
బాబువి అనైతిక రాజకీయాలు : ఎంపీ వైఎస్ అవినాష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అనైతిక రాజకీయాలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు.
పులివెందుల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అనైతిక రాజకీయాలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంతవరకు అభివృద్ధి గురించి మాట్లాడకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మహానాడులో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా వైఎస్ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం.. రాష్ట్రంలోని ప్రజలకు ఏకష్టమొచ్చినా వారి గురించి పోరాటం చేసేది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే నన్నారు. చంద్రబాబు మాత్రం ప్రజల గురించి ఆలోచించకుండా అవినీతి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాజ్యసభ బరిలో బలం లేకున్నా చంద్రబాబు నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలనుకోవడం చంద్రబాబు అనైతికతను తెలియజేస్తోందన్నారు. తన అవినీతి సొమ్ముతో భారీగా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఇక్కడ కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మరలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను మభ్యపెట్టగలడేమోగాని ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీని ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆయన మోసాలపై జూన్ 2వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ పోలీస్ స్టేషన్లలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసులు పెడతామన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.