తుది దశకు..

తుది దశకు.. - Sakshi

  •  వేగంగా పునర్విభజన ప్రక్రియ


ఇందూరు : జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. దసరా నుంచే కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో వేర్వేరుగా పరిపాలన జరిగాలని రాష్ట్ర సర్కారు స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం బిజీగా మారింది. కొత్త జిల్లాల మ్యాపులు, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, ఇతర జిల్లా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కొత్త మండలాల్లో ఏర్పాటు చేసే మండల కార్యాలయాల పరిశీలనతో మొదలైన ప్రక్రియ ఫైళ్ల విభజన, స్కానింగ్, ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం, వాహనాలు, ఫర్నిచర్‌ వరకు విభజన ప్రక్రియ ఈ పాటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన పది శాతం పని ఆదివారం పూర్తిచేసి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇక కలెక్టరేట్‌కు వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. రెండో శనివారం, ఆదివారం సెలవులు రద్దు చేసి పునర్విభజన పనులను కలెక్టర్‌ యోగితారాణా చక చకా చేయిస్తున్నారు. ఏ అధికారికి, ఉద్యోగికి సెలవులు మంజూరు చేయడం లేదు.


 

వివరాలు పోర్టర్‌లో నమోదు చేయాలి..

కొత్తగా ఏర్పాటు కానున్న కామారెడ్డి జిల్లా కార్యాలయం, బాన్సువాడ రెవెన్యూ కార్యాలయం, తొమ్మిది మండల కార్యాలయాల ఫైళ్ల విభజన, స్కానింగ్, పరికరాలు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో జిల్లా అధికారులతో జరిగిన జిల్లాల పునర్‌విభజన సమావేశంలో కలెక్టర్‌ యోగితారాణా స్పష్టం చేశారు. సదరు నమోదులపై సంబంధిత శాఖ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, దీంతోపాటు శాఖల్లో పని చేసే అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులను ప్రతిపాదించాలన్నారు. ఉదాహరణకు ఆర్మూర్‌ ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు డిమాండ్‌ ఉన్నందున, ఆ యూనిట్లను ప్రోత్రహించేందుకు ఒక పరిశ్రమల విభాగాన్ని ప్రతిపాదించాలని చెప్పారు. అలాగే రాష్ట్ర్ట ప్రభుత్వం అన్ని పాఠశాలలను డిజిటల్‌ బోధనతో అనుసంధానం చేస్తున్నందున డివిజన్‌ స్థాయిలో డిజిటల్‌ బోధనను మానిటరింగ్‌ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఐకేపీ, ఆరోగ్యం, ఐసీడీఎస్‌ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు డివిజన్‌ స్థాయిలో వ్యవస్థ పరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయాల్లో వినియోగిస్తున్న ఫర్నిచర్‌కు కూడా వారితో తరలించాలని స్పష్టం చేశారు. ఏ శాఖకు కూడా కొత్తగా ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉన్నదానితోనే పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ ఎ, రవీందర్‌రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీడీ గ్రౌండ్‌ వాటర్‌ జగన్‌మోహన్‌ ఉన్నారు.

 

1,150కు చేరిన అభ్యంతరాలు

జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మండలాల ఏర్పాటు, గ్రామాల మార్పులు–చేర్పులపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్‌కు అభ్యంతరాలు, వినతులు అందుతూనే ఉన్నాయి. శనివారం వరకు 1,150 నమోదయ్యాయి. వచ్చిన అభ్యంతరాలలో తమ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని, పాత మండలాల్లోనే కొనసాగించాలని, వద్దని, కామారెడ్డి జిల్లాలోనే మండలాన్ని, గ్రామాన్ని ఉంచాలని, వద్దని ఎక్కువ మొత్తంలో అభ్యంతరాలు, వినతులు అందాయి. ఈ నెల 21 వరకు అవకాశం ఉండడంతో అభ్యంతరాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం కొత్త మండలాలకు డిమాండ్‌ పెరగడంతో ఏడు మండలాలను పరిశీలన చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అభ్యంతరాలు, వినతులు స్వీకరణ గడువు ముగిసిన తరువాత జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం సర్కారు వాటిని పరిశీలించి కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పూర్తి స్వరూపంతో తుది జాబితాను ప్రకటించనుంది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top