ఒక్కరోజే రూ. 200 కోట్లు తాగేశారు | RS. 200 crores alchohal business in hyderabad | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే రూ. 200 కోట్లు తాగేశారు

Jan 2 2016 1:47 AM | Updated on Oct 17 2018 4:29 PM

ఒక్కరోజే రూ. 200 కోట్లు తాగేశారు - Sakshi

ఒక్కరోజే రూ. 200 కోట్లు తాగేశారు

రాష్ట్రంలో కొత్త సంవత్సరానికి కోట్ల రూపాయల ‘కిక్కు’తో ఆహ్వానం పలికారు. డిసెంబర్ 31న రాష్ట్రంలో రూ. 200 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి.

నూతన సంవత్సర వేడుకల్లో భారీగా మద్యం వినియోగం
⇒  గత ఏడాదితో పోల్చితే రూ. 50 కోట్లు అదనం
⇒  గ్రేటర్‌లోనే రూ. 120 కోట్ల మద్యం అమ్మకాలు
⇒  తెల్లవారుజాముదాకా బార్లు, క్లబ్బులు, రిసార్టుల్లో జోరు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సంవత్సరానికి కోట్ల రూపాయల ‘కిక్కు’తో ఆహ్వానం పలికారు. డిసెంబర్ 31న రాష్ట్రంలో రూ. 200 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త సంవత్సర వేడుకల్లో భారీగా మద్యాన్ని తాగేశారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్, నగర శివార్లలోనే రూ. 120 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగినట్లు రాష్ట్ర బ్రూవరీస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) వర్గాలు తెలిపాయి. ఈసారి ఖరీదైన ప్రీమియం మద్యం, విదేశీ మద్యాన్ని ఎక్కువగా వినియోగించినట్లు పేర్కొన్నాయి. మొత్తంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తాగేసిన మద్యం విలువ రూ. 200 కోట్లకు చేరింది.

ఇది గత ఏడాదితో పోలిస్తే.. రూ. 50 కోట్లు అదనం. డిసెంబర్ 31వ తేదీన జరిగే అమ్మకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల యజమానులు డిసెంబర్ 28వ తేదీ నుంచే మద్యం డిపోల నుంచి స్టాక్‌ను తీసుకెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. 28వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు సగటున రూ. 75 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. అందులో సాధారణ విక్రయాలు, మిగిలిన స్టాక్ పోను... డిసెంబర్ 31న ఒక్కరోజే రూ. 200 కోట్ల మేర అమ్మకాలు చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు సరాసరి మద్యం విక్రయాల విలువ రూ. 30 కోట్లలోపే ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో టీఎస్‌బీసీఎల్ అమ్మకాల విలువ రూ. 1,250 కోట్లు దాటింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన రూ. 1,005 కోట్ల విక్రయాలతో  పోలిస్తే ఇది రూ. 245 కోట్లు ఎక్కువ.

 గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ..
 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రిటైల్ మద్యం దుకాణాల్లో కనీసం రూ. 10 లక్షల వ్యాపారం ఒక్కరోజే జరగడం గమనార్హం. హోల్‌సేల్ రేట్లకు విక్రయించే మద్యం దుకాణాల వద్ద గురువారం రాత్రి 12 గంటలదాకా కూడా మందుబాబులు బారులు తీరారు. వీటిల్లో ఒక్కో దానిలో రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వ్యాపారం జరిగినట్లు సమాచారం. మొత్తంగా ‘గ్రేటర్’ పరిధిలోని 500 మద్యం దుకాణాలు, 495 బార్లు, 25 క ్లబ్బులకు తోడు రిసార్టులు, ప్రైవేటు ఈవెంట్ ప్రోగ్రాముల ద్వారా రూ. 120 కోట్ల విలువైన మద్యం వినియోగించినట్లు టీఎస్‌బీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అదనపు సమయం ఇవ్వడంతో దాదాపు తెల్లవారుజాము వరకు అమ్మకాలు సాగిన ప్రాంతాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement