జిల్లాలో మల్టీ సెక్టోరల్ డెవలప్‌మెంట్ పథకం కింద రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు...
- మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ విజయకుమార్
కర్నూలు(అర్బన్): జిల్లాలో మల్టీ సెక్టోరల్ డెవలప్‌మెంట్ పథకం కింద రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. మల్టీ సెక్టోరల్ డెవలప్‌మెంట్ పథకం అమలుకు సంబంధించి ప్రస్తుతం రూ.11.80 కోట్లు విడుదల చేశామన్నారు.
పట్టణాభివృద్ధిలో భాగంగా మైనారిటీలకు ఆదోనిలో ఐటీఐ కళాశాల, నందికొట్కూరులో ఉర్దూ జూనియర్ కళాశాల, ఆత్మకూరులో ప్రైమరీ హెల్త్ సెంటర్, చాగలమర్రిలో ఉర్దూ ఉన్నత పాఠశాల, సిరివెళ్లలో ఉర్దూ పాఠశాలతో పాటు జిల్లాలోని నాలుగు బ్లాకులలోని పాఠశాలల్లో 116 అదనపు తరగతి గదుల నిర్మాణాలు, 20 అంగన్‌వాడీ కేంద్రాలకు నిధులు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం బీ క్యాంప్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఏపీ బాలికల (మైనారిటీ) ఇంగ్లిషు మీడియం పాఠశాలకు దిన్నెదేవరపాడులో 4.90 ఎకరాల స్థలంలో సొంత భవనం నిర్మించేందుకు రూ.10 కోట్లతో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. దుల్హన్ పథకం అమలులో కర్నూలు జిల్లా ముందంజలో ఉండి ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
వక్ఫ్ భూముల పరిరక్షణకుచర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అహమ్మద్, వక్ఫ్‌బోర్డు సీఈఓ షేక్ ఖాదర్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ కరీముల్లా, మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.