ఇసుక దందా

ఇసుక దందా - Sakshi


అదే అధికార పార్టీ నేతల పంథా

నదీ పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

చోడవరం ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఇసుక రవాణా

 బెల్లం పెనాల్లో నది నుంచి ఇసుకను  ఒడ్డుకు చేరుస్తున్న ఇసుకాసురులు




నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు.. అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు, శిక్షలు వేసినా ఆగని దందాలు.. ఇసుక మాఫియా

ఎక్కడా తగ్గడంలేదు.. దీనికి కారణం కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. జిల్లాలో మేజర్‌ శారద, మైనర్‌ శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, తాండవ నదులు ప్రధానంగా ఉన్నాయి. అనుమతి లేకుండా ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇసుక రీచ్‌లను అక్రమంగా ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.



చోడవరం :ఇసుకాసులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చోడవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, అనకాపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, కశింకోట మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ఈ ఇసుక మాఫియాకు పరోక్షంగా అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో ఇసుక రీచ్‌లపై అధికారులు దాడులు చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి చేసి వారిని విడిపించుకెళ్లడం పరిపాటిగా జరుగుతుంది. ఇటీవల చోడవరం వ ముద్దుర్తి, గవరవరం, జుత్తాడ, గజపతినగరం, గౌరీపట్నం, లక్ష్మీపురం కల్లాలు, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రీచ్‌లలో వందలాది క్యుబిక్‌ మీటర్ల ఇసుకను అధికారులు పట్టుకున్నారు. వీటిలో బుచ్చెయ్యపేట మండలంలో పట్టుకున్న కొన్ని లారీలను స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేర అధికారులు వదిలేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద మేజర్‌ శారదనదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.



ఇక్కడే గతంతో అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న బెల్లం పెనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. అయినా ఈ రేవు వద్ద మళ్లీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న రేవులో పూర్తిగా ఇసుక తవ్వేసి లోతు చేశారు ఇసుకాసురులు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయం, స్నానాల రేవు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర స్నానఘట్టం కూడా నది నీటిలో తెలియని భారీ గోతులుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది.  

 

బెల్లం పెనాల్లో ఇసుక తరలింపు


అన్ని చోట్ల నదుల్లో జేసీబీలు, ఇతరత్ర రూపాల్లో ఇసుకను తవ్వేసి ఒడ్డుకు చేరుస్తుంటే ఇక్కడ మాత్రం బెల్లం తయారుచేసే పెద్దపెద్ద పెనాల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. ఆలయం ఒడ్డు నుంచి నది అవతల ఒడ్డు, మధ్యలో ఉన్న ఇసుక మేట్లను తవ్వి పెనంలో వేసి ఈదుతూ ఇవతల ఒడ్డుకు తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. ఇక్కడ నుంచి లారీలు, యడ్ల బళ్లపై ఇతర ప్రాంతాలకు తరలించి రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నారు.

 

పట్టించుకోని యంత్రాంగం

ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్, పోలీసులు పంచాయతీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగానే రోజూ పెద్దసంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తున్నా వీఆర్‌ఓలు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు అంటున్నారు.

 

ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం

సంగమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఇసుక తవ్వకాలపై ఇప్పటికే దాడులు చేశాం. మళ్లీ ఈ రేవుతోపాటు మిగతా రీచ్‌లపై కూడా దాడులు చేస్తాం. కొత్త నిబంధనల ప్రకారం దొరికిన లారీకి రూ.లక్షకు పైగా జరిమానా, రెండేళ్లు జైలు కూడా పడుతుంది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. వెంటనే తవ్వకాలు ఆపకపోతే కేసులు నమోదు చేస్తాం.

–రామారావు, తహసీల్దార్, చోడవరం

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top