ప్లాస్టిక్ పనిపట్టేస్తారా?
‘ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్, ఫ్లెక్సీలను వెంటనే నియంత్రించండి. ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దండి. ఫ్లెక్సీల్లో సీఎం బొమ్మ ఉన్నా వెనుకాడవద్దు. పక్కాగా అమలుచేస్తే కోటి రూపాయల నజరానా అందజేస్తాం...’ అంటూ ఈనెల 1న జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపాలిటీల రాష్ట్ర సదస్సులో మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మరుసటి రోజు జరిగిన డెప్యూటీ సీఎం మహమూద్
-
నగరాన్ని కమ్మేస్తున్న ఫ్లెక్సీలు
-
గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలు
-
బహిరంగంగా ప్లాస్టిక్‌సంచుల విక్రయాలు
కరీంనగర్ కార్పొరేషన్ : ప్లాస్టిక్ కవర్ చేతిలో పట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఏ వస్తువు కొనుగోలు చేసినా దుకాణదారులు ఓ కవర్లో పెట్టి మన చేతికి అందిస్తున్నారు. వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేస్తుండడంతో ప్లాస్టిక్ గుట్టలు తయారవుతున్నాయి. వందల ఏళ్లపాటు భూమిలో కలవని ఈ ప్లాస్టిక్ పర్యవరణానికి ముప్పుగా పరిణమించింది. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, మంచి నేల అందించాలంటే ప్లాస్టిక్ నియంత్రణపై ఇప్పటికైన మున్సిపల్ అధికారులు దష్టిసారించాల్సిందే.
పాలిథీన్‌మయం
పాలు, కూరగాయలు, పండ్లు, నూనెలు, స్వీట్స్, చివరికి మెుక్కజొన్న కంకులు సైతం ప్లాస్టిక్ ప్యాకెట్లలో ప్యాక్ చేసేస్తున్నారు. మటన్, చికెన్, చేపలు ఇలా ఏది తీసుకెళ్లాలన్నా ప్లాస్టిక్ సంచులే దిక్కుగా మారాయి. చివరకు శుభకార్యాల్లో సైతం ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన విస్తరిలోనే భోజనం వడ్డిస్తున్నారు. శరీరంలోకి చేరిన పాలిథీన్ వ్యర్థాలు ఆయువును హరిస్తున్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
పలు వ్యాధులకు కారణం
పాలిథీన్ వెయ్యేళ్ల వరకు భూమిలో కలిసిపోకుండా పలు నష్టాలకు కారణంగా మారుతుంది. వర్షపునీరు భూగర్భజలంగా మారకుండా అడ్డుకుంటుంది. పాలిథీన్ కాల్చగా బయాక్సిన్, ప్యూరాన్ వంటి విషవాయువులు వెలువడుతున్నాయి. వీటిని పీల్చినవారు కేన్సర్ బారినపడే ప్రమాదముంది. రంగురంగుల సంచుల తయారీలో వాడే సీసం, కాడ్మియం నరాల బలహీనతకు దారితీస్తుంది.
నిషేధం ఉన్నా
పాలిథీన్ కవర్లు అమ్మితే జరిమానా విధించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో నగరంలో బహిరంగంగానే పాలిథీన్ కవర్లు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ను నియంత్రించిన ప్రతిసారీ వ్యాపారులకువరంగా మారి వాటి ధరలకు రెక్కలొస్తున్నాయి.
అడ్డగోలుగా ఫ్లెక్సీలు
ముఖ్య నేతల పర్యటనలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు, బహిరంగసభలు ఏవైనా ఫ్లెక్సీలు ఉండాల్సిందే. మున్సిపాలిటీకి ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా ఫ్లెక్సీ పెడుతున్న నియంత్రించడం లేదు. ఒకటి, రెండు రోజుల కోసం కట్టే ప్లెక్సీలన్నీ డంప్‌యార్డుకు చేరి, పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటనకు ముందే ఒక్క ప్లెక్సీ కూడా కట్టవద్దంటూ ఆదేశించారు. దీంతో మున్సిపాలిటీల సదస్సు ఆర్భాటం లేకుండా జరిగింది.
అవగాహనే ముఖ్యం
జీవకోటికి ప్రాణాంతకమైన పాలిథీన్ వాడకంతో ఎన్నో అనర్థాలను ఎదుర్కొంటున్నాం. దీన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలి. జనపనార, బట్ట సంచులు వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా చేయవచ్చు. మహిళా సంఘాలు, యువతకు జనపనార, కాగితపు సంచుల తయారీలో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం అందజేయాలి. అదేవిధంగా నిషేధిత ప్లాస్టిక్ విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టాలి.
నిషేధం అమలుపై దష్టి సారిస్తున్నాం
– రవీందర్‌సింగ్, నగరమేయర్
నిషేధిత పాలిథీన్ కవర్ల వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంత్రి కేటీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే జరిమానాలు విధిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతాం.