వానలు, వరదలు

Sakshi Editorial on Heavy Rains

పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత దేశంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. పదిరోజులుగా విడవ కుండా కురుస్తున్న వానలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో జనావాసాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లన్నీ నిండు కుండల్లా ఉన్నాయి.  కృష్ణా బేసిన్‌లో పాతికేళ్ల తర్వాత తొలిసారి అన్ని ప్రాజెక్టుల గేట్లూ ఎత్తేయక తప్పలేదంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఆల్మట్టి, నారాయణ పూర్, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నిటా అన్ని క్రస్ట్‌ గేట్లూ ఎత్తేయవలసి వచ్చింది.  గోదావరి కూడా అదే జోరు ప్రదర్శించి కాస్త శాంతిం చింది. ఎప్పటిలాగే ఈసారి కూడా రుతుపవనాలు దెబ్బతీశాయని అనుకునేంతలోనే కురిసిన ఈ వర్షాలు సహజంగానే ప్రజానీకానికి ఎంతో ఊరటనిచ్చాయి. అయితే మహారాష్ట్ర,  కేరళ, కర్ణాటకల్లో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం తప్పలేదు. దేశ వ్యాప్తంగా వరదల వల్ల దాదాపు 200మంది మరణించారు. లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత తగ్గడంతో నదులు శాంతిస్తున్నాయి. 

నిన్న మొన్నటి వరకూ కరువుతో అల్లాడిన ప్రాంతాలన్నీ కుంభవృష్టి పర్యవసానంగా చిగురు టాకులా వణుకుతుండటం ఒక వైచిత్రి. మానవ తప్పిదాల కారణంగా పర్యావరణం దారుణంగా దెబ్బతిని వాతావరణ పరిస్థితులు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. అదునుకు వర్షాలు కురవక అనేక ప్రాంతాలు కరువుకోరల్లో చిక్కుకోవడం... కురిసిన సందర్భాల్లో ఒక్కసారే పదుల సెంటీమీటర్ల వర్షం ముంచెత్తడం ఇటీవలకాలంలో తరచు చూస్తున్నాం. ఈసారి అనేక ప్రాంతాల్లో  50 శాతం మొదలుకొని 140 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మైసూరు వంటి ప్రాంతాల్లో ఇంతకు మించి మరెన్నో రెట్లు ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మూడు వైపులా సముద్రం ఉన్న మన దేశానికి వాయుగుండాలు, తుపానులు, వరదలు తప్పవు. వీటివల్ల తరచుగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పడం లేదు. ‘వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియద’ంటారు. వైజ్ఞానిక ప్రగతి పర్యవసానంగా ఆ రెండూ తెలుసుకోవడం ఇప్పుడెంతో మెరుగైంది. కానీ ఇప్పటికీ అవి పూర్తిగా అంచనా వేయడం అసాధ్యమవుతున్నది. ఎల్‌ నినో పర్యవసానంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చునని లేదా లా నినా వల్ల కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతుంటుంది. రాగల 24 గంటలు లేదా 48 గంటలూ ఎలాంటి పరిస్థితులుంటాయో అంచనా వేస్తోంది. అవి చాలావరకూ మెరుగ్గానే ఉంటున్నాయి. కానీ మరింత నిర్దిష్టంగా, నిర్దుష్టంగా చెప్పడం మాత్రం ఇంకా సాధ్యపడటం లేదు.

విషాదమేమంటే చెప్పిన మేరకైనా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాయి. మహారాష్ట్రలోనైనా, కర్ణాటకలోనైనా పరిస్థితి ఇదే. అక్కడ వరదలు ముంచె త్తాక సైన్యం, విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగి సేవలందించాయి. అదంతా ప్రశంసిం చదగ్గదే. కానీ ఆ రాష్ట్రాల్లో  అవసరమైన స్థాయిలో సమన్వయం లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. అధికార యంత్రాంగంలోని భిన్న వ్యవస్థలు ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ, ఎక్క డేది అవసరమో చూసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేసే వీలుండేది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీటిని విడతల వారీగా విడుదల చేస్తే ఇంతచేటు నష్టం ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్పుడల్లా ఇలాంటి లోపాలపై చర్చ జరగడం రివాజుగా మారినా అధికార యంత్రాంగాల్లో మార్పు రావడం లేదు. మనకు మొత్తంగా 5,344 భారీ ఆనకట్టలున్నాయి. వీటిల్లో 75 శాతం పాతికేళ్ల నాటివి. మరో 164 వందేళ్లక్రితానివి. దాదాపు 40 ఆనకట్టలు తెగిపడిన సందర్భాలున్నాయి. 

మన దేశానికి 7,517 కిలోమీటర్ల పొడవునా తీరప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న 84 జిల్లాల్లో 77 నగరాలు, 130 పట్టణాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్టణంవంటి నగరాలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, దాని పురోగతికీ ఎంతగానో ఆయువుపట్టువంటివి. దాదాపు 26 కోట్లమంది ప్రజానీకం లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ తీరప్రాంతాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉంటుంది. కనుకనే సముద్ర తీరం, జల వనరులుండే చోట 500 మీటర్ల సమీపంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు, నిర్మాణాలు చేయకూడదని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జడ్‌) నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఆ నిబంధనల్ని ప్రభుత్వాలే బేఖాతరు చేసి విచ్చ లవిడిగా అనుమతులిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హయాంలో కృష్ణా కర కట్టమీద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోగా, ప్రభుత్వమే ‘ప్రజావేదిక’ పేరుతో భవనం నిర్మించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చాక ఆ భవంతిని కూల్చడానికి చర్యలు తీసుకుంటే చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టారో అందరూ చూశారు. కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం ఆగకుంటే ఆయన ఉంటున్న నివాసం కూడా ఇప్పుడు మునిగే ప్రమాదం ఉంది. అక్కడే కాదు...ఆ రాష్ట్రంలో చాలాచోట్ల సీఆర్‌జడ్‌ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించారు. ఇష్టానుసారం రిసార్ట్‌లు, హోటళ్లు వగైరాలు నిర్మించారు. నిజానికి సీఆర్‌జడ్‌ నిబంధనల్ని కూలం కషంగా అధ్యయనం చేసి, జరుగుతున్న నష్టాల్ని గమనించి వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వచ్చారు. అయినా ఉల్లంఘనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడొచ్చిన వరదలు చూశా కైనా ఇలాంటి నియంత్రణలపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. కఠినంగా వ్యవహరిం చాలి. అలాగే ఇప్పుడు అనుసరిస్తున్న వరద నియంత్రణ చర్యల్లోనూ, సహాయం అందించడం లోనూ ఎదురవుతున్న సమస్యల్ని గమనించి, లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top