ఆ పోలీసు కమిషనరేట్‌ల పరిధి పెంపు | Sakshi
Sakshi News home page

ఆ పోలీసు కమిషనరేట్‌ల పరిధి పెంపు

Published Tue, Oct 4 2016 11:25 PM

To increase the range of the Police Commissionerate

సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ల పరిధి మరింత పెరగనుంది. ఇప్పటికే మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లతో కూడిన మల్కాజిగిరి జోన్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లతో ఎల్‌బీనగర్‌ జోన్‌లతో పాటు భువనగిరి, చౌటుప్పల్‌ డివిజన్లతో కూడిన భువనగిరి జోన్‌ను ఏర్పాటు చేయాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ విభజన సందర్భంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోకి, శంషాబాద్‌ జిల్లాలోకి వచ్చే కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో చేర్చే అంశంపై దృష్టి సారించాలని తాజాగా సీఎం కేసీఆర్‌ సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలెట్టారు.

భువనగిరి జోన్‌లోకి మరిన్ని ఠాణాలు...
భువనగిరి జోన్‌లో భువనగిరి, చౌటుప్పల్‌ డివిజన్‌లు ఇప్పటికే ఉండేలా సైబరాబాద్‌ విభజన సందర్భంలో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం గవర్నర్‌ ఆర్డినెన్స్‌ కూడా జారీ చేశారు. భువనగిరితో పాటు బీబీనగర్, బొమ్మల రామారం, చౌటుప్పల్, వలిగొండ, భూదాన్‌ పోచంపల్లి, వలిగొండ ఠాణాలు ఇప్పటికే రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉండగా...

తాజాగా ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం), గుండాల, రామన్నపేట, మోత్కూరు, ప్రతిపాదిత మండలాలు మోటకొండూరు, అడ్డగుడూరులోకి వచ్చే ఠాణాలు అన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో భువనగిరి జోన్‌లో మరిన్ని ఠాణాలు కలిసే అవకాశం కనబడుతోంది. అయితే వీటిలో ఎన్ని ఠాణాలు రాచకొండ పరిధిలోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

సైబరాబాద్‌ పరిధి మరింత విస్తృతి...
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్‌ జోన్‌లు ఉన్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌ డివిజన్లతో శంషాబాద్, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్‌ డివిజన్లతో మాదాపూర్‌ జోన్, పేట్‌ బషీరాబాద్, బాలానగర్‌ డివిజన్లతో బాలానగర్‌ జోన్‌లు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్‌ తాజా నిర్ణయం ప్రకారం...

సైబరాబాద్‌లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు వచ్చి చేరుతున్నాయి. వీటిలో ఆమన్‌గల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలు ఉన్నాయి. ఈ ఠాణాలను కూడా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. అయితే ఈ రెండు కమిషనరేట్ల ఏర్పాటు కోసం గవర్నర్‌ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సవరణ చేసి మరిన్ని ఠాణాలు కలపడంపై దృష్టి సారించాలని ఆయన సూచించినట్టు తెలిసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement