తెలంగాణ ప్రాజెక్టులను ఆపండి | please stop telangana projects cm chandrababu request to central governament | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రాజెక్టులను ఆపండి

May 3 2016 4:02 AM | Updated on Jul 25 2018 4:09 PM

తెలంగాణ ప్రాజెక్టులను ఆపండి - Sakshi

తెలంగాణ ప్రాజెక్టులను ఆపండి

కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..

కృష్ణా, గోదావరి అపెక్స్ కమిటీలను వెంటనే సమావేశపరచండి
లేఖ ద్వారా కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలుగెత్తాక స్పందించిన సర్కారు
విభజన హామీల అమలుపైనా ప్రధానికి లేఖ
రుణమాఫీ మొత్తాలపై రైతులకు 10 శాతం వడ్డీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలుగెత్తి చాటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలివీ....

 తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, గోదావరిపై జీ-5, జీ-9, జీ-10 ఎత్తిపోతల పథకాలను వెంటనే నిలిపివేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రెండు బోర్డుల అపెక్స్ కమిటీ సమావేశాలను వెంటనే ఏర్పాటు చేశాలి. పునర్విభజన చట్టా న్ని తెలంగాణ ఉల్లంఘిస్తున్న తీరుపై చర్చిం చాలి. అప్పటివరకూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాయాలి. రెండు నదులపై ఎగువన ఇష్టానుసారం ప్రాజెక్టులు కట్టడం వల్ల దిగువనున్న ఏపీ తీవ్రం గా నష్టపోతుందనే విషయా న్ని లేఖలో పేర్కొనాలి. అవసరమైతే దీనిపై కోర్టుకైనా వెళ్లాలని నిర్ణయం.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ అంశాలను కేంద్రం ఇంకా తేల్చని నేపథ్యంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి మరో లేఖ రాయాలి.

 రెండో విడత రుణమాఫీ కింద 35.41 లక్షల మంది రైతులకు ఈ నెలలో రూ.3,331 కోట్లు చెల్లించేందుకు నిధులు విడుదల. ఈ మొత్తంపై రైతులకు పది శాతం వడ్డీ చెల్లింపు. రుణమాఫీ పథకం ప్రకటించినప్పటి నుంచి ఈ వడ్డీ ఇవ్వాలని నిర్ణయం. 1.6లక్షల ఉద్యా న రైతులకు రూ.384.47 కోట్లు విడుదల.

 రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లో నిధుల సమీకరణకు తమిళనాడు, గుజరాత్ తరహాలో ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) ఏర్పాటు. 

 రాష్ట్రంలో ఎంసెట్ ద్వారానే మెడికల్ సీట్లు భర్తీ చేయాలని సుప్రీంకోర్టును కోరాలి. ‘నీట్’ నుంచి ఏపీకి మినహాయింపునిచ్చే విషయంపై సుప్రీంకోర్టులో వాదించేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి.  

 అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణను పెంచేందుకు యోగా, కూచిపూడిని ప్రవేశపెట్టాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన దాంట్లో చేరేందుకు అవకాశం ఇవ్వాలి.

 భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రూ.854 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. భూసేకరణ తర్వాత ఈ పోర్టును పీపీపీ విధానంలో నిర్మించాలి. నెల్లూరు జిల్లా దగదుర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.200 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వ గ్యారంటీ.

యూనివర్సిటీల్లో స్టార్టప్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఐటీ విధానం. విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement