నిలువుదోపిడీ ఒప్పందం | to day editorial on tppa | Sakshi
Sakshi News home page

నిలువుదోపిడీ ఒప్పందం

Nov 17 2015 12:14 AM | Updated on Jul 29 2019 7:43 PM

ఎనిమిదే ళ్ల వ్యవధి...19 సార్లు మంతనాలు అంటే సాధారణమైన విషయం కాదు. కానీ ఇన్నేళ్లపాటు, ఇన్నిసార్లు చర్చించుకున్నా అందులోని అంశాలు కాస్తయినా వెల్లడికాకుండా అత్యంత రహస్యంగా ఉండిపోయాయంటే ఆ చర్చలు లోక కల్యాణానికి అయి ఉండకపోవచ్చునని ఎవరికైనా అనుమానం వస్తుంది.

ఎనిమిదే ళ్ల వ్యవధి...19 సార్లు మంతనాలు అంటే సాధారణమైన విషయం కాదు. కానీ ఇన్నేళ్లపాటు, ఇన్నిసార్లు చర్చించుకున్నా అందులోని అంశాలు కాస్తయినా వెల్లడికాకుండా అత్యంత రహస్యంగా ఉండిపోయాయంటే ఆ చర్చలు లోక కల్యాణానికి అయి ఉండకపోవచ్చునని ఎవరికైనా అనుమానం వస్తుంది. విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీఏ)పై వివిధ వర్గాలు గత కొన్నేళ్లుగా వ్యక్తం చేస్తూ వస్తున్న సందేహాల్లో నిజం ఉన్నదని ఇప్పుడిప్పుడు బయటపడుతున్న ఆ ఒప్పందం వివరాలు తెలియజెబుతున్నాయి. అవి కూడా అధికారికంగా వెల్లడించినవి కాదు. లీకుల ద్వారా బయటికొచ్చినవే.

పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాల్లోని అమెరికా, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర 12 దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై ఇప్పుడు అనేక అభ్యంతరాలూ, ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. చైనా ఆర్థిక ప్రాబల్యాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా అమెరికా చొరవతో ప్రారంభమైన ఈ చర్చలు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మొదలై...అమెరికాలోని అట్లాంటాలో గత నెల ముగిశాయి.  ఒప్పందంపై అవగాహన కుదిరినట్టు 12 దేశాలూ ప్రకటించాయి. అయితే అది అమల్లోకి రావాలంటే ఆయా దేశాల చట్టసభల ఆమోదముద్ర అవసరం. అంతకు ముందు ఆయా దేశాల్లో అమలవుతున్న అనేక చట్టాలను సవరించుకోవాల్సి ఉంటుంది. కనుక ఒప్పందం ఆచరణలోకి రావడానికి చాన్నాళ్లు పట్టే అవకాశం ఉంటుంది. ఎక్కడో కాదు...అమెరికాలోనే విపక్షమైన రిపబ్లికన్ పార్టీతోపాటు అధికార డెమొక్రటిక్ పార్టీలోని కీలకమైన నాయకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

అందులో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ కూడా ఉన్నారు. అమెరికాతోపాటు చిలీ, పెరూ, వియత్నాంవంటి దేశాల్లో సైతం అభ్యంతరాలున్నాయి. అయితే అందరి అభ్యంతరాలూ ఒకే రకమైనవి కాదు. తమ మార్కెట్‌కు సభ్య దేశాలనుంచి చవక ఉత్పత్తులు వచ్చిపడతాయని, ఉన్న ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని అమెరికాలో ఆందోళన వ్యక్తమవుతుంటే... ప్రాణావసరమైన ఔషధాల పేటెంట్లను గుప్పెట్లో పెట్టుకుని భారీయెత్తున లాభార్జన చేసేందుకు సంపన్న దేశాలు దీన్ని తీసుకొచ్చాయని పేద దేశాల్లోని పౌర సమాజ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నోమ్ చోమ్‌స్కీ, జోసెఫ్ స్టిగ్లిజ్ వంటి మేథావులైతే లాభార్జననూ, ఆధిపత్యాన్నీ మరింతగా పెంచుకునేందుకు ఇది సంపన్న దేశాలు పన్నిన వ్యూహమని విమర్శిస్తున్నారు.
 ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన...ఉత్పాదకత, సృజనాత్మకత పెంపు ఈ వాణిజ్య ఒప్పందం కీలక లక్ష్యాలని సభ్య దేశాల అధినేతలు చెబుతున్న మాట. వీటితోపాటు జీవన ప్రమాణాల పెంపు, పేదరిక నిర్మూలన, పాలనలో పారదర్శకత వంటివి కూడా సాధ్యమవుతాయని వారంటున్నారు. 2012 కల్లా ఒప్పందంపై సంతకాలు పూర్తికావాలని ముందనుకున్నా అడుగడుగునా ఎదురైన సమస్యల కారణంగా మరో మూడేళ్లకుగానీ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న దేశాలకు ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్య సర్వీసుల్లో 24 శాతం వాటా ఉంది. భవిష్యత్తులో మరికొన్ని దేశాలు కూడా ఇందులో భాగస్తులయ్యే వెసులుబాటు ఉంది. ఒప్పందం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని సభ్య దేశాలన్నిటా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.  

 ఒప్పందం అమలైతే ఎలాంటి అప్రజాస్వామిక విధానాలు అమలవుతాయో చూడాలంటే అందులోని వివాద పరిష్కార ప్రక్రియ(ఐసీడీఎస్)నిబంధనను గమనించాలి. ఒప్పందం అమలు ప్రారంభమయ్యాక ప్రభుత్వం కొత్తగా ఏవైనా నియంత్రణ చట్టాలను తీసుకొస్తే...ఆ చర్య తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందంటూ ప్రభుత్వంపై కంపెనీలు వేరే దేశాల్లోని కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో దావా వేయడానికి ఈ నిబంధన వీలు కల్పిస్తోంది. ఆఖరికి మద్య నిషేధ చట్టం లాంటివి వచ్చినా తమ వ్యాపారానికి అది అవరోధం కలిగిస్తున్నదని...అందువల్ల తమకు కలిగిన నష్టానికి ప్రభుత్వంనుంచి పరిహారం ఇప్పించాలని కంపెనీలు కోరవచ్చు. ఆ దావాల విచారణ రహస్యంగా ఉంచవచ్చు. ఇదే సమయంలో కంపెనీలకు సంబంధించిన పరిశ్రమలు ఏ చట్టాలనైనా ఉల్లంఘిస్తే వాటిపై చర్య తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. ఆ కంపెనీల కారణంగా నేల, నీరు, పర్యావరణం కాలుష్యం బారిన పడినా నోరెత్తడం సాధ్యం కాదు. ఇక ఒకే రకమైన ఉత్పత్తులు చేస్తున్నా స్వదేశీ సంస్థలకు మాత్రం ఇలాంటి వెసులుబాట్లేమీ ఉండవు.

మరోపక్క విదేశీ కంపెనీల అక్రమాలను ఎవరైనా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రపంచానికి వెల్లడించడానికి ప్రయత్నిస్తే అలాంటివారిపై కేసులు పెట్టొచ్చు. ఆ సమాచారాన్ని తొలగించమని కంపెనీలు కోరినప్పుడు ఫేస్‌బుక్ వంటి సంస్థలు అంగీకరించక తప్పదు. ఎలాంటి వాణిజ్య ప్రయోజనమూ లేని ఫైల్ షేరింగ్‌ల విషయంలో సైతం ఎవరిపైన అయినా సివిల్, క్రిమినల్ కేసులు పెట్టేందుకు అందులోని నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి.

 ఇక పేటెంట్లకు సంబంధించిన నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయి. అవి వాణిజ్య సంబంధ మేథోపరమైన హక్కుల(ట్రిప్స్)ను మించిపోయాయి. టీపీపీఏ అమలైతే ప్రాణావసరమైన ఔషధాల పేటెంట్లు బడా కంపెనీల వద్ద దీర్ఘకాలం ఉండిపోతాయని, వాటిని ఇతర సంస్థలు చవగ్గా ఉత్పత్తి చేయడం సాధ్యపడదని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు టీపీపీఏలో భాగం కాబోతున్న మెక్సికో, వియత్నాం, చిలీ, మలేసియా దేశాల్లోని రోగులకు చావు తప్ప గత్యంతరంలేని స్థితి కలగబోతున్నది. ఈ ఒప్పందంలో భారత్ కూడా భాగం కావాలని సంపన్న దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ మాదిరి ఒప్పందాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతిఘటించడం అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement