తన ‘గొడవ’గా ఎంచుకుని, దాన్ని తీర్చడానికే జీవితాంతమూ కృషి సల్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు శత జయంతి నేడు.
‘అన్యాయాన్నెదిరిస్తే/ నా గొడవకు సంతృప్తి/అన్యాయం అంతరిస్తే/ నా గొడవకు ముక్తిప్రాప్తి’ అంటూ జనం ఆవేదనలనూ, ఆక్రందనలనూ తన ‘గొడవ’గా ఎంచుకుని, దాన్ని తీర్చడానికే జీవితాంతమూ కృషి సల్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు శత జయంతి నేడు. తన కాలం కన్నా, తన చుట్టూ ఉన్న సమాజంకన్నా ముందుకెళ్లి ఆలోచించడమే కాదు...ఆ ఆలోచనలను ఆచరించే క్రమంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను కాళోజీ నిబ్బరంగా ఎదుర్కొన్నారు. కనుకే ఆయన చిరస్మరణీయుడయ్యారు. మనిషి జీవితంలో ఉద్యమం ఒక భాగం కావటమూ, జీవితమే ఉద్యమంగా మారటమూ కాళోజీలో చూస్తాం.
నిజాం రాజ్యాన్ని ప్రతిఘటించడం దగ్గరనుంచి...నక్సలైట్లపై హింసను ఖండించేవరకూ ఆయన చివరివరకూ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ విమోచనోద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, పౌరహక్కులు, తెలంగాణ ఉద్యమం...ఇలా ఈ గడ్డను తాకిన, ఊగించిన, శాసించిన ఏ ఉద్యమానికైనా కాళోజీ రెండు చేతులతో ఆహ్వానం పలికారు. ఆవాహనచేసుకున్నారు. ఉద్యమకారుడిగా మాత్రమే కాదు... కవిగా, కథకుడిగా ఆ ఉద్యమాలకు ఆలంబనయ్యారు. ఈ క్రమంలో జైలు జీవితమూ అనుభవించారు. అలాగని ఆ ఉద్యమాలు ఎటు తోస్తే అటు పోలేదు. స్వీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన ఆచరణ ద్వారా ఆ ఉద్యమాల ఉన్నతికి దోహదం చేశారు. అణచివేత ఛాయలు ఎక్కడ కనిపించినా ధిక్కరించడం ఆయనకు ముందు నుంచీ అలవాటు. అందుకే, కాళోజీ ఆగ్రహించినప్పుడు, అభ్యంతర పెట్టినప్పుడు... నిశితంగా విమర్శించినప్పుడు ఏ ఉద్యమమైనా తనను తాను సరిదిద్దుకున్న, సంస్కరించుకున్న సందర్భాలు కోకొల్లలు. అలాగే, తన అవగాహనకు అందని మరేదైనా కోణం అందులో ఆవిష్కృతమై నప్పుడు ఆయన దాన్ని అంగీకరించడానికీ వెనుకాడలేదు. చిత్రమేమంటే ఇన్నింట తన దైన ముద్రవేసినా ఏ సిద్ధాంత చట్రంలోనూ ఆయన ఇమడలేదు. ఏ పార్టీ జెండా మోయలేదు. ‘నాది గొర్రెదాటు వ్యవహారం కాద’ని ప్రకటించారు.
కన్నడ, మరాఠీ, తెలుగు ప్రాంతాల కలయికగా ఉన్న హైదరాబాద్ రాజ్యంలో పుట్టడంవల్ల అమ్మనుంచి కన్నడం, నాన్ననుంచి మరాఠీ, ఉర్దూ నేర్చుకుని... చుట్టూ ఉండే సమాజంలో తెలుగును ఔపోసనపట్టి, ఇంగ్లిష్‌కూడా అభ్యసించి, అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల, రచనలు చేయగల సత్తాను కాళోజీ సొంతం చేసుకున్నాడు. 1914 సెప్టెంబర్ 9న ఇప్పటి కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో ఆయన జన్మించాక కుటుంబం అక్కడినుంచి వరంగల్ జిల్లాలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. ఆయనే ఒకచోట రాసుకున్నట్టు అప్పట్లో తెలంగాణ గడ్డపై సమాంతరంగా సాగిన పలు ఉద్యమాలకు కాళోజీ ఇల్లు కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యమాలన్నీ సామాజిక జీవితంలోకి తెచ్చిన విలువల్లోని మంచిని స్వీకరించడంవల్ల కావొచ్చు...కాళోజీకి తనదైన విశిష్ట వ్యక్తిత్వం అలవడింది. ‘నేను కమ్యూనిస్టు వలె చెబుతున్న. నేను సోషలిస్టుగా మాట్లాడుతున్న. నేను హిందువుగా చెబుతున్న అంటరుగానీ మరి మనిషిగా ఆలోచించేదెప్పుడు అన్నదే నా ప్రశ్న’ అని కాళోజీ తన ఆత్మకథలో అనడమే ఇందుకు రుజువు.
ప్రజాస్వామ్యంలో అత్యుత్తమ హోదా పౌరుడేనని చెప్పడమే కాదు...ఆ పౌరుడికుండవలసిన హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించి నప్పుడల్లా కాళోజీ ఎదిరించి నిలబడ్డారు. ప్రజాస్వామ్యమంటే అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలేనన్న అభిప్రాయాన్ని కలగజేసి, ఆ తర్వాత పాలనలో ప్రజలకెలాంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా... వారి అభిప్రాయాలకు ఏపాటి విలువా ఇవ్వకుండా వారిని పాలితులుగా మాత్రమే మిగిల్చే అధికారస్వామ్యాన్ని ఆయన మొదటినుంచీ ధిక్కరించేవారు. ‘కలదందురు లోకసభను/ కలదందురు ప్రభుత్వము లోన పంచాయితిలో/ కలదందురు రాజ్యాంగమున/కలదు ప్రజాస్వామ్య మనెడు వింత కలదో? లేదో?’ అంటూ వివిధ సంస్థల్లో ప్రజాస్వామ్యం లుప్తమవుతున్న తీరును దుయ్యబట్టారు. తన ఆప్తమిత్రుడు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక ఆయన అడిగారని కాదనకుండా ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని పొందినా అంతకు ముందువలే ప్రభు ధిక్కారాన్ని నూటికి నూరుపాళ్లూ కొనసాగించిన వ్యక్తిత్వం కాళోజీది. ‘జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ/ సాక్షీభూతుణ్ణిగాను- సాక్షాత్తూ మానవుణ్ణి’అని అన్నట్టే తుదివరకూ తనలోని ఆ మానవుణ్ణి అలానే కాపాడుకుంటూ వచ్చారు. తేట తెలుగు పదాలతో, అవసరమైన చోటల్లా వ్యంగ్యాన్ని, విసుర్లనూ నింపి కవిత్వాన్ని పదునైన ఆయుధం చేయడం కాళోజీ ధోరణి. ‘పెట్టుకునే టోపీ కాదు/పెట్టిన టోపీ చూడు/ఎగరేసిన జండా కాదు/చాటున ఆడించిన దండా చూడు’ అనడం ఆయనకే చెల్లింది.
ప్రజాస్వామిక లక్షణాన్ని నిలువెల్లా ఒంటబట్టించుకున్న కవి గనుకే కాళోజీ స్వరం ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సూటిగా తాకుతుంది. వర్తమాన వాస్తవాన్ని పురాణ ప్రతీకలతో హత్తుకునేలా చెప్పడం కాళోజీలా మరొకరికి సాధ్యం కాలేదు. ‘అతిథివోలె ఉండి ఉండి- అవని విడిచి వెళ్లుతాను’అని ఒకచోట అన్నప్పటికీ తాను అతిథిలా ఉండిపోలేదు. జీవితాంతమూ ప్రజల హక్కుల కోసం తాపత్రయపడి... వారి పోరాటాలకూ, జీవితాలకూ, వ్యక్తిత్వాలకూ పెద్ద దిక్కుగా నిలబడ్డారు. కాళోజీ లాంటి వ్యక్తులు చరిత్రలో అరుదుగా జన్మిస్తారు. కాళోజీని స్మరించుకోవడమంటే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వదలివెళ్లిన విలువలనూ గౌరవించడం. అంతకుమించి ఆచరించడం. అలా ఆచరించగలిగినప్పుడే కాళోజీకి నిజమైన నివాళులర్పించినట్టవుతుంది.