
‘కృష్ణా’పై కింకర్తవ్యం?
కృష్ణానదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించే అంశంలో కేంద్రం ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. జలాల పునఃకేటాయింపులను రెండు
♦ నీటి పంపకాలపై సుప్రీం ఆదేశాలతో కేంద్రం తర్జనభర్జన
♦ వచ్చేవారం ట్రిబ్యునల్ పరిధిపై నిర్ణయం తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించే అంశంలో కేంద్రం ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. జలాల పునఃకేటాయింపులను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? లేక నాలుగు రాష్ట్రాలను భాగస్వాములను చేయాలా అన్న దానిపై వైఖరిని వెల్లడించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించడమే ఇందుకు కారణం. మౌన ం వీడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వచ్చేవారంలో ఈ అంశంపై అభిప్రాయానికి రావాలని కేంద్ర జలవనరుల శాఖ భావిస్తున్నట్టు సమాచారం.
ఏడు నెలలుగా జరగని భేటీ
బ్రజేష్ ట్రిబ్యునల్ పరిధిపై ఎటూ తేల్చని కేం ద్రం.. కనీసం ట్రిబ్యునల్ సమావేశ నిర్వహణను కూడా పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది మార్చి 30 తర్వాత ట్రిబ్యునల్ ఇంతవరకూ సమావేశం కాలేదు. ట్రిబ్యునల్ సమావేశం జరిగే గదిలో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో కీలక పైళ్లన్నీ కాలిపోయాయి. జూన్ 30న బోర్డులోని సభ్యుడు జస్టిస్ డీకే సేథ్ ట్రిబ్యునల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన స్థానంలో కొత్తవారిని నియమించినా.. కేంద్రం తీరు అం దరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విచారణలో భాగస్వామిగా ఉన్న కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని సభ్యునిగా నియమించడంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఆ నియామకాన్ని రద్దు చేసి, విచారణలో భాగస్వామ్యం లేని కొత్త సభ్యుడిని నియమించాలని కోరాయి. కానీ ఇంతవరకూ దీనిపై కేంద్రం ఏమీ చెప్పలేదు. కృష్ణా కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తిపై ఇతర రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించేలా కేంద్రం చొరవ చూపాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగలేదు. నాలుగు రాష్ట్రాలవాదనలు వినాలంటూ ట్రిబ్యునల్‌కు సూచించిందా అంటే అదీ లేదు! అయితే ఇటీవల పంపకాలపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కేంద్ర వైఖరిపై ఘాటుగానే స్పందిస్తూ వచ్చే విచారణ సమయానికి తమ వైఖరి వెల్లడించాలని ఆదేశించింది.