"ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం" | defection is a mockery of democracy | Sakshi
Sakshi News home page

"ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం"

Jul 29 2016 3:40 PM | Updated on Sep 4 2018 5:21 PM

సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పార్టీల ఫిరాయింపులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పార్టీల ఫిరాయింపులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పలు సంఘాల నేతలతో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలన్నారు. బలమైన పౌర సమాజం ద్వారా ప్రజలను జాగతులను చేస్తేనే ఫిరాయింపులను నిరోధించవచ్చన్నారు.

 

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని తక్షణమే అనర్హులను చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు. స్పీకర్లు అధికార పార్టీకి తొత్తులుగా మారి సత్వర నిర్ణయాలు తీసుకపోవటం శోచనీయమని తెలిపారు. స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశం పార్టీలకు ఉండాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన మాటను నిలబె ట్టుకొని, పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేపట్టాలని చెప్పారు.

 

రాజ్యాంగంలో 10వ షెడ్యూల్డ్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో సవరణ చేయాలని కోరారు. 20వ లా కమిషన్ సిపార్సులకు అనుగుణంగా రాష్ట్రా స్థాయిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై అనర్హత వేటును ఎన్నికల సంఘం సిఫార్స్ మేరకు గవర్నర్ చేపట్టాలని చెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీలు ఫిరాయించే ఎంపీలపై అనర్హత వేటు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రపతి చేపట్టాలన్నారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పార్టీ ఫిరాయింపులు - ప్రమాదంలో ప్రజాస్వామ్యం’పై రాష్ట్ర స్థాయి సెమినార్’ను పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 

ప్రజాహితం కోరే అందరూ హాజరుకావాలని కోరారు. సెమినార్‌లో ప్రముఖ న్యాయ కోవిదులు జస్టిస్ బి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా కో -ఆర్డినేటర్ ఎం.చిదంబరరావు, అప్పా డెరైక్టర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, ఐఎఫ్‌హెచ్‌డీ ప్రతినిధి కె. హరిశంకర్ శర్మ, జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement