చివరి దశలో పొగాకు కొనుగోళ్లు | The final stage of the tobacco purchases | Sakshi
Sakshi News home page

చివరి దశలో పొగాకు కొనుగోళ్లు

Jul 11 2016 4:08 AM | Updated on Oct 1 2018 2:00 PM

చివరి దశలో పొగాకు కొనుగోళ్లు - Sakshi

చివరి దశలో పొగాకు కొనుగోళ్లు

జిల్లాలో పొగాకు కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే వారంలో వెల్లంపల్లి 1,2, ఒంగోలు-1, గుటూరు-1,2 కేంద్రాల్లో వేలం ముగియనుండగా..

ఒంగోలు టూటౌన్ :  జిల్లాలో పొగాకు కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే వారంలో వెల్లంపల్లి 1,2, ఒంగోలు-1, గుటూరు-1,2 కేంద్రాల్లో వేలం ముగియనుండగా.. ఆగస్టు మొదటి వారంలో ఒంగోలు-2, కొండపి వేలం కేంద్రాల్లో వేలం ముగియనుంది. జిల్లాలో మొత్తం 12 వేలం కేంద్రాలుండగా నెల్లూరు జిల్లాలో రెండు వేలం కేంద్రాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120 మిలియన్ కిలోల పొగాకు పంట ఉత్పత్తికి అనుమతివ్వగా జిల్లాలో 70 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. రైతులు కూడా ఆ మేరకే ఉత్పత్తి చేసేందుకు పొగాకు పంటను సాగు చేశారు. ప్రకృతి మీద ఆధార పడిన పంట అరుునందున అదనంగా మరో 5 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అయ్యిందని అంచనా. ఇప్పటి వరకు 55 మిలియన్ కిలోల పొగాకు అన్ని వేలం కేంద్రాల్లో కొనుగోలు చేశారు.

ఇంకా రైతుల వద్ద సుమారుగా 20 మిలియన్ కిలోల పొగాకు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వ్యాపారులు కొనుగోలు చేసిన పొగాకుకు కేజీకి సరాసరి కేవలం రూ.112లు మాత్రమే ధర వచ్చిందని రైతు నాయకులు చెబుతున్నారు. వాస్తవంగా కిలో పొగాకు ఉత్పత్తి చేసేందుకు సుమారుగా రూ.135లు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు వచ్చిన సరాసరి ధర రూ.112లతో పోల్చితే రైతులు కిలోకు రూ.23 వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఇంకా రైతుల వద్ద లోగ్రేడ్, మిడిల్ గ్రేడ్ పొగాకు ఉంది.

ప్రస్తుతం వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధర ఇలానే కొద్ది రోజులు సాగితే సరాసరి ధర రూ.100లకు పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు కిలోకు రూ.35లు నష్టపోవాల్సి వస్తోందని రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం చివరి దశలోనైనా బోర్డు కల్పించుకోని మిగిలిన పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
రైతుల నెత్తిన అదనపు రుసుం పిడుగు
ఈ ఏడాది పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించకపోగా.. కేంద్రం ప్రభుత్వం అదనపు పంటపై జరిమానా భారం మోపి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. అనుమతికి మించి పదిశాతం పంట ఉంటే దాన్ని కొనుగోలు చేసేందుకు కిలోకు రూ.2లు వసూలు చేస్తారు. దీంతో పాటు పంట విలువలో రూ.7.5 శాతం అపరాధ రుసుం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పది శాతం కన్న అధికంగా పంట ఉత్పత్తి జరిగితే కిలోకు రూ.2లతో పాటు అదనంగా రూ.15 శాతం రుసుం వసూలు చేస్తారు.

ఇదే కనుక అమలు జరిగితే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి రావడం ఖాయం. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న పొగాకు రైతులకు పెనాల్టీ రుసుంతో మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. మళ్లీ గత ఏడాది పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితి వస్తుంది. మళ్లీ రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పిన పరిస్థితి పాలకులదే అవుతుంది. పరిస్థితిని గమనించి అదనపు పంటపై విధించిన పెనాల్టీని రద్దు చేయించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement