ఈ గేట్ కీపర్.. నిన్నటి ఆఫీసర్! | RTO saleem turned to gatekeeper | Sakshi
Sakshi News home page

ఈ గేట్ కీపర్.. నిన్నటి ఆఫీసర్!

Feb 27 2016 10:52 AM | Updated on Sep 3 2017 6:33 PM

ఈ గేట్ కీపర్.. నిన్నటి ఆఫీసర్!

ఈ గేట్ కీపర్.. నిన్నటి ఆఫీసర్!

కాలం కలిసిరాకపోతే ఒక ఊరి రాజు మరో ఊరి బంటు కావచ్చు.. ఒక చోట పూలమ్మిన వ్యక్తి మరోచోట కట్టెలమ్మి బతకొచ్చు.

రవాణా శాఖలో లీలలు
నష్టపోయిన ఆర్టీవో సలీమ్
దున్ను లేకపోవడమే కారణమా!

 
 
కాలం కలిసిరాకపోతే ఒక ఊరి రాజు మరో ఊరి బంటు కావచ్చు.. ఒక చోట పూలమ్మిన వ్యక్తి మరోచోట కట్టెలమ్మి బతకొచ్చు. ఓడలు బళ్లయి మూలకు చేరొచ్చు.. కానీ అవేవీ ఈ ఉన్నతాధికారి దయనీయ పరిస్థితికి సాటి రాకపోవచ్చు.. ఎందుకంటారా? అది తెలియాలంటే మీరిది చదవాల్సిందే. ఎంత అధికారయినా అయిన వారి అనుగ్రహం లేకుంటే ఎలా మూలన పడి దీనావస్థలో కొట్టుమిట్టాడాల్సి ఉంటుందో తెలుసుకోవాల్సిందే. పైవారి ఘటనల ఫలితంగా కొందరి పరిస్థితి ఎలా తారుమారవుతుందో తెలియాలంటే రవాణా శాఖలో జరిగిన ఈ లీలను అవగతం చేసుకోవాల్సిందే.
 
విశాఖపట్నం : మాధవధారలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారనుకోండి.. అక్కడ వాహనాల రిజిస్ట్రేషన్ కేంద్రం గేటు దగ్గర ఓ కాపలాదారు కనిపిస్తారు. వాహనాల యజమానులు ఇష్టానుసారం లోనికి వెళ్లకుండా చూడడానికి, సందేహాలొస్తే తీర్చడానికి ఓ మామూలు కుర్చీలో కూర్చుని ఆయన పని చేస్తూ ఉంటారు. కూర్చున్న స్థలం బట్టి ఆయన ఓ మామూలు గేట్ కీపర్ అనుకున్నారనుకోండి.. మీరు బోల్తా కొట్టారన్నమాటే.. ఆయన విశాఖపట్నం ట్రాన్స్‌పోర్ట్ విభాగం రోడ్డు రవాణా అధికారి! నమ్మలేకపోయినా ఇది నిజం.
 
ఔనన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. నాన్ ట్రాన్స్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో గేటు కాపలాదారుగా ఉన్న ఆయన రెండేళ్ల కిందట రెండు పర్యాయాలుగా ఆర్నెల్లు విశాఖ జిల్లాకు ఇన్‌చార్జి ఉప రవాణా కమిషనర్(డీటీసీ)గా పని చేశారు! మూడేళ్లు అనకాపల్లి ఆర్టీవోగా పనిచేశారు! రోడ్డు రవాణా కార్యాలయంలో జరిగిన విచిత్ర సంఘటనలతో ఇప్పుడిలా గేటు దగ్గరకు చేరారు.
 
వింత మలుపు

చాలా మంది ఉద్యోగుల్లా సుమారు పాతికేళ్ల కిందట మహ్మద్ సలీమ్ సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)గా కెరీర్ ప్రారంభించారు. పదోన్నతితో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అయ్యారు. తర్వాత ఆర్టీవో స్థాయికి ఎదిగారు. పదోన్నతి ప్రకటిస్తే డీటీసీ అయ్యేవారే. కానీ ఇక్కడే కథ అనుకోని మలుపు తిరిగింది.  గతేడాది అనకాపల్లి కార్యాలయంలో ఆర్టీవోగా పనిచేస్తున్న సమయంలో  ఓ అక్రమం జరిగినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.
 
 అక్కడ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో డ్రైవింగ్ లెసైన్స్‌లు మంజూరయినట్టు  ఓ వ్యక్తి రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన విజిలెన్స్ విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువయ్యాయి. దాంతో పరిపాలన అధికారి (ఏవో)ను, సీనియర్ అసిస్టెంట్‌ను, జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. కార్యాలయ అధికారిగా బాధ్యత ఉందంటూ ఆర్టీవో సలీమ్‌ను కూడా సస్పెండ్ చేశారు.
 
 నెల తిరక్కుండానే పరిపాలన అధికారి, క్లర్క్‌లు మళ్లీ ఉద్యోగాలు పొందారు. కానీ ‘ఎంచేతో’ ఆర్టీవో సలీమ్‌కు పోస్టింగ్ ఇవ్వడానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలాగైతేనేం పోస్టింగ్ దక్కింది. అనకాపల్లి ఆర్టీవోగా కాకుండా డీటీసీ కార్యాలయంలో ట్రాన్స్‌పోర్ట్ ఆర్టీవోగా నియమించారు. కానీ హోదా అట్టేపెట్టి ఆయన్ను గేటు వద్ద విధులు నిర్వర్తించాలని నిర్దేశించారు.

పేరుకు ఆర్టీవో అయినా ప్రాధాన్యం లేని పోస్టింగ్ కల్పించారు. దాంతో ఒకప్పుడు ఇన్‌చార్జి డీటీసీగా పనిచేసిన అధికారి విలువ లేకుండా మిగిలారు. ఈ వ్యవహారంలో కొందరు కుట్ర చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పలుకుబడి లేకపోవడం, మైనార్టీ వర్గానికి చెందిన అధికారి కావడంతో ఇలా జరిగి ఉంటుందని ఉద్యోగులు సానుభూతి వ్యక్తం చేస్తున్నా.. సలీమ్ స్థితి మార్చగలిగేవారెవ్వరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement