ఖమ్మం వ్యవసాయం: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వర్షపాతం ఒక్కసారిగా పుంజుకుంది. మంగళవారం జిల్లాలో తొమ్మిది మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మణుగూరు మండలంలో 4.66 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కామేపల్లి మండలంలో 3.88 సెం.మీ.; నేలకొండపల్లి, కొణిజర్ల, తల్లాడ, గార్ల, బయ్యారం, సింగరేణి, వెంకటాపురం, వాజేడు, ముల్కలపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో 1 - 3 సెం.మీ,ల మధ్యన; ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, వైరా, చింతకాని, ముదిగొండ, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, అశ్వారావుపేట, జూలూరుపాడు, ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, పినపాక, చర్ల మండలాల్లో 1 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. మిగిలిన తొమ్మిది మండలాల్లో వర్షం కురవలేదు. ఈ వర్షాల కారణంగా గోదావరి వరద పెరిగింది. జలాశయాల్లోకి నీటి వరద వస్తోంది. ప్రాజెక్టులు నిండాయి. పాలేరు, వైరా రిజర్వాయర్లులోకి నీరు చేరుతోంది.
-
జూన్ నుంచి వర్షపాతం ఇలా..
- జూన్‌లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 127 మి.మీ.కుగాను 337.1 మి.మీ. (164.4 శాతం అధికం) వర్షపాతం నమోదైంది.
- జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు అంతగా కురవలేదు. జూలైలో సాధారణ వర్షపాతం 309 మి.మీ.లకుగాను కేవలం 185.8 మి.మీ. మాత్రమే (39.8 శాతం లోటు) నమోదైంది.
- ఆగస్టులో సాధారణ వర్షపాతం 276 మి.మీ.కుగాను 156.7 మి.మీ. మాత్రమే (43.2 శాతం లోటు) నమోదైంది.
- ఖరీఫ్ సీజన్ గడిచాక సెప్టెంబ నెలలో వర్షాలు అందుకున్నాయి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 164 మి.మీ. 27వ తేదీ నాటికి 147.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటివరకు 272.8 మి.మీ. వర్షపాతం (85 శాతం అధికం) నమోదైంది.
- కూసుమంచి మినహా అన్ని మండలాల్లో కొన్నిచోట్ల సాధారణం, మరికొన్నిచోట్ల అంతకు మించి వర్షపాతం నమోదైంది.
- ఆగస్టులో 19 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. సెప్టెంబర్ అంతానికి ఒకే ఒక్క మండలం మాత్రమే లోటు వర్షపాతంలో ఉంది. 28 మండలాలు సాధారణ, 12 మండలాలు అధిక వర్షపాతంలో ఉన్నాయి.
పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్‌లో సాగు చేసిన వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయి.
- ప్రధానంగా జిల్లాలో పత్తి 1.22 వేల హెక్టార్లలో, మిర్చి 30వేల హెక్టార్లలో, వరి 80వేల హెక్టార్లలో సాగయింది. ఈ వర్షాలతో వీటికి నష్టం వాటిల్లుతోంది.
- ఏపుగా పెరిగిన పత్తి నేలవాలటంతో పూత, కాత దెబ్బతింటోంది.
- మిర్చి పైరు నేలవాలింది. గాలి, నేలలో తేమ అధికంగా ఉండటంతో పైర్లు తెగుళ్లబారిన పడుతున్నాయి. నీరు నిలవడంతో మొక్కలు కుళ్లిపోయే పరిస్థితేర్పడింది.
- ఇప్పటికే కొన్ని మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అశ్వారావుపేట మండలంలో వేరుశనగ 40 హెక్టార్లలో, మినుము 12 హెక్టార్లలో; కొత్తగూడెం మండలంలో పత్తి 50 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు వారు చెప్పారు.
- ప్రకృతి వైపరీత్యాలతో 50 శాతానికి పైగా పంట దెబ్బతింటేనే పరిహారం వర్తిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం.. ఇప్పటివరకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందదనే చెప్పాలి.
- అధిక వర్షపాతం (12 మండలాలు): పినపాక, గుండాల, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం, టేకులపల్లి, ముల్కలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి.
- సాధారణ వర్షపాతం (28 మండలాలు): వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సింగరేణి, బయ్యారం, గార్ల, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం.
-లోటు వర్షపాతం: కూసుమంచి