ఎన్నార్సీపై పునరాలోచన అవసరం 

Sakshi Editorial On NRC

కొన్నేళ్లుగా అస్సాం పౌరులను హడలెత్తిస్తున్న జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌ఆర్‌సీ) ‘జాతీయం’ కాబోతోంది. ఈ దేశ పౌరులెవరో, కానివారెవరో ఆరా తీయడానికి త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ దాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో చేసిన ప్రకటన సారాంశం. ఆయన అలా ప్రకటించిన కొద్దిసేపటికే అస్సాం ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో రూపొందిన ఎన్‌ఆర్‌సీ తమకు సమ్మతం కాదని ప్రకటించారు. దాన్ని రద్దు చేసి జాతీయ స్థాయిలో చేపట్టాలనుకుంటున్న ప్రక్రియలో తమనూ చేర్చాలని కోరారు. దీన్నిబట్టే ఎన్‌ఆర్‌సీ అక్కడ ఎలాంటి పోకడలకు పోయిందో బోధపడుతుంది. స్థూలంగా చూస్తే ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్నవారిని ఏరి పారేయడానికి ఇదొక అద్భుత మైన ప్రక్రియ అనిపిస్తుంది.

కానీ లోతులకుపోయి గమనిస్తే ఇందులోని లోపాలు అర్థమవుతాయి. దేశవ్యాప్తంగా అమలు చేయబోయే ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ రూపురేఖలెలా ఉంటాయో ఇంకా ప్రకటిం చవలసే ఉన్నా, అస్సాంలో అదెంత సొగసుగా జరిగిందో తెలుసుకుంటే దాంతో వచ్చిన సమస్య లేమిటో తెలుస్తాయి. ఆ రాష్ట్రంలోని 3 కోట్ల 30 లక్షలమందికిపైగా పౌరుల పుట్టుపూర్వోత్తరాలను వడబోసి అందులో 40.07 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిరుడు జూలైలో విడుదల చేసిన తుది ముసాయిదా తేల్చిచెప్పింది.

దీనిపై తీవ్ర కల్లోలం చెలరేగిన తర్వాత ఇది తుది ముసాయిదా తప్ప తుది జాబితా కాదని, ఇందులో చోటు దక్కనివారు మళ్లీ తగిన పత్రాలతో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. వాటన్నిటి ఆధారంగా మరోసారి వడబోత చేసి మొన్న ఆగస్టులో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 3 కోట్ల 11 లక్షల 21 వేలమందికి ఎన్‌ఆర్‌సీలో స్థానం దక్కింది. మిగిలిన 19 లక్షల 6వేల 657మంది ఇక్కడి పౌరులు కాదని నిర్ధారించారు. ఈ ప్రక్రియ జనాభా గణన కాదు. ఇంటింటికీ వచ్చి పౌరుల వివరాలడిగి, అవసరమైన పత్రాలు చూపమని ఎవరూ అడగరు. ఎవరికి వారు తాము ఈ దేశ పౌరులమని నిరూపించు కోవాలి. అందుకు అవసరమైన పత్రాలేమిటో తెలుసుకుని వాటిని ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రాలకు తీసు కుపోవాలి.

అధికారుల అనుమాన దృక్కుల నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత పౌరులదే. ఇది అచ్చంగా అస్సాంలో అమలు చేసిన విధానం. అస్సాంలో 1971 మార్చి 24ను కటాఫ్‌ తేదీగా లెక్కేసి, ఆ తేదీనాటికి నివాసం ఉన్నట్టు చూపే పత్రాలను సమర్పించమని పౌరుల్ని కోరారు. అలా చూపలేనివారిని ఈ దేశ పౌరులుగా ప్రకటించడం సాధ్యం కాదని ప్రకటించారు. జాబితాకెక్కని పౌరుల వివరాలు చూస్తే ఏ వర్గాలు ఇందువల్ల చిక్కుల్లో పడ్డాయో తెలుస్తుంది.

నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు వీరిలో అధికంగా ఉన్నారు. ఇంకా లోతులకు పోయి చూస్తే బిచ్చగాళ్లు, ఇల్లూ వాకిలీ లేనివారు ఎక్కువ. చిత్రమేమంటే ఒకే కుటుంబంలో భార్య ఎన్‌ఆర్‌సీలో ఉంటే... భర్తకు అందులో చోటు దక్కలేదు. అన్నదమ్ముల్లో కొందరు జాబితాలోకెక్కితే మరికొందరికి ఆ అదృష్టం దక్కలేదు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మహమ్మద్‌ సనావుల్లా ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన పేరు గల్లంతు కావడంతో అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించగా, జాబితాలో చోటు సంపాదించుకున్న కుటుంబసభ్యులు లబోదిబోమంటూ గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్‌ దొరికింది. ఇప్పుడు జాబితాలో చోటుదక్కని వారంతా వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో ఉన్నారు. వీరి విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయాల్సి ఉంది. 

‘కాలు తొక్కిన్నాడే కాపురం తీరెలా ఉందో తెల్సింద’న్నట్టు 2010లో ఈ ప్రక్రియకు సంబం ధించిన పైలెట్‌ ప్రాజెక్టును అస్సాంలోని బార్‌పేట, కామ్‌రూప్‌ జిల్లాల్లోని రెండు తహసీళ్లలో అమలు చేసినప్పుడే ఇదెలాంటి విద్వేషాలు రగులుస్తుందో అధికారులకు అర్ధమైంది. అప్పట్లో ఆగ్ర హావేశాలతో రగిలిపోయిన గుంపు బార్‌పేట డెప్యూటీ కమిషనర్‌ కార్యాలయంపై దాడిచేసి హింసకు పాల్పడినప్పుడు పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆ తర్వాత ఆ ప్రక్రియను అటకెక్కించారు. బహుశా 2013లో సుప్రీంకోర్టు ఒత్తిడి చేయకపోయి ఉంటే అదింకా ఆ స్థితిలోనే ఉండేది. కానీ అస్సాంలో ఎన్‌ఆర్‌సీ అమలు చేసి తీరాల్సిందేనంటూ సుప్రీంకోర్టు  పట్టుబట్టడంతో దానికి కదలిక వచ్చింది.

2015 జూలైలో ధర్మాసనం మార్గదర్శకాలు విడుదల చేశాక ఈ ప్రక్రియ రాష్ట్రమంతటా మొదలైంది. మొదటినుంచీ దీనిపై పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ ఎన్‌ఆర్‌సీని  ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన మౌలిక పత్రమని ప్రశంసించి ఉండొచ్చు... కానీ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకే ఆ జాబితా  మింగు డుపడటం లేదు. ఉండకూడని వాళ్లంతా ఆ జాబితాకెక్కగా, అర్హులైనవారెందరో దానికి వెలుపల ఉండిపోయారని హిమంత బిశ్వశర్మ ఆక్రోశిస్తున్నారు. ఈ జాబితాను అస్సాం సర్కారే తయారు చేసిందని దేశమంతా అనుకుంటుండగా, ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసి రిటైరైన ప్రతీక్‌ హలేజా ప్రభుత్వానికి ఏ దశలోనూ, ఏమీ చెప్పలేదని ఆయన ఆరోపిస్తున్నారు.

బిశ్వశర్మ కోరు కున్నట్టు ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఆ జాబితా ఎవరిని ఒడ్డుకు చేర్చేదో... ఎవరిని వీధులపాలు చేసేదో! అనుభవం గడించాకైనా తత్వం బోధపడాలి. అస్సాంలో జరిగిన గందరగోళ పర్వం గమ నించాకైనా, జాబితాలో చోటు సంపాదించలేనివారి బాధామయ గాధలు చూశాకైనా దేశవ్యాప్తంగా దీని అమలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో పాలకులు గ్రహించాలి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక చిన్న రాష్ట్రంలో సాగిన ప్రక్రియే ఇంత లోపభూయిష్టంగా ఉంటే... దేశమంతా ఎన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయో ఊహించుకోవాల్సిందే. ఈ బృహత్తర కార్యక్రమం విష యంలో ఎన్‌డీఏ పాలకులు ఆచి తూచి అడుగేస్తారని ఆశిద్దాం.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top