విధులను విస్మరించి.. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి అడ్డంగా దొరికిన గన్‌మెన్‌పై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది.
► మహిళను లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ప్రబుద్దుడు
► కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన శాసనసభాపతి
భూపాలపల్లి: విధులను విస్మరించి.. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి అడ్డంగా దొరికిన గన్‌మెన్‌పై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్‌ఎస్‌పీ) 12వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కొంతకాలం క్రితం ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలోకి మారాడు. కొద్ది రోజులుగా శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారికి పర్సనల్ సెక్కూరిటీ ఆఫీసర్(పీఎస్‌వో)గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణానికి చెందిన ఒక మహిళ తన సమస్య పరిష్కారానికి శాసన సభాపతికి చెందిన స్థానిక క్యాంపు కార్యాలయం వద్దకు పలుమార్లు వచ్చింది. ఈ క్రమంలో పీఎస్‌వో వెంకటేశ్వర్లు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి శాసన సభాపతి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బస చేశారు. డ్యూటీలో ఉండగానే వెంకటేశ్వర్లు సదరు మహిళకు ఫోన్ చేశాడు. సింగరేణి ఉద్యోగి అయిన సదరు మహిళ భర్త రాత్రి డ్యూటీకి వెళ్ళిన అనంతరం 11.30 గంటలకు ఆ ఇంట్లోకి చొరబడడ్డాడు.
అయితే అంతకు ముందే అనుమానంతో ఉన్న ఆ మహిళ భర్త తన ఇంటి సమీపంలోనే కాపుకాసి వెంకటేశ్వర్లును పట్టుకున్నాడు. దీంతో చేసేది లేక అతడు తన బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్‌ను వదిలి రోడ్డు వెంట పరుగులు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ మధుసూదనాచారి అతడిని మందలించి పోలీసు జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. అంతేకాక కఠినంగా శిక్షించాలని ఎస్పీని ఆదేశించినట్లు సమాచారం.
కాగా మహిళ భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు వెంకటేశ్వర్లుపై ఐపీసీ 448 (అక్రమంగా ఇతరుల ఇంట్లోకి ప్రవేశించడం), 497 (లోబరుచుకోవడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లు బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. టీఎస్‌ఎస్‌పీ ఉన్నతాధికారులకు సమాచారం అందించి నేడో, రేపో వెంకటేశ్వర్లును అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.