వివాహిత దారుణ హత్య | woman murder in buddaiahdoddi | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Jul 5 2017 10:43 PM | Updated on Sep 5 2017 3:17 PM

భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

శెట్టూరు (కళ్యాణదుర్గం) : భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శెట్టూరు మండలం బుడ్డయ్యదొడ్డిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి తల్లిదండ్రులు గొల్ల బసమ్మ, వీరనాగప్ప, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుడ్డయ్యదొడ్డికి చెందిన గొల్ల లక్ష్మీదేవి (32)కి 14 ఏళ్ల కిందట కళ్యాణదుర్గం మండలం ముదిగల్లుకు చెందిన ధనుంజయతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మూడేళ్ల కిందట వీరు బుడ్డయ్యదొడ్డికి వచ్చి వేరుగా కాపురం ఉంటున్నారు. సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో గల ఒక డాబాలో ధనుంజయ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

కొన్ని రోజులుగా ఇతను మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బు ఇవ్వాలని భార్యతో తరచూ గొడవపడేవాడు. తాగొచ్చాక వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా డబ్బు విషయంలో గొడవపడ్డాడు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో బయటకెళ్లిపోయి పూటుగా మద్యం తాగి వచ్చిన ధనుంజయ.. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న భార్య లక్ష్మీదేవి తలపై బండరాయి వేసి పరారయ్యాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు అజయ్‌ (12), కుమార్తె గాయత్రి (10) ఉలిక్కిపడి లేచారు. రక్తపుమడుగులో పడిఉన్న తల్లిని చూసి ఏడుస్తుండటంతో బంధువులు, ఇరుగుపొరుగువారు వచ్చి హుటాహుటిన కళ్యానదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీదేవి మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న పిల్లలు.. ఇక అమ్మ తిరిగిరాదని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. బుధవారం సాయంత్రం సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ శ్రీకాంత్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, స్థానికులను విచారణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement