పెసర సాగు ఇలా చేస్తే బాగు
జహీరాబాద్ ప్రాంత రైతులు ఖరీఫ్ సీజన్‌లో సోయాబీన్, పత్తి, కంది తదితర పంటలతో పాటు ప్రధానంగా పెసర పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తారు.
- సస్యరక్షణ చర్యలతో మేలు
- తెగుళ్ల బెడద అధికం
- సకాలంలో స్పందిస్తే అధిక దిగుబడులు
- ఏడీఏ వినోద్‌కుమార్ సలహా సూచనలు
జహీరాబాద్ టౌన్:జహీరాబాద్ ప్రాంత రైతులు ఖరీఫ్ సీజన్‌లో సోయాబీన్, పత్తి, కంది తదితర పంటలతో పాటు ప్రధానంగా పెసర పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే చౌడు లేని భూముల్లో పెసర పంట సాగుచేసుకోవచ్చని జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ ఏడీఏ వినోద్‌కుమార్ (8886612477) తెలిపారు. చౌడు తప్ప అన్ని రకాల నేలల్లో పెసర పండుతుంది. పెసర పంటలకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. కాబట్టి పంట కాత దశలో ఉండగా తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అందుకని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి వస్తుందన్నారు. పెసర పంట సాగు-తెగుళ్ల నివారణ గురించి ఆయన రైతులకు ఇస్తున్న సలహా సూచనలివీ..
పెసరలో రకాలు
- ఎల్‌జీజీ 407, ఎల్‌జీజీ 450, ఎల్‌జీజీ 460, టీఎం 92.. ఇవి జహీరాబాద్‌తో పాటుగా చౌడు లేని భూములున్న ప్రాంతాలు అనుకూలం.
- తొలకరి వర్షాలు కురిసిన తరువాత నేలలో తేమ చేరినప్పుడు విత్తనాలు నాటాలి.
- ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు నాటాలి.
- వరి పంట తరువాత అదే చేనులో పెసర పంట వేసుకోవచ్చు.
- వరికి వేసిన ఎరువులు నేలల్లో నిలువ ఉంటాయి. కాబట్టి పెసరకు ప్రత్యేకంగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు.
- పచ్చిరొట్ట దున్నిన పొలంలో పెసర పంట వేస్తే పెద్దగా ఎరువుల అవసరం ఉండదు.
- పెసర పైరు 25-30 రోజల వయసులో ఉన్నప్పుడు ఎకరాకు 10-15 కిలోల యూరియా వేయాలి.
- పెసర రకాన్ని బట్టి 60-70 రోజుల్లో అధిక శాతం కాత ఎండి కోతకు వస్తుంది.
తెగుళ్ల నివారణ
మారుక మచ్చ పురుగు: పెసర పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. ప్రధానంగా మారుక మచ్చ పురుగును పూత పురుగు లేదా గూడ పురుగు, బూజు పురుగు అని కూడా పిలుస్తారు. ఈ రకం పిల్ల పురుగులు పువ్వు మొగ్గలోకి చొచ్చుకుపోయి లోపలి భాగాలను తింటాయి. తరువాత దశలో లేత ఆకులను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసుకుంటాయి. గూడు లోపలనే ఉంటూ లోపలి పదార్థాలను తినడం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి చొరబడి కాయలోని గింజలను తిని దానిని డొల్లగా మారుస్తుంది.
అందుకని పూత దశలో పైరుకు ఐదుశాతం వేప గింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పిల్ల పురుగులు అధికంగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ధయోగికార్బ్ 1 గ్రాము లేక ఎసిఫేట్ 1 గ్రాము చొప్పున కలిపి పంటకు పిచికారి చేయాలి. పంటలో గూళ్లు కనిపిస్తే లీటరు నీటికి ఎసిఫెట్ 1.5 మి.లీ లేదా నోవాల్యురాన్ 0.75 మి.లీ మందుతో 1 మి.లీ డైక్లోరోవాస్‌ను కలిపి పైరుపై పిచికారి చేయాలి. పురుగు ఉదృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 0.4 మి.లీ లేదా ఇమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండ్‌మైడ్ 0.3 మి.లీ చొప్పున లీటరు నీటిని కలిపి పంటపై పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు: ఈ పురుగు పెసర పంట ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తింటాయి. దీంతో ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రం చేసి పువ్వులను పిందెలను తింటాయి. పొగాకు లద్దె పురుగు రాత్రి పూట ఆశిస్తాయి. పగలు మొక్కల మొదళ్లలో, పొలం నెర్రల్లో ఉంటాయి. ఈ పురుగు నివారణకు మోనోక్రోటోపాస్ 1.5 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
మొజాయిక్ తెగులు: తెల్లదోమ నుంచి ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు కారణంగా మొక్క ఆకులు, కాయల మీద పసుపు పచ్చ పొడలు ఏర్పడతాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. పెసర పంటకు ఈ తెగులు ఆశిస్తే లీటరు నీటిలో 1.6 మి.లీ. మెనోక్రోటోఫాస్, లేదా 2 మి.లీ డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.


