ట్రంప్‌కు కోపం ఎందుకొచ్చింది? | why donald trump angry tweets about pakistan | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కోపం ఎందుకొచ్చింది?

Jan 2 2018 8:24 PM | Updated on Mar 28 2019 6:10 PM

why donald trump angry tweets about pakistan - Sakshi

ఉగ్రవాదంపై పోరులో ముఖ్యంగా అఫ్ఘనిస్తాన్ లో చేస్తున్న సమరంలో అమెరికాకు  పాకిస్థాన్ ఏ మాత్రం సాయపడడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తం చేసిన ఆగ్రహం హఠాత్తుగా పుట్టినది కాదు. కిందటి ఆగస్ట్‌లో ట్రంప్‌ ప్రసంగంలో అఫ్ఘన్‌ సంక్షోభంపై మారిన అమెరికా వైఖరిని ప్రకటించారు. అప్పుడే పాక్ సర్కారుకు సూటిగా హెచ్చరిక జారీచేశారు. ‘సంక్షోభం, హింస, భయోత్పాతం సృష్టిస్తున్న శక్తులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తోంది. నేడు అమెరికా గుర్తించిన ఉగ్రవాద సంస్థలు 20 అఫ్ఘనిస్తాన్, పాక్ లో చురుకుగాపనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని ఉగ్ర సంస్థలు లేవు.’ అని ట్రంప్‌ నాలుగు నెలల క్రితమే పాక్‌ పాలకులను హెచ్చరించారు. అమెరికన్లను రోజూ చంపుతున్న ఈ ఉగ్ర సంస్థలకే పాక్ ఆశ్రయమిస్తోందని ట్రంప్‌ చెప్పారు. ఈ ప్రసంగంలోని ఆయన మాటలను గమనిస్తే ట్వీట్లో చెప్పింది పాక్ కు దిగ్భ్రాంతి కలిగించ కూడదు. 

వ్యూహం మారాలన్న ట్రంప్!
న్యూయార్క్ పై ఉగ్రదాడి జరిగిన 16 ఏళ్ల తర్వాత కూడా విజయం సిద్ధించని యుద్ధంతో అమెరికా ప్రజలు విసుగెత్తిపోయారు. అఫ్ఘన్‌ సంక్షోభంలో అమెరికా చొరబడి 17 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు కీలక భద్రత, ఆర్థిక భాగస్వామి అయిన ఇండియాతో వ్యూహాత్మక మైత్రి అవసరమని కూడా ట్రంప్ ప్రకటించారు. అమెరికా నుంచి కోట్లాది డాలర్ల విలువైన ఆర్థిక, సైనిక సాయం పొందుతూనే పాక్‌ పాలకులు నిజాయితీగా అగ్రరాజ్యానికి సహకరించడం లేదని ట్రంప్ సర్కారు భావిస్తోంది. పైగా అమెరికా అఫ్ఘాన్‌ సంక్షోభంలో కూరుకుపోయి ఎడతెగని పోరు కొనసాగితేనే తమకు భారీ స్థాయిలో ధన, సైనిక సాయం ఉంటుందనే ఉద్దేశంతో పాక్ ప్రభుత్వం, సైనికాధికారులు వ్యవహరిస్తున్నారు. 

1979లో అప్ఘనిస్తాన్ లో  సోవియెట్‌ సేనల ప్రవేశంతో సైనిక పాలకుడు జియా ఉల్‌ హక్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం అమెరికా నుంచి అన్ని రకాల సాయం భారీగా పొందింది. తొలుత సోవియెట్‌ సేనలకు, తర్వాత తాలిబాన్లు, ఆల్‌ కాయిదా వంటి అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలపై పోరు పేరిట పాక్ ప్రభుత్వాలు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అమెరికా నుంచి లెక్కలేనంతా సహాయం పొందాయి. 2001 సెప్బెంబర్11న ఆల్‌ కాయిదా న్యూయార్‌పై దాడి జరిపాక పాక్‌కు అమెరికా సాయం మరింత పెరిగింది. అయినా కూడా మరో వైపు గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆర్మీ నుంచి సాయం అందుతూనే ఉంది. ఈ క్రమంలో పాక్‌ సర్కార్‌, ఆర్మీ చేస్తున్న ద్విపాత్రాభినయం కొన్నాళ్లకు అమెరికాకు అర్థమైంది.

1947లోనే సన్నిహిత సంబంధాలకు పునాదులు
1947లో పుట్టిన పాకిస్థాన్ ను మూడు నెలలకే గుర్తించిన తొలిదేశాల్లో అమెరికా ఉంది. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటములైన ‘సీటో’, ‘సెంటో’లో 1954 నుంచీ పాక్‌ చురుకైన సభ్యదేశంగా మారింది. అప్పటి నుంచి అమెరికా చెప్పుచేతల్లో ఉండే‘క్లయింట్’(కీలుబొమ్మ) దేశంగా పాక్‌ దిగజారిపోయింది. పాలకులు ఆర్థికంగా లబ్ధి పొందారు. 1990ల్లో సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం, ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిపోయినా అఫ్ఘన్‌ సమస్య సమాప్తం కానందున అమెరికా దృష్టిలో పాక్‌ ప్రాధాన్యం పూర్తిగా తగ్గలేదు. 

అమెరికా డబ్బు, సైనికుల ప్రాణాలు పోయినా విజయం దక్కని అఫ్ఘన్‌ సంక్షోభం ఒక వైపు, మరో వైపు కోట్లాది డాలర్ల సాయన్ని పాక్‌ పాలకులు దిగమింగున్నారేగాని అమెరికాకు  అవసరమైన సహకారం అందించడం లేదన్న వాస్తవం మరోవైపు ట్రంప్‌ సర్కార్‌ ఆగ్రహానికి కారణమైంది. తన సొంత ప్రజలను, అమెరికాను ‘మోసం’ చేస్తున్న పాకిస్థాన్ తో సంబంధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని 2017లో ప్రచురించిన నివేదికలో అంతర్జాతీయ భద్రతా నిపుణుల బృందం కోరింది. ఈ బృందంలో అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుసేన్‌ హక్కానీ కూడా ఉన్నారు. ‘పాక్‌ను పూర్తిగా గాలికి వదిలేయ వద్దు. అలాగే, మిత్రదేశంగా పరిగణించడం మానేయాలి,’ అని ఈ బృందం ట్రంప్ సర్కారుకు సలహా ఇచ్చింది. ట్రంప్‌ కొత్త సంవత్సరం తొలి ట్వీట్ జారీ చేసిన హెచ్చరికను ఆచరణలో ఎలా చూపిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement