార్సు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గట్టిగా వ్యతిరేకించింది.

వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఆ రంగం జోలికొస్తే ఊరుకోబోమని చెప్పింది. ఆ సిఫార్సుల అమలు ప్రారంభించినప్పుడు పార్లమెంటులో ప్రతిఘటిం చింది. చిల్లర వర్తక రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 కోట్లమంది ఆధార పడ్డారని గుర్తుచేసింది. బహుళ బ్రాండ్‌ల రిటైల్‌ వ్యాపారంలో సైతం 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడాన్ని తిరగదోడతామని చెప్పింది. దాని మాట అటుంచి సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర వర్తకంలో నేరుగా వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతించా లని నిర్ణయించడమే కాదు... విదేశీ రిటైల్‌ సంస్థలు స్థానికంగా 30 శాతం వరకూ తప్పనిసరిగా కొనుగోళ్లు చేయాలన్న నిబంధనను సైతం అయిదేళ్లపాటు సడలిం చడం ఆశ్చర్యకరం. గత మూడున్నరేళ్లుగా ‘మేకిన్‌ ఇండియా’ నినాదంతో పెట్టుబ డులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం నుంచి ఈ తరహా నిర్ణయాలను ఎవరూ ఊహించరు. సంఘ్‌ పరివార్‌ సంస్థల్లో ఒకటైన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) కేంద్రం తాజా నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించడమేకాక, వాటిని పున స్సమీక్షించాలని డిమాండ్‌ చేయడాన్ని గమనిస్తే స్వపక్షంలోనే ఈ విషయంలో ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్ధమవుతుంది. 

ఎయిరిండియా సంస్థలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినీయాలని తీసుకున్న నిర్ణయం కూడా కీలకమైనది. ఆ సంస్థ రుణభారం రూ. 52,000 కోట్ల మేర ఉన్న మాట నిజమైనా ఇప్పుడిప్పుడే అది స్వల్ప స్థాయిలోనైనా నష్టాలను క్రమేపీ తగ్గించుకుంటోంది. 2016–17లో దాని నికర నష్టం అంతక్రితంతో పోలిస్తే తగ్గింది. ఈ సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన మానుకుని దాని రుణాలు మాఫీ చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈమధ్యే సిఫార్సు చేసింది. ఆ సంస్థ కోలుకోవడానికి అయిదేళ్ల వ్యవధినీయాలని కూడా సూచించింది.

విమాన ఇంధనం ధర బాగా తగ్గి, విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పటికీ వైమానిక రంగంలో ఎయిరిండియా వాటా 14 శాతం. తాజా నిర్ణయంతో దాని పరిస్థితి ఏమాత్రం మెరుగుపడగలదో చూడాలి. వ్యవస్థాగత లోటుపాట్లపై దృష్టి పెట్టి వాటిని సరిదిద్దుకోవడానికి బదులు ఇలా ఎడా పెడా ఎఫ్‌డీఐలకు అనుమతించడం అటు ఉపాధి అవకాశాలపై, ఇటు చిల్లర వర్తకరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ‘మేకిన్‌ ఇండియా’ నీరుగారుతుంది. ఇది విచారకరం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top