రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడు అవయవదానంతో ముగ్గురిని పునర్జన్మనివ్వగా, ఇద్దరికి చూపు ప్రసాదించారు.
విజయవాడ (లబ్బీపేట): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడు అవయవదానంతో ముగ్గురిని పునర్జన్మనివ్వగా, ఇద్దరికి చూపు ప్రసాదించారు. విజయవాడ పటమట పంటకాలువ రోడ్డులో నివసించే రేగాని భవానీప్రసాద్(27) ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి ఏలూరురోడ్డుపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా, అప్పటి నుంచి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12వ తేదీన బ్రెయిన్‌డెడ్ అయింది. వైద్యులు అవయవదానంపై భవానీప్రసాద్ తల్లి లక్ష్మీనారాయణమ్మ, సోదరుడు రమణలకు వివరించగా వారు అంగీకరించారు.
జీవన్‌దాన్ ట్రస్టుకు సమాచారం అందచేశారు. అనంతరం బ్రెయిన్‌డెడ్‌కు గురైన భవానీప్రసాద్‌ను సూర్యారావుపేటలోని అరుణ్ కిడ్నీకేర్ సెంటర్‌కు తరలించి రెండు కిడ్నీలు, రెండు కళ్లు, లివర్‌ను సేకరించారు. ఒక కిడ్నీని అక్కడే ఒకరికి అమర్చగా, మరో కిడ్నీని ఆయుష్ హాస్పిటల్‌కు, లివర్‌ను మణిపాల్ ఆస్పత్రికి, కళ్లను వాసన్ ఐకేర్‌కు తరలించారు. డాక్టర్ అమ్మన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదానికి గురైన భవానీ ప్రసాద్ తలకు బలమైన గాయమైందని, శరీరంపై మరెక్కడా గాయాలు లేవన్నారు.