స్వరం మార్చిన ట్రంప్‌ | trump changed voice about pakistan | Sakshi
Sakshi News home page

స్వరం మార్చిన ట్రంప్‌

Oct 17 2017 12:32 AM | Updated on Mar 28 2019 6:10 PM

trump changed voice about pakistan - Sakshi

పాకిస్తాన్‌–అమెరికాలది జన్మజన్మల బంధమని... అది తలచిందే తడువుగా తెగిప డేది కాదని మరోసారి రుజువైంది. పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరిగి నిండా రెండు నెలలు కాలేదు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా బలగాలపై దాడులు చేసే ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం కల్పించడం మానుకోవాలని, లేనట్టయితే పర్యవసానాలు అనుభవించాల్సివస్తుందని మొన్న ఆగస్టులో ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా తాలిబన్, అల్‌ కాయిదా, హక్కానీ నెట్‌వర్క్‌ లకు పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, సైన్యం తోడ్పాటునిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పు డదంతా మారిపోయింది. ‘చాలా అంశాల్లో అమెరికాతో పాకిస్తాన్‌ నేతలు సహక  రిస్తున్నార’ని ట్రంప్‌ కృతజ్ఞతలు చెప్పారు. పైగా ‘ఇప్పుడే రెండింటిమధ్యా నిజమైన సంబంధాలు ప్రారంభమయ్యాయి’అని వ్యాఖ్యానించారు.

దశాబ్దాలుగా అమెరికా నుంచి నిధులు పొందుతున్నా ఉగ్రవాదానికి ఊతమివ్వడం మానుకోని పాకిస్తాన్‌ నెలన్నరలో మారిందని ట్రంప్‌ ఏ ప్రాతిపదికన చెబుతున్నారు? అమెరికా గూఢ చార సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్‌ బలగాలు దాడిచేసి 2012 నుంచి ఉగ్రవాదుల చెరలో ఉన్న అమెరికా–కెనడా జంటనూ, వారి పిల్లల్ని విడి పించాయి. ఇది జరగ్గానే ట్రంప్‌ స్వరం పూర్తిగా మారిపోయింది. నిజానికి ఆగస్టులో పాకిస్తాన్‌ను హెచ్చరించిననాటి నుంచీ ఆయన ప్రభుత్వం మళ్లీ ఆ దేశాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడింది. ‘మీరు ఇదే తరహాలో వ్యవహరిస్తే రష్యా, చైనాలకు దగ్గరవుతామ’ని పాక్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడమే ఇందుకు కారణం. గతవారం పాక్‌ విదేశాంగమంత్రి ఖ్వాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ అమెరికాలో ఉండగానే ఇందుకు సంబంధించిన సూచనలు కనబడ్డాయి. పరస్పర అవిశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి అమెరికా ఒక్క అడుగేస్తే అయిదు అడుగులేయడానికి పాక్‌ సిద్ధంగా ఉన్నదని ఆ సందర్భంగా ఖ్వాజా చెప్పారు. అయితే ఇంతమాత్రానికే అమెరికా వైఖరి మారిం దంటే పరువుపోతుందని కాబోలు... హక్కానీ చెరలో ఉన్న దంపతుల్ని విడిపించేం దుకు బేరం కుదిరింది. 

 అమెరికా ఈ తరహా ఎత్తులేయడం ట్రంప్‌తో మొదలుకాలేదు. ఇంతకు ముందు పాలకులు కూడా పాకిస్తాన్‌ను ఇదే తరహాలో హెచ్చరించడం, అనంతర కాలంలో దాన్ని బుజ్జగించడం మామూలే. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు ఆరేళ్లక్రితం అల్‌ కాయిదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ పాక్‌ రాజధాని ఇస్లా మాబాద్‌ శివార్లలో తలదాచుకున్నాడని తెలుసుకుని అతని స్థావరంపై అమెరికా ప్రత్యేక బలగాలు దాడిచేసి హతమార్చాయి. ఆ తర్వాత కొన్నాళ్లపాటు రెండు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. మాకు చెప్పకుండా దాడికి తెగబడ తారా అని పాక్‌  ఆక్రోశించింది. బిన్‌లాడెన్‌ లాంటివారు పాక్‌ సైన్యం అండ దండలు లేకుండా స్థావరం ఎలా ఏర్పర్చుకోగలుగుతారని అమెరికా ప్రశ్నించింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం వచ్చినప్పుడు కలుస్తానని పాక్‌ అప్పటి ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ కబురు చేస్తే ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఒబామా నిరాకరించారు.

పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన సైనిక సాయాన్ని నిలిపేస్తున్నట్టు ఒక దశలో అమెరికా అప్పటి విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ ప్రక టించారు. తీరా సెనేట్‌ కమిటీ సమావేశంలో అధికారుల వివరణకు సంతృప్తిచెంది చడీచప్పుడూ కాకుండా నిధులు విడుదల చేశారు. ఇప్పుడు ట్రంప్‌ పాడుతున్న పాట దానికి కొనసాగింపే. ఆగస్టులో ఇదే ట్రంప్‌ దక్షిణాసియాపై సరికొత్త విధా నమంటూ హడావుడి చేశారు. భారత్‌లో దాడులు చేసే ఉగ్రవాద ముఠాలకూ పాక్‌ ఆశ్రయమిస్తున్నదని ఆరోపించారు. ఇప్పుడు చప్పగా చల్లారి గొంతు సవరించుకు న్నారు. అమెరికా విదేశాంగమంత్రి రెక్స్‌ టిల్లర్సన్, రక్షణమంత్రి జేమ్స్‌ మాటిస్‌ మరికొన్ని రోజుల్లో పాక్‌ పర్యటించబోతున్నారు. ఆ పర్యటనలు పూర్తయ్యాక ఈ సాన్నిహిత్యం మరింత పెరగొచ్చు.

సమాన స్థాయి గల రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నప్పుడు వాటిమధ్య సంబంధాలు సమానంగానే ఉంటాయి. పరస్పర గౌరవమర్యాదలకూ లోటుం డదు. కానీ ఆ దేశాల్లో ఒకటి అగ్ర రాజ్యమూ, మరొకటి దానిపై ఆధారపడే దేశమూ అయినప్పుడు ఆ సంబంధాలు అంత సొగసుగా ఉండవు. ఇష్టమున్నా లేకున్నా చిన్న దేశం పెద్ద దేశం చెప్పుచేతల్లో ఉండకతప్పదు. కానీ అమెరికా–పాకిస్తాన్‌ సంబంధాలు దీనికి విరుద్ధం. ఉగ్రవాదంపై పోరుకు అమెరికా సమకూర్చే నిధులు అందుకుంటూనే అందుకు విరుద్ధమైన పోకడలకు పోవడం... అదేమిటని అమెరికా అడిగినప్పుడు అలగడం, ఏవో చర్యలు తీసుకున్నట్టు కనబడి చివరకు దాన్ని ‘సంతృప్తిపరచడం’ పాకిస్తాన్‌కు మామూలైపోయింది. ఈ నాటకాన్నంతటినీ నమ్ముతున్నట్టు నటించడం అమెరికాకు కూడా రివాజుగా మారింది. ట్రంప్‌ వచ్చినా ఈ బాణీ మారలేదని ఆయనగారి తాజా ప్రకటన రుజువుచేస్తోంది.

దక్షిణాసి యాపై కొత్త విధానం ప్రకటిస్తానని ఆగస్టులో ట్రంప్‌ చెప్పినప్పుడు అఫ్ఘానిస్తాన్‌ నాయకులు ఆ మాటల్ని అమాయకంగా నమ్మారు. అదే జరిగితే పాక్‌ గడ్డపై ఆశ్రయం పొంది కాబూల్‌లోనూ, చుట్టుపక్కలా దాడులు చేస్తున్న తాలిబన్, హక్కానీ గ్రూపులు దుంపనాశనమవుతాయని భావించారు. ఈ కొత్త విధానంలో భారత్‌కు ప్రాధాన్యముంటుందని ట్రంప్‌ అన్నపుడు మన దేశంలో కూడా కొందరు అలాంటి అభిప్రాయానికే వచ్చారు. ఇదంతా ఉత్తదేనని ఆయన తాజా ప్రకటన వెల్లడిస్తోంది. అఫ్ఘాన్‌లోని తన బలగాలకు అవసరమైన సరఫరాలు అందడానికి పాక్‌ భూభాగం వాడుకోవడం అమెరికాకు తప్పనిసరి. పైగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచితే అది చైనా, రష్యాలకు చేరువవుతుందని దానికి అనుమానాలున్నాయి. ఈ బలహీనతల్ని పాక్‌ చక్కగా సొమ్ము చేసుకుంటోంది. అమెరికా తన ప్రయోజనాల కోసం రంగులు మారుస్తున్న తీరు చూశాకైనా మన నేతలు ఆ దేశం ఏదో ఒరగబెడుతుందన్న భ్రమను వీడాలి. పాకిస్తాన్‌తో వ్యవహరించాల్సిన తీరుపైనా, అఫ్ఘాన్‌లో నిర్వహించాల్సిన పాత్రపైనా సొంత విధానం ఏర్పరచుకోవడం అవస రమని గ్రహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement