'పల్లవి'oచిన పాట | singer pallavi interview with sakshi | Sakshi
Sakshi News home page

'పల్లవి'oచిన పాట

Jan 31 2016 9:01 AM | Updated on Sep 3 2017 4:42 PM

ఆమె గానం ‘పల్లవి’oచిన తొలిరాగమై పలకరిస్తుంది. ఆ పాటలోని మాధుర్యం నేరుగా మనసును తాకుతుంది.

ఆమె గానం ‘పల్లవి’oచిన తొలిరాగమై పలకరిస్తుంది. ఆ పాటలోని మాధుర్యం నేరుగా మనసును తాకుతుంది. ఆమె ఉఛ్వాస నిశ్వాసాలు వేణుగానాలై మార్మోగుతాయి. వారసత్వంగా వచ్చిన సంగీతానికి ఊపిరిలూది గాత్రంతో పాటు వయొలిన్‌కు ప్రాణం పోస్తున్నారు గాయని చారుమతి పల్లవి. అనేక పోటీల్లో బహుమతులు అందుకుని ‘సంఝావాన్’ వీడియో ఆల్బమ్‌ను కూడా ఆమె రూపొందించారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో బీబీఎం ఫైనలియర్ చదువుతున్న పల్లవి ఇటీవల విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో గాత్రం, వయొలిన్ కచేరీలు చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు.
 
 చిన్నతనం నుంచే..
 రాగం తానం పల్లవి.. సంగీతానికి ఇవి ప్రాణం. మా తల్లిదండ్రులు రాగం తానం అయితే పల్లవిని నా పేరులో చేర్చారు. బాల్యం నుంచి ఇంట్లో సంగీతం వినికిడి ఉండటంతో అప్పటి నుంచే   ఎవరైనా పాడుతుంటే తాళం వేసేదాన్నట. అది గమనించి నాన్న గౌరీనాథ్ నన్ను సంగీతంలో ముంచారు. నా నాల్గో ఏటే పాడటం ప్రారంభించానట. నేను పాడిన మొట్టమొదటి గీతం మోహనరాగంలో ‘వరవీణా మృదుపాణి’. ప్రస్తుతం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో బీబీఎం ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. చదువులో టాప్‌లోనే ఉన్నాను. సంగీతం, చదువు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అధ్యాపకులు, స్నేహితులు సహకరిస్తున్నారు.
 
పోటీలే గెలుపు దివిటీలు
 అభ్యుదయ ఫౌండేషన్ వారు నిర్వహించిన పోటీలో వయొలిన్, గాత్రం రెండు విభాగాల్లోనూ బంగారు పతకం, కళాదర్శిని పోటీల్లో వరుసగా నాలుగేళ్లు మొదటి బహుమతి సంపాదించాను. ఎస్‌వీబీసీ వారి గీతాంజలి, ‘జి తెలుగు’ సరిగమప, పాటల పల్లకి, ఆలాపన, పాడుతా తీయగా, నాదవినోదం... వంటి పలు రియాలిటీ షోల్లో పాల్గొని అనేక బహుమతులు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను.
 
ప్రముఖుల ప్రశంసలు
ఐదో తరగతి చదువుతున్నప్పుడు మా టీవీ   ‘పాడాలని ఉంది’ లో మొట్టమొదటిసారిగా రియాలిటీ షోలో పాల్గొని ఫైనల్స్ వరకూ వెళ్లాను. ఏడో తరగతి చదువుతున్నప్పుడు రాష్ట్రస్థాయిలో ‘బాలరత్న’ అవార్డు పొందాను. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ‘రాసక్రీడ ఇక చాలు’ పాడినప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలబడి తప్పట్లు కొట్టడం నా జీవితంలో నేను పొందిన అత్యున్నత సత్కారం. ఆయన స్పందనకు నేను ‘థాంక్యూ..’ అంటే, ఆయన ‘నువ్వు కాదు థాంక్స్ చెప్పాల్సింది.
 
ఇంత మంచి యుగళగీతాన్ని పాడి సంతోషాన్ని ఇచ్చినందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి’ అన్నారు. ప్రముఖ జాజ్ కళాకారులు శివమణి, సంగీత దర్శకుడు విద్యాసాగర్ ‘కర్ణాటక సంగీతం బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్లే ఈ పాట పాడగలిగావు’ అన్నారు. ‘నీ ఉచ్ఛారణ బాగుంది. నువ్వు వెర్సటైల్ సింగర్‌వి..’ అని కితాబిచ్చారు నేపథ్యగాయని జమునారాణి. ‘శివుడి ముందు  ఘంటానాదం మోగినట్లుంది నీ గొంతు’ అన్నారు తనికెళ్ల భరణి.
 
‘లలితభావనా’ పాట పాడినప్పుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ ‘ఇప్పుడు చాలామంది తెలుగు పాటలే తప్పులతో పాడుతున్నారు. అటువంటిది సంస్కృత గీతాన్ని నువ్వు ఒక్క తప్పు లేకుండా పాడావు. చాలా సంతోషం’ అని ప్రశంసించారు.
 
 వయొలిన్ పైనా ఆసక్తి
 అంపోలు మురళీకృష్ణ దగ్గర, ఆ తరువాత పద్మశ్రీ కన్యాకుమారి దగ్గర వయొలిన్ నేర్చుకున్నాను. తమ్ముడు మృదంగం వాయిస్తాడు. అందువల్ల ఇంట్లోనే మృదంగంతో ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే, నాన్నగారు పాడేటప్పుడు ఆయనకు పక్కవాద్యంగా వయొలిన్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. చెన్నై ‘శర్వాణి సంగీత సభ’లో నా మొట్టమొదటి వయొలిన్ కచేరీ ఇచ్చాను. ప్రస్తుతం ‘యామినీ చంద్రశేఖర’ సినిమాలో వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో పాడాను. ఆ సినిమా ఇంకా రిలీజ్ కావాలి. ఎప్పటికైనా బాంబే జయశ్రీలా కర్ణాటక సంగీతం పాడుతూ, సినీ సంగీతం కూడా పాడాలనేది నా కోరిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement