గణాంకాలు వెల్లడించే అంశాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కళ్లెదురుగా కనబడే వాస్తవాలకూ, అవి చెప్పే విషయాలకూ తరచు పొంతన కుదరకపోవడమే అందుకు కారణం.
గణాంకాలు వెల్లడించే అంశాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కళ్లెదురుగా కనబడే వాస్తవాలకూ, అవి చెప్పే విషయాలకూ తరచు పొంతన కుదరకపోవడమే అందుకు కారణం. కనుకనే చాలా దేశాలు పేదరికంనుంచి బయటపడుతున్నాయని, పేదల సంఖ్య తగ్గుతున్నదని ఈమధ్య ప్రపంచబ్యాంకు చేసిన ప్రకటనను అందరూ సంశయంతో చూస్తున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంత మంచి శుభవార్త ప్రపంచ బ్యాంకు నోటి వెంబడి వెలువడటం ఇదే మొదటిసారి. అసలు మానవాళి చరిత్రలోనే పేదరికాన్ని తగ్గించుకోవడం ఇది తొలిసారి అవుతుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ అంటున్నారు.
ఇంతకూ ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనాలు ఏం చెబుతున్నాయి? ఈ ఏడాది ఆఖరుకల్లా ప్రపంచ జనాభాలో పేదలు పది శాతం కన్నా తక్కువ ఉండబోతున్నారని ఆ అంచనాలు అంటున్నాయి. 2012లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 90.2 కోట్లమంది (12.8 శాతం) నిరుపేదలుండగా, ఇప్పుడు వారి సంఖ్య 70.2 కోట్లమంది (9.6 శాతం)గా తేలిందని చెబుతోంది. చాలా దేశాల్లో ఆర్థికాభివృద్ధి జరగడమే ఇందుకు కారణమంటోంది. మన దేశం గురించి కూడా ఆ నివేదిక కొన్ని అంచనాలిచ్చింది. ప్రపంచంలో ఎక్కువమంది పేదలు భారత్‌లోనే ఉన్నారని ఆ నివేదిక చెబుతున్నా అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం రేటు తక్కువగా ఉండేది భారత్‌లోనేనని వెల్లడించింది.
అసలు పేదలంటే ఎవరు...పేదరికం అంటే ఏమిటన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సంతృప్తికరమైన జవాబులు లేవు. కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తలు సైతం ఆ విషయంలో తలో మాటా చెబుతున్నప్పుడు సామాన్య పౌరులు గందరగోళ పడటంలో ఆశ్చర్యం లేదు. యూపీఏ హయాంలో ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరించిన రంగరాజన్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక దేశంలో 36 కోట్ల 30 లక్షలమంది పేదలున్నారని అంచనా వేసింది. ఇది దేశ జనాభాలో 29.6 శాతం. ఆయన లెక్క ప్రకారం ప్రతి పదిమందిలోనూ ముగ్గురు పేదలు. ఇందుకు కొలమానంగా తీసుకున్న ప్రాతిపదికలు చిత్రంగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 కన్నా తక్కువ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 47 కన్నా తక్కువ మొత్తంతో గడిపేవారిని అది పేదలుగా పరిగణించింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సొమ్ముతో బతకడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో పేదలు 12.4 శాతం మాత్రమే. కేవలం సంపాదనను మాత్రమే కాక ఇతరేత అంశాలను కూడా తీసుకోవడంవల్ల ఈ అంచనాలకొచ్చామని బ్యాంకు చెబుతోంది.
వర్థమాన దేశాలకు అప్పులివ్వడం, అందుకు షరతులు విధించడం, ప్రభుత్వాల విధానాలను ప్రభావితం చేయడం మౌలికంగా ప్రపంచబ్యాంకు చేసే పనులు. దీంతోపాటు 1990 నుంచి ప్రపంచంలో పేదరికం ఎలా ఉన్నదో తెలుసుకునే బాధ్యతను కూడా అది నెత్తిన వేసుకుంది. రోజుకు 1.25 డాలర్ల సంపాదనను సూచీగా పెట్టుకుని అంతకంటే తక్కువ సంపాదించేవారిని గతంలో అది పేదలుగా లెక్కేసేది. 2005 నుంచీ ఈ పద్ధతినే పాటిస్తున్నది. ఈసారి దాన్ని సవరించుకుంది. 2011నాటి ధరలను పరిగణనలోకి తీసుకుని రోజుకు 1.90 డాలర్ల కన్నా తక్కువ సంపాదించేవారిని అది పేదలుగా లెక్కేసింది. వివిధ దేశాల్లోని జీవన వ్యయాన్ని, అక్కడి జీవన ప్రమాణాల్ని కూడా పరిగణించి తాము ఈ అంచనాలకొచ్చినట్టు చెప్పింది.
ప్రపంచంలో 90 కోట్ల మంది పేదలున్నారని 2012లో ప్రపంచబ్యాంకు అంచనా వేయగా తాజా ప్రాతిపదికల ప్రకారం అది 70 కోట్లు మాత్రమే. అంటే మూడేళ్ల వ్యవధిలో 20 కోట్లమంది పేదరికంనుంచి బయటపడ్డారన్నమాట. అలాగే దక్షిణాసియాలో 2012లో 30.92 కోట్ల మంది నిరుపేదలుండగా ఈసారి అది 23.13 కోట్లకు చేరుకుంది. ఇలా మొత్తంగా చూస్తే పేదరికం గణనీయంగా తగ్గినా అది దక్షిణాసియాలో, ఆఫ్రికాలో ముమ్మరంగా ఉంది. గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్నదని చెబుతున్న అభివృద్ధిగానీ, పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ సంస్థల నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలుగానీ ఆఫ్రికా ఖండంలోని నిరుపేద దేశాలను తాకలేదని ప్రపంచబ్యాంకు నివేదికను గమనిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి 2030 కల్లా ప్రపంచంలో పేదరికం నిర్మూలన కావాలని, అది గరిష్టంగా 3 శాతంమించి ఉండరాదని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి లక్ష్యాల ప్రకటన చెబుతోంది. గత అనుభవాలన్నీ చూసి, ప్రస్తుత ప్రపంచబ్యాంకు నివేదికను గమనించాక ఇది ఎంతవరకూ సాధ్యమన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. గత దశాబ్దకాలంలో కొన్ని వర్థమాన దేశాలు అభివృద్ధి సాధించిన మాట వాస్తవమే అయినా అదే స్థితి రాగల కాలంలో కొనసాగుతుందని చెప్పలేం.
అవి వచ్చే రెండు దశాబ్దాల్లోనూ అదే తరహా వృద్ధి రేటును సాధించిన పక్షంలో మాత్రమే ఐక్యరాజ్యసమితి చెప్పినట్టు పేదరికం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. పేదరికాన్ని రూపుమాపడంతో పాటు ఆకలిని పారదోలడం, వ్యాధులపై చేసే పోరులో పైచేయి సాధించడంవంటివి సమితి లక్ష్యాల్లో ఉన్నాయి. అవి సాధ్యం కావాలంటే ఏటా దాదాపు 5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయి. ఇప్పుడున్న 9.6 శాతం పేదరికం రేటును 2020కల్లా 9 శాతానికి తగ్గించగలిగితే 2030 నాటికి పేదరికం నిర్మూలన అన్న లక్ష్యం నెరవేరుతుందని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు కిమ్ అంటున్నారు. అది కుదిరే పనేనా? పదిహేనేళ్లక్రితం పెట్టుకున్న సహస్రాబ్ది లక్ష్యాలను సాధించడంలో మనతో సహా ఎన్నో దేశాలు వెనకబడ్డాయి. ఆర్థికాభివృద్ధి ఉపాధి కల్పనలో ప్రతిబింబించి... విద్య, వైద్యం వంటి అంశాల్లో ప్రజల స్తోమత పెరిగినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమైందని ధైర్యంగా చెప్పగలుగుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ కృషి చేయనంతవరకూ ఎలాంటి గణాంకాలైనా ధైర్యాన్నివ్వలేవు.