
రామా.. ఏమిటీ డ్రామా
తొమ్మిది రోజులు.. ఆలయాధికారులు, పోలీసుల తనిఖీలు.. ఎంతకూ కనిపించని ఆభరణాలు.. చివరకు దేవస్థానం ఈఓ సీరియస్ వార్నింగ్.. ఇంతలోనే బయటపడ్డ నగలు.. రామా.. మీ సన్నిధిలోనే ఏమిటీ డ్రామా అని పలువురు చర్చించుకుంటున్నారు.
నగలు ఆ బీరువాలోనే ప్రత్యక్షం
ఈఓ వార్నింగ్‌తో బయటపడ్డ వైనం
అధికారులు, అర్చకుల తీరుపై భక్తుల ఆగ్రహం
భద్రాచలం : తొమ్మిది రోజులు.. ఆలయాధికారులు, పోలీసుల తనిఖీలు.. ఎంతకూ కనిపించని ఆభరణాలు.. చివరకు దేవస్థానం ఈఓ సీరియస్ వార్నింగ్.. ఇంతలోనే బయటపడ్డ నగలు.. రామా.. మీ సన్నిధిలోనే ఏమిటీ డ్రామా అని పలువురు చర్చించుకుంటున్నారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని గుర్భగుడిలో నగలు భద్రపరిచే బీరువాలోనే సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణ స్వామి లాకెట్ దొరికినట్లు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు శనివారం ప్రకటించారు. సీఐ శ్రీనివాసులు, పట్టణ ఎస్సై కరుణాకర్ ఆలయానికి చేరుకొని దొరికిన ఆభరణాలను పరిశీలించి, ఆలయ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. తొమ్మిది రోజుల హైడ్రామాకు తెరపడినప్పటికీ.. బంగారు ఆభరణాలు దొరికాయని అర్చకులు చెబుతున్న తీరు సినిమా కథను తలదన్నేలా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 19న నిత్యకల్యాణోత్సవంలో స్వామివారి అలంకరణ కోసం గర్భగుడిలోని బీరువా నుంచి బంగారు ఆభరణాలు తీసే క్రమంలో రెండు నగలు మాయమైనట్లు గుర్తించారు. సీతమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణస్వామి లాకెట్ కనిపించకపోవటంతో దీనిపై దేవస్థానం ఈఓ రమేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి ఆలయంలో రెండు ఆభరణాలు మాయం కావటం, సీతమ్మవారి పుస్తెల తాడును అర్చకులే మాయం చేశారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగటంతో.. దీనిపై దేవస్థానం అధికారులతోపాటు మరో పక్క పోలీసులు సైతం తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.
ఈఓ వార్నింగ్‌తో..
ఈఓ రమేష్‌బాబు శనివారం తన చాంబర్‌లో అర్చకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వామి వారి నిత్యాలంకరణకు సంబంధించిన బంగారు ఆభరణాలు వంశపారం పర్యంగా కొనసాగుతున్న కొందరు అర్చకుల ఆధీనంలోనే ఉన్నందున, దీనికి మీరే బాధ్యత వహించాలన్నారు. దీనిపై చర్చించిన అర్చకులంతా కలిసి గర్భగుడిలోకి వెళ్లి, నగలు భద్రపరిచే బీరువాను పరిశీలించామని, అందులోని ఓ లాకర్‌లో ఈ నగలు కనిపించాయని, ఇదే విషయాన్ని తనతో అర్చకులు చెప్పారని ఈఓ వెల్లడించారు. అయితే దేవాదాయ శాఖ ఆభరణాల తనిఖీ అధికారి(జేవీఓ) భాస్కర్ సమక్షంలో రెండు రోజులపాటు పరిశీలన చేసినా, తొమ్మిది రోజులపాటు అర్చకులంతా Ðð తికినా కనిపించని నగలు.. ఈఓ వార్నింగ్‌తో ఎలా బయటకు వచ్చాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. కాగా, అధికారులు, అర్చకుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విభేదాలతోనే...
ఆలయంలో పనిచేసే కొందరు అర్చకుల మధ్య విభేదాలే బంగారు నగలు మాయం కావటానికి ప్రధాన కారణమని ఈఓ వెల్లడించారు. దీనికి బాధ్యులైన వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని, దీనిలో ప్రమేయం ఉన్న మిగతా అర్చకులను వేర్వేరు ఆలయాలకు బదిలీ చేస్తామని చెప్పారు.
ఆ ఆభరణాలతో నిత్యకల్యాణం
మాయమైన సీతమ్మ మంగళసూత్రం, లక్ష్మణస్వామి లాకెట్ లభ్యం కావటంతో కొన్ని రోజులపాటు ఆ ఆభరణాలను స్వామివారి నిత్యకల్యాణంలో వినియోగిస్తామని ఈఓ తెలిపారు. ఆభరణాలు లభించిన వెంటనే వాటిని గర్భగుడిలో స్వామివారి మూలవరుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిని తిరిగి లాకర్‌లో భద్రపరిచారు.