నగదు రహితం వైపు అడుగులు | Sakshi
Sakshi News home page

నగదు రహితం వైపు అడుగులు

Published Tue, Dec 27 2016 2:19 AM

నగదు రహితం వైపు  అడుగులు

ఆరెపల్లి గ్రామస్తుల నిర్ణయం
 ఇప్పటికే గ్రామపంచాయతీతీర్మానం
గ్రామంపై కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ
అందరికీ బ్యాంకు ఖాతాలు,  ఏటీఎంలు అందించడంపై దృష్టి


గీసుకొండ : వంద శాతం నగదు రహిత లావాదేవీలు సాధించే దిశగా గీసుకొండ మండలంలోని ఆరెపల్లి గ్రామం అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా నగదు రహిత లావాదేవీలు జరిగేలా  గ్రామాల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆరెపల్లి గ్రామస్తులు కూడా పూర్తిగా నగదు రహిత లావాదేవీలవైపు మొగ్గుచూపాలని గ్రామపంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఈక్రమంలోనే గ్రామంలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి బ్యాంకు అకౌంట్‌ ఉండేలా చర్యలు చేపట్టారు.

పూర్తయిన సర్వే
గ్రామంలో ఎంత మందికి అకౌంట్లు ఉన్నాయో, లేని వారెవరు అనేది తెలుసుకోవడానిని సాక్షర భారత్‌ గ్రామ కోఆర్డినేటర్‌ ద్వారా ఇంటింటి సర్వే చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో 602 మందికి బ్యాంకు అకౌంట్లు లేని వారు కేవలం 25 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరికీ త్వరలో బ్యాంకు ఖాతాలను తెరిపించే పనిలో సర్పంచ్, తదితరులు నిమగ్నమయ్యారు. గ్రామంలోని చాలా మందికి మండలంలోని ఊకల్‌  కార్పొరేషన్‌ బ్యాంకు, మచ్చాపూర్‌లోని గ్రామీణ వికాస్‌ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. అయితే, ఖాతాలు ఉండడమే కాదు.. అందరికీ ఏటీఎం కార్డులు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో కార్పొరేషన్‌ బ్యాంకు మినీ శాఖ ఉండగా.. ఇక్కడ స్వైప్‌ మిషన్‌ వాడుతున్నారు. అలాగే రెండు కిరాణాషాపులతో పాటు ఇద్దరు మక్కల వ్యాపారులు గ్రామంలో ఉన్నారు. వీరికి సైతం త్వరలో స్వైప్‌ మిషన్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సర్పంచ్‌తో కలెక్టర్‌ సమీక్ష
ఆరెపల్లె గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈనెల 19వ తేదీన జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ తుమ్మనపెల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురునగదు రహిత లావాదేవీల విషయమై కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మరుసటి రోజు సర్పంచ్‌ను పిలిపించుకుని నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామాన్ని తీర్చిదిద్దాలని.. ఇందుకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ను పిలిపించి అందరికీ ఖాతాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని పూర్తిగా నగదురహిత లావాదేవీలు జరిగేలా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా అనుకున్నవన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆరెపల్లె కూడా ఇబ్రహీంపూర్‌ సరసన నిలవనుంది.

15 రోజుల్లో పూర్తి చేస్తా
 తుమ్మనపెల్లి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్‌

రానున్న 15 రోజుల్లో గ్రామంలోని అందరికీ బ్యాంకు ఖాతాలతో పాటు ఏటీఎం కార్డులు అందేలా కృషి చేస్తున్నాం. ఆ తర్వాత స్వైప్‌మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గ్రామం నుంచి నగరానికి వెళ్లి ఆర్థిక లావాదేవీలు చేసే వారి వద్ద  ఏటీఎం కార్డులు ఉండటంతో నగదు కొరత సమస్య ఎదురుకాదు.

Advertisement
 
Advertisement
 
Advertisement