కూలిన జీవితాలు | roof collaps.. five killed | Sakshi
Sakshi News home page

కూలిన జీవితాలు

Jul 27 2016 12:08 AM | Updated on Apr 4 2019 5:24 PM

కూలిన జీవితాలు - Sakshi

కూలిన జీవితాలు

బయట వర్షం పడుతోంది.. కాస్త చీకటిగా ఉంది. కాసేపు పడుకొని లేచి పనులు చేసుకుందాం. అనుకున్న ఆ కుటుంబ సభ్యులు జీవితాలు కుప్పకూలిపోయాయి.

మైదుకూరు టౌన్‌:
బయట వర్షం పడుతోంది.. కాస్త చీకటిగా ఉంది. కాసేపు పడుకొని లేచి  పనులు చేసుకుందాం. అనుకున్న ఆ కుటుంబ సభ్యులు  జీవితాలు కుప్పకూలిపోయాయి. మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి  చౌడు మిద్దె కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న అంగంపల్లె చిన్నగుర్రప్ప(50), పెంచలమ్మ(44), హరిత(23), యశ్వంత్‌(6), నవనీత్‌(2) అనే ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనలో మృతి చెందిన వారిలో చిన్నగుర్రప్ప, పెంచలమ్మ దంపతులతో పాటు వారి కుమార్తె హరిత, మనవళ్లు యశ్వంత్, నవనీత్‌ ఉన్నారు.
బిడ్డను కోల్పోయిన తల్లి.. తల్లిని కోల్పోయిన బిడ్డ
ఈ ప్రమాదంలో ఓ తల్లి బిడ్డను కోల్పోయి ఒంటరిగా మిగలగా, మరో చిన్నారి తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. చౌడు మిద్దె కూలిన సంఘటనలో తీవ్ర గాయాలతో లలిత(27) ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె కుమారుడు యశ్వంత్‌ మాత్రం కన్ను మూశాడు. అలాగే 9 నెలల చిన్నారి నిహారిక ప్రాణాపాయం నుంచి బయటపడగా ఆ చిన్నారి తల్లి హరిత(23), సోదరుడు నవనీత్‌(2) ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు బిడ్డ కోసం తల్లి విలపిస్తుంటే.. మరో వైపు అమ్మ కన్నుమూసిందనే విషయం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారి అమ్మ లాలన కోసం గుక్కపట్టి ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరి కంట తడిపెట్టించింది.
 ఆమె అక్కడే ఉండి ఉంటే..
ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నగుర్రప్ప చిన్న కూతురు హరిత బి.మఠం మండలం పెద్దురాజుపల్లె గ్రామంలో నివాసముంటోంది. అయితే ఆమెకు 9 నెలల క్రితం కూతురు జన్మించడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునేందుకు సోమవారం పుట్టింటికి వచ్చింది. అంతలోపే మంగళవారం తెల్లవారుజామున మిద్దె కూలిన సంఘటనలో ఆమెతో పాటు కుమారుడు నవనీత్‌(2) దుర్మరణం చెందారు. ఆమె పెద్దురాజుపల్లె గ్రామం నుంచి ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే ఆమెతో పాటు ఆమె కుమారుడి ప్రాణాలు కూడా దక్కి ఉండేవని పలువురు పేర్కొంటున్నారు.
మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..
 ఉత్సలవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుందని తెలుసుకున్న మరుక్షణమే హుటాహుటిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి గ్రామానికి చేరుకొని మృతదేహాలను చూసి చలించిపోయారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. గతంలో తాను  ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రక్కా గృహాలను  మంజూరు చేశామని, అయితే ఇప్పటి వరకు దాని మరమ్మతుల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే పక్కా గృహం ఏర్పాటు చేసి మృతుల కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆర్థిక సహాయం అందించారు.
  ఎక్స్‌గ్రేషియా మంజూరు...
 మిద్దెకూలిన ఘటనలో ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు చొప్పున మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసినట్లు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ రామకృష్ణయ్య, అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ చలపతి, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ పుల్లారెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement