ఉదారవాదానికి ఫ్రాన్స్‌ ఓటు | Emanuel mekron, Front runner in France President elections | Sakshi
Sakshi News home page

ఉదారవాదానికి ఫ్రాన్స్‌ ఓటు

Apr 26 2017 2:26 AM | Updated on Sep 5 2017 9:40 AM

ఉదారవాదానికి ఫ్రాన్స్‌ ఓటు

ఉదారవాదానికి ఫ్రాన్స్‌ ఓటు

యూరప్‌ ఖండం...ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠతో గమనిస్తూ వస్తున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో మధ్యేవాద రాజకీయ పక్షం ఎన్‌మార్చ్‌ నేత ఇమ్మానియెల్‌ మేక్రోన్‌ పైచేయి సాధించి అందరికీ ఊరట కలిగించారు.

యూరప్‌ ఖండం...ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠతో గమనిస్తూ వస్తున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో మధ్యేవాద రాజకీయ పక్షం ఎన్‌మార్చ్‌ నేత ఇమ్మానియెల్‌ మేక్రోన్‌ పైచేయి సాధించి అందరికీ ఊరట కలిగించారు. వచ్చే నెల 7న జరగబోయే రెండో దశ ఎన్నికల్లో చివరకు ఆయనే విజేతగా నిలుస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. యూరప్‌ యూని యన్‌ (ఈయూ) నుంచి బయటకు రావాలా వద్దా అన్న అంశంపై బ్రిటన్‌లో నిరుడు జూన్‌లో జరిగిన రిఫరెండంలో, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయవాద నేతలే విజయం సాధించారు. మొన్నటికి మొన్న టర్కీలో అధ్యక్షుడు రిసెప్‌ ఎర్డోగాన్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టే రాజ్యాంగ సవరణలకు విశేష మద్దతు లభించింది. యూరప్‌లో చాలాచోట్ల అలాంటి ధోరణులే వ్యక్తం కావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

ఉన్నంతలో గత నెల జరిగిన నెదర్లాండ్స్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితం ఉదారవాదులకు ఊరట కలగజేసింది. ఇప్పుడు ఫ్రాన్స్‌ సైతం ఆ దిశను సూచించడం వారికి సంతృప్తినిచ్చింది.  నాలుగు కోట్ల 70 లక్షలమంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికలతో ఈయూ భవితవ్యం, మొత్తంగా యూరప్‌ నడత ముడిపడి ఉన్నాయి. మేక్రోన్‌ గెలుపు ఈయూని బలం పుంజుకునేలా చేస్తుంది. ఇతర దేశాల్లో సైతం జాతీయ వాదుల్ని అడ్డుకుంటుంది. అందుకే అందరూ ఈ ఎన్నికలపై ఎక్కడి లేని ఆసక్తినీ కనబరిచారు. ఫ్రాన్స్‌ ఎన్నికల పోరు ఎప్పుడూ మితవాద, వామపక్ష పార్టీల మధ్య సాగుతుంటుంది. కానీ ఈసారి తొలి దశ పోలింగ్‌ ఆ రెండింటినీ తుడిచిపెట్టి దేశ రాజకీయ రంగంపైకి కొత్త ధోరణులను ప్రవేశపెట్టింది. 22 ఏళ్ల తర్వాత 2012లో తొలిసారి విజయకేతనం ఎగరేసిన సోషలిస్టు పార్టీ అయిదేళ్లలోనే కావలసినంత అప్రదిష్టను మూటగట్టుకుంది. అందుకే సోషలిస్టు పార్టీ నేత, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హŸలాండ్‌ రంగంనుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన బెనోయిట్‌ హమాన్‌కు ఈ ఎన్నికల్లో కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయంటే ఆ పార్టీ పాలనపై జనంలో ఎంత ఏవగింపు ఉన్నదో అర్ధమవుతుంది.

అలాగని ప్రధాన ప్రత్యర్థిగా ఉంటున్న మధ్యేవాద రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిలాన్‌కు కూడా అంతంతమాత్రంగానే ఓట్లు లభించాయి. ఆయన 19.9 శాతం ఓట్లతో మూడో స్థానంలోకి వెళ్లారు. గృహిణిగా ఉంటున్న తన భార్య తనకు పార్లమెంటరీ సహాయకురాలిగా పనిచేశారని తప్పుడు పత్రాలు చూపి పదేళ్లపాటు ఆయన 5 లక్షల యూరోల ప్రభుత్వ నిధుల్ని కాజేశారన్న ఆరోపణ లొచ్చాయి. దాంతో మొదట్లో ఆయనకు కనబడిన ఆదరణ క్షీణించింది. తీవ్ర మితవాద భావాలతో ప్రత్యర్థులను హడలెత్తించిన జాతీయవాది లీపెన్‌ చివరకు 21.4 శాతం ఓట్లకు పరిమితమయ్యారు. నిరుడు కొత్తగా పార్టీని స్థాపించి రాజకీయ బరిలోకి అడుగుపెట్టిన మధ్యేవాద పార్టీ ఎన్‌మార్చ్‌ నేత మేక్రోన్‌ చాలా తక్కువకాలంలోనే ఓటర్లను విశేషంగా ఆకట్టుకోగలిగారు. ఆయనకు 24 శాతం ఓట్లు లభించాయి. మాజీ బ్యాంకర్‌ అయిన మేక్రోన్‌ ఈయూలో భాగంగా ఉంటేనే ఫ్రాన్స్‌ అభివృద్ధి సాధ్యమని వాదించారు. రాజకీయానుభవం లేకపోవడం, అవి నీతి మరక అంటకపోవడం మేక్రోన్‌కు కలిసొచ్చింది.

ఈ ఎన్నికల్లో తీవ్ర మితవాద భావాలున్న లీపెన్‌తోపాటు తీవ్రవాద వామపక్ష భావాలున్న జీన్‌ మెలెంకోన్‌ విషయంలోనూ మార్కెట్‌ అనుకూల శక్తులు పక్క బెదురుతోనే ఉన్నాయి. వారనుకున్నట్టే మెలెంకోన్‌ సైతం 19.6 శాతం ఓట్లు గెల్చుకున్నారు. పైగా ఓటేసిన 18–24 ఏళ్లమధ్య వయసున్న యువతలో 30 శాతంమంది ఆయనకే మొగ్గు చూపారు. లీపెన్, మెలంకోన్‌లంటే మార్కెట్‌ అనుకూల శక్తులు భయపడటానికి కారణాలున్నాయి. వీరిద్దరూ వారి వారి మార్గాల్లో ఫ్రాన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తామని, గత వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. నాటోతో దూరం కావడం, రష్యాతో సాన్నిహిత్యం, ఆర్ధిక రంగంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ఫ్రాన్స్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడం వగైరా అందులో కొన్ని. ఈయూలో కొనసాగడం విషయంలో ఆ సంస్థ బాధ్యులతో కొత్తగా చర్చించడం, అవి ఫలించకపోతే వెలుపలికి రావడం వీరి ఎజెండా. లీపెన్‌ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడంతోపాటు వలసలపై మార టోరియం విధిస్తానని హామీ ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అత్యంత అమానుషంగా 73,000మంది యూదులను నిర్బంధించి దేశంనుంచి బలవంతంగా వెళ్లగొట్టిన తరహా చర్యలు మళ్లీ అవసరమని ప్రచారం చేశారు.

అటు మెలంకోన్‌ అమెరికాలో డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీతో పోటీపడిన బెర్నీ సాండర్స్‌ లాంటివారు. శ్రీమంతులపై ఇప్పుడున్న పన్నుల్ని వందశాతం పెంచుతానని చెప్పడంతోపాటు క్యూబా, వెనిజులా వంటి దేశాలతో చెలిమికి కృషి చేస్తానన్నారు. ఇప్పుడు మెలంకోన్‌ నాలుగో స్థానానికి పరిమితమై ఉండొచ్చుగానీ... ఆయన భావాలకు సమాజంలో చెప్పుకోదగ్గ ఆద రణ ఉన్నదన్న విషయం ధ్రువపడింది గనుక అది కార్పొరేట్‌ రంగానికి ఆందోళన కలిగించే విషయమే. ఈయూనూ, వలసలనూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న లీపెన్‌ సర్వేల జోస్యాన్ని మించి మరింత కిందకు పడిపోయారని, వచ్చే నెల 7న మేక్రోన్‌తో తలపడినప్పుడు ఆమె ఓటమి ఖాయమని ఉదారవాద శక్తులు ఊపిరి పీల్చుకుం టున్నాయి. కానీ ఇద్దరికీ మధ్య దాదాపు మూడు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. మేక్రోన్‌ అధ్యక్షపీఠం అధిరోహించినా చీలికలైన సమాజాన్ని ఏకతాటిపై నడిపించడం తలకు మించిన భారమే. ప్రభుత్వ వ్యయంలో వృథాను అరికడ తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఫ్రాన్స్‌ ఆర్ధిక రంగానికి జవసత్వాలు తీసు కొస్తానని, ఆ రంగంలో సంస్కరణలు చేపడతానంటున్నారు. అయితే ఇవన్నీ అమలు కావాలంటే మరో రెండు నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఎన్‌మార్చ్‌ పార్టీకి మెజారిటీ లభించాలి. అన్నిటికీ మించి తన విధానాల అమలుకు ఎదురయ్యే సవాళ్లను మేక్రోన్‌ ఎలా అధిగమించగలరో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement