ఎమ్మెల్యే చనిపోయాడంటూ వదంతులు | Rumors about MLAs death | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చనిపోయాడంటూ వదంతులు

Oct 14 2015 1:53 AM | Updated on Aug 21 2018 5:52 PM

ఎమ్మెల్యే చనిపోయాడంటూ వదంతులు - Sakshi

ఎమ్మెల్యే చనిపోయాడంటూ వదంతులు

పోలీసులు, మీడియాను పరుగులు పెట్టించి సంచలనం సృష్టించాలనే ఆకతాయి ఆలోచన ఇద్దరు యువకులను కటకటాల పాలు చేసింది

♦ వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఆకతాయి పోస్టులు
♦ ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన నగర పోలీసులు
♦ తప్పుడు మెసేజ్‌లు పంపితే కఠిన చర్యలు: డీసీపీ
 
 హైదరాబాద్: పోలీసులు, మీడియాను పరుగులు పెట్టించి సంచలనం సృష్టించాలనే ఆకతాయి ఆలోచన ఇద్దరు యువకులను కటకటాల పాలు చేసింది. యాకుత్‌పురా ఎమ్మెల్యే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన నగరానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్(20), యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ రాషెద్ అలియాస్ మహ్మద్ జుబేర్ అహ్మద్‌ఖాన్(20) స్నేహితులు.

మహ్మద్ పహిల్వాన్ మృతిచెందాడని ఇటీవల వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో వచ్చిన సందేశాలతో మీడియా ప్రతినిధులు, పోలీసులు, నెట్ యూజర్స్ బిజీగా మారారని గుర్తించిన రాషెద్.. తాను కూడా ఇలా సంచలనం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 8న ‘యాకుత్‌పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ మృతి చెందారు. రేపు మధ్యాహ్నం మక్కా మసీదులో జనాజ్ నమాజ్ ఉంది. దీనికి అందరూ హాజరు కావాలి’ అని వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు.

ఈ మెసేజ్‌ను అందరికీ షేర్ చేయాలంటూ తన స్నేహితుడు ఇమ్రాన్ వాట్సాప్ గ్రూప్ ‘దునియా ఔర్ ఆకీరత్‌కీ బాత్’కు పంపిం చాడు. వాట్సాప్ అడ్మిన్‌గా ఉన్న ఇమ్రాన్ ఎలాంటి నిర్థారణ చేసుకోకుండా దీనిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త సామాజిక సైట్లలో చక్కర్లు కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు, మజ్లీస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి వాకబు చేయగా వార్త నిజం కాదని తేలింది. ఈ విషయమై ఎమ్మెల్యే అనుచరుడు అదేరోజు రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులనూ అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

 ‘థర్డ్ ఐ’తో కనిపెట్టారు...
 సందేశంలో మొదటగా షేక్ ఇమ్రాన్ అనే పేరు ఉండడాన్ని గమనించిన పోలీసులు.. నూతనంగా ప్రవేశపెట్టిన పోలీస్ వెబ్ అప్లికేషన్ ‘థర్డ్ ఐ’ సహకారంతో దర్యాప్తు చేపట్టారు. ఫేస్ బుక్‌లో ఇమ్రాన్ పేర్లను వెతకగా వంద పేర్లు కనిపించాయి. అందులో టెక్నికల్ పాయింట్ల ఆధారంగా వెతకగా మ్యాస్ట్రో ద్విచక్ర వాహనం (ఏపీ 10 బీడీ8502) ముందు కూర్చున్న యువకుడి ఫొటో ఉన్న అకౌంట్‌పై పోలీసులకు అనుమానం కలిగిం ది. వాహనం నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తే బన్సీలాల్‌పేటకు చెందిన షేక్ ముస్తఫా చిరునామా వచ్చింది. ఆ చిరునామాకు వెళ్లగా ఖాళీ చేసినట్లు తేలింది.

అయితే ఫేస్‌బుక్‌లో ఉన్న ఫొటో చూపించగా అది షేక్ ఇమ్రాన్‌దని.. అతని తండ్రి ఆజం పాషా జీహెచ్‌ఎంసీలో నాలుగో తరగతి  ఉద్యోగి అని స్థానికులు చెప్పారు. బాలానగర్‌లో ఉంటున్న వారి నివాసానికి వెళ్లిన పోలీసులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెల్లడించాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా రాషెద్‌ను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ నెట్‌వర్క్ సైట్లలో వచ్చే మెసేజ్‌లను నిర్థారించుకోకుండా మరొకరికి పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ముఖ్యంగా వాట్సాప్ అడ్మిన్‌ను వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement