గ్రూప్‌–3 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు | group 3 exam arrangements | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–3 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Apr 21 2017 10:19 PM | Updated on Sep 5 2017 9:20 AM

గ్రూప్‌–3 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

గ్రూప్‌–3 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

ఈ 23న గ్రూప్‌–3 పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని రాధాకృష్ణమూర్తి తెలిపారు.

23న జిల్లాలో 143 కేంద్రాల్లో నిర్వహణ
  జాయింట్‌ కలెక్టర్‌ రాధాకృష్ణమూర్తి
కాకినాడ సిటీ : తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 23న గ్రూప్‌–3 పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామమని జాయింట్‌ కలెక్టర్‌ జె.రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. గ్రూప్‌–3 పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశమందిరంలో లైజాన్‌ ఆఫీసర్లు, సహాయ లైజాన్‌ ఆఫీసర్లు, పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఐదు డివిజన్‌ కేంద్రాల్లో 143 కేంద్రాల్లో  పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–3 విభాగంలో పంచాయతీ గ్రేడ్‌–4 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు 62,671 మంది పరీక్షకు హాజరు కానున్నారన్నారు.
 
కాకినాడలో 51, పెద్దాపురంలో 31, అమలాపురంలో 13, రాజమండ్రిలో 29, రామచంద్రపురంలో 19 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలను 39 రూట్లుగా విభజించి తహసీల్దార్‌లను లైజాన్‌ అధికారులుగా, డిప్యూటి తహసీల్దార్, సీనియర్‌ అసిస్టెంట్‌లను సహాయ లైజాన్‌ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. సంబంధిత పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయిందన్నారు. 23న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులను ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకూ మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డ్, ప్రభుత్వ ఉద్యోగ ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటిది ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకొన్న హాల్‌ టికెట్‌లో అభ్యర్థి ఫోటో లేకున్నా, అస్పష్టంగా, బాగా చిన్నదిగా ఉన్నా, సంతకంతో లేకున్నా అలాంటి సందర్భాల్లో అభ్యర్థులు తమ 3 పాస్‌పోర్టు ఫోటోలను ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేకుంటే పరీక్షకు అనుమతించరన్నారు.
 
అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు తమ వెంట రైటింగ్‌పాడ్, నలుపు, నీలం బాల్‌ పెన్నులు  తెచ్చుకోవాలన్నారు. అంధులకు, రెండు చేతులు లేని వారు పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. అంధులకు  ప్రతి గంటకు 20 నిమిషాలు అదనపు సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. లైజాన్‌ అధికారులు, సహాయ లైజాన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి టి.అలివేలుమంగ, సెక్షన్‌ ఆఫీసర్లు జీకే ప్రసూన, టి.శ్రీనివాసరావు, పి.శంకరరావు, కలెక్టరేట్‌ పర్యవేక్షణాధికారి రామ్మోహనరావు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement