'యువభేరి' ప్రొఫెసర్‌లపై కక్ష సాధింపు

'యువభేరి' ప్రొఫెసర్‌లపై కక్ష సాధింపు


విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విద్యార్థులతో కలసి నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతోంది. విశ్వవిద్యాలయం విద్యార్థులు విశాఖపట్నంలో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లుగానే ఏయూ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. యువభేరీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి(కంప్యూటర్ సైన్స్), అబ్బులు(సివిల్ ఇంజినీరింగ్)లకు ఏయూ రిజిస్ట్రార్ సోమవారం విశ్వవిద్యాలయ నిబంధనలు 3(బి) చాప్టర్ 4లోని సెక్షన్ 6 కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారు.



యువభేరీ సదస్సులో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సాయంత్రం పని వేళలు ముగిసిన తర్వాత ఆఫీసు సిబ్బంది నోటీసులతో ఆయా విభాగాలకు వెళ్లారు. అయితే ప్రసాదరెడ్డి సెలవులో ఉండగా, పనివేళలు ముగియడంతో అబ్బులు వెళ్లిపోయారు. దాంతో ఆయా విభాగాధిపతులకు ఇవ్వాల్సిన నోటీసుల కాపీలను అందించారు. విభజించి సాధిస్తున్న ప్రభుత్వం విభజించు పాలించు అన్న సూత్రం ప్రకారం ప్రభుత్వం ప్రొఫెసర్లను సాధిస్తోంది.



ఏయూ విద్యార్థులు ఆహ్వానించడంతో ఐదుగురు ప్రొఫెసర్లు యువభేరీ సదస్సుకు హాజరయ్యారు. కానీ వారిలో పాండురంగారావు, శ్రీనివాసరావు, నారాయణ లను ఏయూ అధికారులు పిలిపించి బెదిరించినట్లు సమాచారం. వారికి ఎలాంటి నోటీసులు అందకుండానే స్వచ్ఛందంగా వివరణ ఇచ్చినట్లు అధికారులు కథ నడిపించారు. మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులపై కక్ష సాధింపునకు దిగారు. సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం రానున్నారు. ఆయన మెప్పు పొందేందుకే అంత హడావుడిగా పనివేళలు ముగిసిన తర్వాత నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చినట్లే: రిజిస్ట్రార్ ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులకు నోటీసులు జారీ చేశాం. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో విభాగాధిపతులకు ఇవ్వాల్సిన నోటీసుల కాపీలు ఇచ్చాం. వారు ఇచ్చే వివరణను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top